ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి సారథ్యం వహిస్తున్న భారత్..ఆ హోదాలో స్వతంత్రపాత్ర పోషించి ఇరాన్‌పై దురాక్రమణల్ని అడ్డుకునే చర్యలు చేపట్టాలని కోరారు ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. ‘‘విదేశీ జోక్యం లేకుండా’’ పశ్చిమాసియా దేశాలు ఒక ప్రాంతీయ భద్రత వ్యవస్థగా ఏర్పడాలని ప్రతిపాదించారు. పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్ మాట్లాడిన సందర్భంగా అణ్వాయుధాలు సమీకరించుకోకుండా అడ్డుకునేందుకే..తమపై సైనిక దాడికి దిగినట్లు అమెరికా చెప్పడాన్ని ఆయన ఖండించారు. దివంగత సుప్రీంనేత ఖమేనీ ఈ ఆయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని, వాటి అభివృద్ధికి ఎలాంటి ముందడుగు వేయకూడదంటూ పాలనాపరమైన, మతపరమైన ఆదేశాలు జారీచేశారని ఇరాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలపై దాడుల్ని ఖండించారు. నౌకాయాన స్వేచ్ఛను కాపాడాలని, ఆయా మార్గాలు సురక్షితంగా.. తెరచి ఉండేలా చూడాలని నొక్కిచెప్పారు. పశ్చిమాసియా ప్రాంతానికి శాంతి-సుస్థిరతను, సుసంపన్నతను తీసుకురావాలని ఆకాంక్షించారు.
Tag: