పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేదలు, అట్టడుగువర్గాలకు కరుణతో సేవ చేయాలనే ఆయన సందేశం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఏర్పాటుచేసిన భారతీయ జనసంఘ్ సహవ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి భారతీ పవర్ తెలుగు ప్రసంగం ఆకట్టుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విగ్రహాన్ని చెక్కిన వారు, ఏర్పాటు చేసిన వారు, ఆవిష్కరించిన వారు మహిళలే కావడం గర్వంగా ఉందన్నారు. సర్పంచి రాంధే లక్ష్మీసునీత, మహిళామోర్చా రాష్ట్రాధ్యక్షురాలు నిర్మలా కుమారి, మైనార్టీమోర్చా రాష్ట్రాధ్యక్షుడు బాజీ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని పొత్తులపై వివరాలు కోరగా అతిత్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Chebrolu
పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ అక్రమ గ్రావెల్ తరలింపుకు పాల్పడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణ చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజాపోరాటం పేరుతో ఆయన రెండు రోజుల పాటు పాదయాత్రకు సిద్ధమైనారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారినశేకూరు, వీరనాయకునిపాలెం, శలపాడు, వేజండ్ల, సుద్దపల్లి, చేబ్రోలు, వడ్లమూడి గ్రామాల మీదుగా పాదయాత్ర చేపట్టనున్నారు. గత నాలుగున్నరేళ్లలో 2200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్ పై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. గతంలో ఫిర్యాదుల ఆధారంగా విధించిన 5 కోట్ల రూపాయల ఫెనాల్టీ కూడా వసూలు చేయలేదని ధ్వజమెత్తారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు, అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదన్నారు. గతంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ స్థాయిలో, నేడు కిలారు మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరగుతోన్నాయంటూ ఆయన ఆరోపణ చేశారు.




Total views : 78838