తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ నిన్న 16 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పటాన్చెరు నుంచి నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో పటాన్చెరు కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంది. టిక్కెట్ దక్కని నేతల అనుచరులు నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంపై ఇతర ఆశావహులు గుర్రుగా ఉన్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉండగా, మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ… ఆందోళన చేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులకు ఫోన్ చేసి సముదాయించారు. టిక్కెట్ శ్రీనివాస్ గౌడ్‌కే ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
#congressparty
తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలనే ఆకాంక్ష సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాం. అందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించాలనే మొదలగు అంశాలతో కూడిన తమ ఎజెండాను కాంగ్రెస్ పార్టీకి సమర్పించాం. ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, అమరవీరుల కుటుంబాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్న తమ డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అందుకే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.
మునుగోడు సీటును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించటంపై కాంగ్రెస్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాలో మునుగోడు సీటును కేటాయించింది. మునుగోడు సీటు రాజగోపాల్ రెడ్డికి కేటాయించడాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు నిరసనగా రాజగోపాల్ రెడ్డి అమర్ రహే అంటూ దిష్టిబొమ్మని తగులపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీని కష్టకాలంలో వదిలేసి ఎన్నికల సమయంలో తిరిగి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి, ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధం అని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. తనకు సొంత ఇల్లు లేకపోయినా బాధపడనని, కోట్లాది ప్రజల హృదయాల్లో తనకున్న స్థానం చాలని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటాయన్నారు. అసోం, రాజస్థాన్, మహారాష్ట్రలో మేం ఎక్కడ బీజేపీతో పోరాటం చేస్తుంటే అక్కడ ఎంఐఎం తన అభ్యర్థులను దింపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ తీసుకువచ్చిన బిల్లులన్నింటికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటున్నారని రాహుల్ వివరించారు.





Total views : 90575