శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలై డీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నానని కానీ పార్టీ నాకు చేసిన అవమానం మానసిక వేదనను, భరించలేని బాధను కలిగించిందని రాజయ్య వాపోయారు. ప్రస్తుత పార్టీ విధివిధానాలు నచ్చడం లేదని అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నాకు టికెట్ ఇవ్వకపోవడం కారణంగా మాదిగ సామాజికవర్గ అస్తిత్వం మీద దెబ్బపడిందన్నారు. నా సామాజిక వర్గానికి క్షమాపణలు చెబుతున్నానని ఆరు నెలలుగా ఎంతో మానసిక క్షోభకు గురయ్యాయని రాజయ్య చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామని మాట్లాడటం కరెక్ట్ కాదని రాజయ్య హితవు పలికారు.
Brs
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని, ఆ సాహసం చేస్తే ప్రజలే వారిని తరిమికొడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి త్వరలోనే 500కు గ్యాస్ సిలిండర్ , 200యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభా వేదికగా ప్రకటించి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ప్రధాని మోడీకి కేసీఆర్ తాకట్టు పెడతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని హరీష్ రావు ఆరోపించారు. కార్యకర్తలందరూ కష్టపడండి.. ఎంపీ సీటు మనదే. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దాం. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయి. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుంది. కర్నాటక కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అక్కడి 25 ఎంపీ సీట్లలో నాలుగైదు మాత్రమే వస్తాయంటున్నారు. ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని హరీష్ రావు విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. అయితే, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించకపోవడం గమనార్హం. తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేసీఆర్ చాలా వరకు కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. హ్యాండ్ స్టిక్ ఆధారంగా, ఎవరి సహాయం లేకుండానే కేసీఆర్ నడిచారు. ముఖ్యమంత్రిగా గత పదేళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన కేసీఆర్ ఈరోజు గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి తన అల్లుడు హరీశ్ రావుకు గడ్డి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలని చురక అంటించారు. రేవంత్ రెడ్డి చెప్పేది కొండంత కానీ చేసేది గోరంత కూడా లేదన్నారు. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని విమర్శించారు. తామే రిక్రూట్మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం వంచించిందని అబద్ధపు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని తెలిపింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేశారు. వారు ప్రమాణం చేయాల్సి ఉంది.అయితే వీరి నియామకాలను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గత ఎమ్మెల్సీ అంశం తేలే వరకు వారి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా నిబంధనల ప్రకారం లేదని గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. అయితే తమను తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రి కాగానే అధికారమదంతో ప్రవర్తిస్తున్నారని ఆయనకు అహంకారం పెరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారిక కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి, అతని అనుచరులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. సందీప్ రెడ్డి వాళ్ల నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి సిగరెట్లు అందించుకుంటూ బతికావని ఆ విషయం మరిచిపోయవా? అని ప్రశ్నించారు. చరిత్ర తీద్దామా? వ్యక్తిగత విమర్శలు వద్దని ఇన్ని రోజులు ఊరుకున్నామని హెచ్చరించారు. ఉద్యమం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గెంటేస్తున్నాడని తెలిసి రాజీనామా చేసి పెద్ద త్యాగం చేశానంటూ డ్రామాలు చేశాడని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలు తిరగబడతారని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హెచ్చరించారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరని, మూడు ఫీట్లు లేనోడంటూ కేటీఆర్, హరీశ్ రావులు చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిపై వారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి మాటలు వారి అహంకారానికి పరాకాష్ట అన్నారు. ప్రజలు తీర్పు ఇస్తే ప్రజాస్వామ్యబద్దంగా ముఖ్యమంత్రి అయ్యారని రాష్ట్రంలో విప్లవాత్మక పాలన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజారంజకంగా, ప్రజాపాలన చేస్తూ ప్రజల మనసులలో ముఖ్యమంత్రి స్థానం సంపాదించారన్నారు. ఓ ముఖ్యమంత్రి పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తిరగబడతారన్నారు. పైగా ముఖ్యమంత్రికి హుందాతనం లేదని హరీశ్ రావు మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ ప్రజాపాలన అందిస్తూ హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని బీఆర్ఎస్ నేతలు తమ పద్దతిని మార్చుకోవాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉదయం ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, బయటకు వచ్చిన అనంతరం తన కారులో కాకుండా రోడ్డుపై ఓ ఆటో ఎక్కారు. ఆయన వెంట ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మైనార్టీ విభాగం నాయకుడు షేక్ అబ్దుల్లా సొహైల్ తప్ప భద్రతా సిబ్బంది ఎవరూ రాలేదు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్ వరకు ప్రయాణించారు. ఈ మేరకు ఆటోడ్రైవర్‌కు ఛార్జీ చెల్లించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటోవాలాల పరిస్థితి దుర్భరంగా మారిందని, వారికి సంఘీభావంగా ఆటోలో ప్రయాణించానని వెల్లడించారు. ఈ సమయంలో డ్రైవర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నానన్నారు. వారి డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ‘బస్సుల్లో మాదిరే ఆటోల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి, ఆ మేరకు ప్రభుత్వం మాకు డబ్బులు చెల్లించేలా చూడాలి’ అని ఆటోడ్రైవర్ ఆయన్ను కోరారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7న తన ఫాంహౌస్ బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో ప్రమాణం చేయనున్నారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45 వేల మెజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు.





Total views : 92849