సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమయి ఉన్నామని తెలిపారు. బీజేపీ అక్షింతల పేరిట రాముడిని రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. శ్రీరాముడు మంచివాడు కాదని ఎవరు కూడా అనరని, కానీ రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ను ఓడించిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో స్వీకరించిన దరఖాస్తులను, త్వరితగతిన పరిశీలించి ప్రజలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ చేపట్టడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
Brs
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరగనుంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష జరగనుంది. ఈ సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు,
కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ పసునూరి దయాకర్, తదితరలు హాజరుకానున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి మినహా ఆరు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ విజయం సాధించింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితమవడంతో అంతా ఆశ్చర్యపోయారు. సిట్టింగ్ ఎంపీగా వున్న పసునూరి దయాకర్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ దక్కక పోవచ్చనే ప్రచారం జరుగుతుంది. బిఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ రేసులో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఉండనున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది.
కార్యకర్తలు అధైర్యపడవద్దని అండగా ఉంటానని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గాలిలో 26 వేల మెజారిటీ తో గెలిచానని, కేసీఆర్ గాలిలో కూడా 23 వేల మెజారిటీతో గెలిచానని, కాని ఈ ఎన్నికల్లో ఎమోషనల్ టెంప్ట్ కు గురై మాత్రమే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని గెలుపోటములు సహజమని అన్నారు. గతంలో టెండర్లు పూర్తికాబడిన పనులను పూర్తి చేయాలని, ఆర్థిక శాఖ పూర్వ అనుమతులు వచ్చాకే మంజూరు చేశారని, ఆ పనులను కానసాగించాలని నిధులు లేవనే వంకతో ఆపవద్దని ప్రభుత్వానికి సూచించారు. కార్యకర్తల కష్టాలలో అండగా ఉంటానని, ప్రజాసమస్యల పరిష్కారంలో పోరాటాలకు సిధ్ధంగా ఉన్నానని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. సమీక్షలను నిర్వహిస్తూ గత పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కవిత గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించిందంటూ బీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శించారు. తాజాగా నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలతో కవిత సమావేశం నిర్వహించారు. 2019లో తాను ఓటమిపాలు కావడానికి సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల వైఖరే కారణమని ఆమె అన్నారు. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సమయంలో ఆయనను కార్యకర్తలు కలవకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టించారని చెప్పారు. తాను జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయమై తనకు ఫిర్యాదులు కూడా అందాయని చెప్పారు. తాను నిజామాబాద్ లోనే ఉంటానని… ఎవరైనా తనను కలవొచ్చని అన్నారు. అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్యరావు, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. సంగారెడ్డిలోని జడ్పి సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వే నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమానికి, సమస్యలను పరిష్కరించేనందుకు ముందు ఉండాలన్నారు. టిఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్లు, మంచినీటి సౌకర్యాలతోపాటు అర్హులకు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రజలకు మేలు చేసే గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పలువురు జెడ్పిటిసిలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వివాదంలో చిక్కుకున్నారు. గూండాలతో ఎమ్మెల్యే తనపై దాడి చేశారని రహమత్ నగర్ కాంగ్రెస్ నాయకుడు వేముల యాదయ్య ఆరోపించారు. ఎన్నికలలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందు వల్ల గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని వేముల యాదయ్య ఆరోపించారు. బోరబండ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే అనుచరులపై యాదయ్య ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వేముల యాదయ్య పై.. నిన్న రాత్రి గుర్తుతెలియని అగంతకులు దాడి చేశారు. ఈ దాడిలో వేముల యాదయ్య తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేయాలని.. గ్రూపు తగాదాలకు ఇక స్వస్తి పలకాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదని.. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కార్యకర్తలది తప్పు కాదని.. నాయకులుగా మనమే బాధ్యత వహించాలని సూచించారు. కాంగ్రెస్‌లో ఎవరు సమర్థులు ఉన్నారో ప్రజలు వాళ్లకు ఓట్లు వేశారని ప్రశ్నించారు. సంఖ్యా పరంగా కాంగ్రెస్ గెలువొచ్చు కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. కేసీఆర్ మరోసారి తెలంగాణ సీఎం కానందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకున్న కేడర్ మరే పార్టీకి లేదని, కష్టపడి పనిచేస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు రావడం కష్టమేమి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ. హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ. కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ పై కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని, కమీషన్ల కోసం ప్రాజెక్ట్‌ను నాణ్యతాలోపంతో డిజైన్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలన్న డీకే అరుణ. ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు.
బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉండగా..ప్రస్తుతం కాంగ్రెస్ కు 11 మంది కౌన్సిలర్లు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత చైర్ పర్సన్ శ్వేత తో కలిపి ఈ సంఖ్య 12 కు చేరింది. భారాసకు 21 మంది కౌన్సిలర్లు ఉండగా, భాజపాకు ఒక కౌన్సిలర్ ఉన్నారు. ఈ క్రమంలో భారాస కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 12న అవిశ్వాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించడానికి కౌన్సిలర్లకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, భారాస తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. భారాసకు చెందిన కౌన్సిలర్లు బస్సులో ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లారు. ఈ బస్సులో సుమారు 20 మంది భారాస కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లారు.
అమరావతి, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.




Total views : 92868