Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News హర్మూజ్‌పై ఇరాన్‌ కఠిన వైఖరి.

హర్మూజ్‌పై ఇరాన్‌ కఠిన వైఖరి.

by CVR NEWS

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్‌ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అమెరికా తన ధోరణిని మార్చుకుని, తమ డిమాండ్లను అంగీకరించే వరకు హర్మూజ్‌ను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులు ఆపాలని, నావికా దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. అలాగే తమ దేశం నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడంతో పాటు.. యుద్ధ నష్టానికి పరిహారం చెల్లించాలని షరతులు విధించింది.

విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులపై ఆంక్షలను కూడా బేషరతుగా ఎత్తివేయాలని ఇరాన్‌ కోరుతోంది. జులైలో ఇరు దేశాల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందంలో ఆంక్షల తొలగింపు, నష్టపరిహారం వంటి అంశాలపై తుది ఒప్పందంలో చర్చించేందుకు అంగీకారం కుదిరింది. అయితే ఆ చర్చలకు విధించిన 60 రోజుల గడువు మరో వారంలో ముగియనుంది. దీంతో గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే హర్మూజ్ జలసంధిని ముందుగా తెరవడంపై ఒప్పందం కుదిరితేనే మిగతా అంశాలపై చర్చిస్తామని అమెరికా పట్టుబడుతోంది. హర్మూజ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవాల్సిందేనని అమెరికా స్పష్టం చేస్తుండగా.. తమ డిమాండ్లు నెరవేరే వరకు జలసంధిని తెరవబోమని ఇరాన్‌ తేల్చిచెబుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. హర్మూజ్‌ విషయంలో ఇరాన్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరోవైపు హర్మూజ్ జలసంధి నిర్వహణ కోసం ఒమన్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ తుది దశకు చేరినట్లు ఇరాన్‌ వర్గాలు వెల్లడించాయి. రవాణా మార్గంపై త్వరలోనే ఏకాభిప్రాయం కుదరవచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతకు చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా.. లేక హర్మూజ్‌పై ప్రతిష్ఠంభన మరింత ముదురుతుందా అన్నది కీలకంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: