బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి ధనసరి సీతక్క ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత అనవసరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని, జీవో నెం 3కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ జీవో ఇచ్చింది కేసీఆరేనన్న విషయాన్ని కవిత గుర్తించాలని హితవు పలికారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం ఆపి, ప్రజల కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం అవ్వాలని కవిత భావించారని సీతక్క ఆరోపించారు. కానీ బీఆర్ఎస్ ఓడిపోవడంతో కవిత ఆశలు అడియాసలయ్యాయని ఎద్దేవా చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని అన్నారు.
MLC Kalvakuntla Kavitha
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కోనసీమలోని అత్యద్భుత ఆలయంగా పునఃప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత విచ్చేశారు. పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకున్న కవిత ముత్యాలమ్మ అమ్మవారి దయ ముంగండ గ్రామస్తులపైన అలాగే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పైన కచ్చితంగా ఉంటుందని రెండు రాష్ట్రాలు అమ్మవారి దయవల్ల అభివృద్ధి చెందుతాయని కవిత అన్నారు. ముంగండ గ్రామం ఎంతో ఘన చరిత్ర కలిగిన గ్రామమని కవిత అన్నారు. ఈ పునః ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామస్తులు తండోపతండాలుగా పాల్గొన్నారు..
వరంగల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత :
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…. బిహార్ లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, జడ్పీటీసీలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ రీత్యా పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని పునరుద్ఘాటించారు. అలాగే, బీసీల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామా జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని అన్నారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. నిరంతరం సుప్రీం తీర్పును చూపించి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడంలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నాయని లేవనెత్తారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
హక్కుల కోసం పోరాటం చేయాలంటే… తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యమాలకు పెట్టింది పేరైన వరంగల్ తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉందని గుర్తు చేశారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోకొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యగ కల్పనకు దారిచూపామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని వివరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సింగరేణి బొగ్గు గని కార్మికుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో కార్మిక నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి అనుభంద సంఘంగా ఉన్న టీబీజీకెఎస్ ఏడో దఫా ఎన్నికల్లో పోటీ చేయవద్దన్న నిర్ణయంపై ముఖ్య నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లిన వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్యలు గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు లేవని గమనించిన ముగ్గురు నాయకులు కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్యలు తమ రాజీనామా చేసినట్టుగా వెల్లడించారు. వరసగా రెండు సార్లు సింగరేణి గనుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న టీబీజీకెఎస్ ఈ సారి అనూహ్య నిర్ణయం తీసుకోవడం వారికి మింగుడు పడకుండా చేసిందనే చెప్పాలి. దశాబ్దాలుగా సింగరేణి కార్మికులతో అనుభందం పెనవేసుకున్న ముగ్గురు నాయకులు టీబీజీకెఎస్ నుండి పోటీ చేసి మరోసారి పట్టు నిలుపుకోవాలని భావించినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వారిని నిరాశకు గురి చేసింది. దీంతో ముగ్గురు ముఖ్య నాయకులు కూడా పదవులకు రాజీనామా చేయడం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్తు కార్యాచరణ..?
మరో ఆరు రోజుల్లో గుర్తింపు సంఘానికి సంబంధించిన పోలింగ్ జరగనుంది. హై కోర్టులో ఇంధన శాఖ పిటిషన్ వేసి చాలినంత యంత్రాంగం లేనందున తాము ఎన్నికలు నిర్వహించలేమని… ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అయితే గురువారం హై కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలు అనివార్యం అయిన నేపథ్యంలో టీబీజీకేఎస్ పోటీ చేయవద్దన్న తీసుకున్న నిర్ణయంతో ముఖ్య నాయకులు ముగ్గురు కూడా పదవులకు రాజీనామా చేశారు. అయితే కార్మిక వర్గాల్లో ప్రభావం చూపించే నాయకులు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందున్నదే ప్రశ్నార్థకంగా మారింది. మరో కార్మిక సంఘానికి అనుకూలంగా వీరు ప్రచారం చేస్తారా లేక వేరే కార్మిక సంఘంలో చేరి తమ పట్టు నిలుపుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సింగరేణి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనక కారణాలు ఏంటన్నది మాత్రం అంతుచిక్కకుండా పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే కారణమా లేక అధికారంలో ఉన్నప్పుడే కార్మిక సంఘాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమా అన్నది మాత్రం పజిల్ గా మారింది. అయితే ఈ సారి జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం గులాబీ జెండాలు కనిపించవని మాత్రం తేలిపోయింది.






Total views : 78601