వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. భారత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా 2 రూపాయల 84 పైసలు, అటు డీజిల్ పై 2 రూపాయల 86 పైసలు చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమలులోకి రాబోతున్నాయి.
ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే నాలుగు సార్లు చమురు ధరలు పెరిగినట్లు అయింది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఎన్నికలు పూర్తికాగానే, బాదుడు చేసిందని మోడీ సర్కార్ పై జనాలు విమర్శలు చేస్తున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117 రూపాయల 19 పైసలు కాగా డీజిల్ రేటు 104 రూపాయల 88 పైసలకి చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయల 68పైసలకు చేరనుండగా, డీజిల్ రేటు 103 రూపాయల 74పైసలకు చేరుకుంటుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఓపిక పట్టిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు వరుసగా ఇంధన ధరల్ని పెంచుతూ పోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు పెట్రోల్ ధర 2 రూపాయల 61పైసలు చొప్పున పెరిగి లీటరుకు 102 రూపాయల 12 పైసలకు చేరింది. ఇక డీజిల్ ధర 2 రూపాయల 71 పైసల మేర పెరగ్గా ప్రస్తుతం లీటరు ధర 95 రూపాయల 20 పైసల వద్ద ఉంది. ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం సహా ఇదే సమయంలో రూపాయి పతనం అవుతుండటం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పడుతోంది. చాలా రోజులు ఓపిక పట్టి ధరల్ని పెంచుకుండా స్థిరంగా ఉంచినప్పటికీ.. ఇక తప్పని పరిస్థితుల్లో ధరల్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది.





Total views : 212237