మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో గత నాలుగు సంవత్సరాల నుండి విపరీతమైన క్రైమ్ జరుగుతుందని అన్నారు. శిల్పా వెంచర్ లో మైనర్ బాలిక అనుమానస్పదంగా చనిపోయిన విషయం రెండు రోజులుగా వింటున్నామని అన్నారు. దానిపైన పోలీసులు గాని ఎమ్మెల్యే గాని ఎందుకు స్పందించడం లేదని కొంతమంది మాట్లాడుకోవడం, మీడియా లో అమ్మాయిని రేప్ చేసి చంపినట్లు అనుమానిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసులు ఎమ్మెల్యే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరుడే మద్యం అమ్ముతూ పట్టుబడ్డాడని, అభివృద్ధి పై ఎమ్మెల్యే తో చర్చకు సిద్ధమని, ఎక్కడకి చెబితే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. నేను ఎవరితో టచ్ లో లేను శిల్పా వారే టీడీపీ తో టచ్ లో వున్నారని అన్నారు. టిక్కెట్ కోసమే అందరం కష్ట పడుతున్నామని ఒకవేళ టిక్కెట్ రాకపోతే అప్పుడు మాట్లాడుతానని ఆయన అన్నారు. పార్టీ పదవులు మార్చాలంటే అచ్చం నాయుడు నుంచే రావాలని, చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
kurnool district news
ఈ నెల 21న రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నంద్యాలకు విచ్చేస్తున్నారని బిజెపి నంద్యాల కన్వీనర్ అభిరుచి మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురందేశ్వరి మేడం నంద్యాలకు రాగానే బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో మొదలై రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీ కార్యక్రమం జరుగుతుందని ఇక్కడి నుంచి బూత్ కమిటీ సభ్యులను, పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్లతో, నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని పలు కూడళ్లలో తిరిగి చివరగా సౌజన్య కన్వెన్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంచార్జ్ కె యి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రాంపల్లి గ్రామానికి చెందిన మద్దికేర సూరన్న, ఊరు ఆవుల పెద్దయ్య, కురువ రంగన్న, కురువ మల్లికార్జున, మద్దికేర ఓబులేసు, మారికి కోదండ బావిగడ్డ పెద్ద ఓబులేసు, ఏకాశి ప్రసాద్, ముట్టి వెంకట్ రాముడు, మద్దికేర పరుశురాముడు, కిష్టయ్య, బుగ్గల బ్రహ్మయ్య, మహేష్ మద్దికేర సుఖాలు, మారికి పెద్దయ్య, చిట్యాల రంగన్న, చందోలి గ్రామానికి చెందిన సలీం తదితరులు వారి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది.
ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది. తుగ్గలి మండలం రాతన కొత్తూరుకు చెందిన లక్ష్మీదేవిని(55) పొలాన్ని తన పేరు పైకి మార్పించాలని ఒత్తిడి చేస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కొడుకు లిఖిత్ రెడ్డి ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. లక్ష్మీదేవికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొంతకాలం కిందటే భర్తను పోగొట్టుకున్న లక్ష్మీదేవి కూతురికి పెళ్లి చేసింది. ఆ తర్వాత పొలాన్ని తన పేరు పైకి మార్చాలని తల్లితో తరచుగా లిఖిత్ రెడ్డి గొడవపడేవాడు. కొడుకుతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక రాతనలోని తన బంధువుల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే గత రాత్రి తల్లికి ఫోన్ చేసి పెళ్లి సంబంధానికి వస్తున్నారని రావాలని చెప్పాడు. హత్య చేయాలని ఉద్దేశంతోనే తనను రమ్మన్నాడని తెలుసుకోలేని తల్లి స్వగ్రామానికి వచ్చింది. ముందుగానే అనుకున్న ప్రకారం ఇంటికి చేరుకున్న లక్ష్మీదేవిని వ్యవసాయానికి వాడే ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో అక్కడికి చేరుకునే లోపు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటికీ 34 వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో అంగన్వాడీలు భోగి మంటలు వేసి మంటల చుట్టు తిరుగుతూ జగన్ కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె అణిచివేత కొరకు విడుదల చేసిన ఎస్మా జిఓ కాపీలు, షోకాజ్ నోటీసుల కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 34 రోజుల నుండి ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఈ సమ్మెతో చివరకు అన్ని పండుగలు రోడ్డు మీద చేసుకునే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ను హెచ్చరించారు.
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి శ్రీశైలంలోని ఇద్దరి ఆధ్యాత్మిక గురువులకు శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానం వచ్చింది. ఇందులో ముందుగా శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి 1008 శ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీకి అలానే ఆయనతో పాటుగా క్షేత్రంలోని శ్రీదత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువైన శ్రీశివస్వామికి ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వాన పత్రిక అందింది. ఈ మేరకు శ్రీశైలంలోని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు చేతుల మీదుగా చిత్రపటం, అక్షింతలు అందజేశారు.
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి దుర్గా ప్రసాదరావు, తెలంగాణ హైకోర్టు జడ్జ్ లక్ష్మీనారాయణ అలిశెట్టి వేరు వేరు సమయాల్లో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జడ్జీల దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి అర్చకులు, వేదపండితులు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. అనంతరం జడ్జీల దంపతులు శ్రీస్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనంతరం జడ్జీల దంపతులకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితుల నుండి ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో పెద్దిరాజు శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.
ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో నేత దూరమయ్యాడు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. సంజీవ్ కుమార్ ను ఇటీవల వైసీపీ అధినాయకత్వం కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయంపై డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇవాళ ఉదయమే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఏపీ లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటికీ 24 వ రోజుకు చేరుకోగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ అంగన్వాడీ సెంటర్ తాళం సచివాలయ ఉద్యోగులు తెరిచారు. సమాచారం అందుకున్న అంగన్వాడీ టీచర్లు సెంటర్ లో ఉన్న సచివాలయం ఉద్యోగులును బయటకు పంపి సెంటర్ కు తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే, ఆ సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా సెంటర్లను నడపాలని ప్రయత్నం చేస్తుందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ పెరిగింది సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలువులు రావడంతో శ్రీశైలం ఆలయానికి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వాహనాలలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాక్షి గణపతి ఆలయం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.





Total views : 89857