శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీ ఓటమి తాలూకు అసహనాన్ని పార్లమెంట్లో ప్రదర్శించొద్దు అని మోదీ కాంగ్రెస్‌కు హితవు పలికారు. శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మీడియాతో మాట్లాడారు. గత 9 ఏళ్లుగా వారికి అలవాటుగా మారిన నెగెటివిటీని పక్కనబెట్టి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం ఉండదని రుజువైందని ప్రధాని స్పష్టం చేశారు.
National News
మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసింది. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ కనిపిస్తోంది. దీంతో కోయంబత్తూరు-చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పట వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. నాలుగు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయింది. ఈ తీర్పుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఙతలు తెలిపారు. బీజేపీ పై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలు, సుపరిపాలన, అభివృద్ధిపైన విశ్వాసం ఉంచారనేదానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. తెలంగాణతో మా బంధం విడదీయరానిదన్నారు. తెలంగాణలో గత కొన్నేళ్లుగా మా మద్దతు పెరుగుతూనే ఉందని తెలిపారు. ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై విడుదలయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరయింది. హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన జనం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈలోగా ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని బాబు భావిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ లోపల కలిసేందుకు తనకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్నారు.
అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి 6000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు శ్రీరాం జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపింది. జనవరి 22న అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న వారిలో సాధు సంతులు, ప్రధాని నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సహా పలువురు వీవీఐపీలు ఉన్నారు. పోస్టు ద్వారా ఆహ్వానపత్రికలు పంపడంతోపాటు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ ఫైళ్లు కూడా పంపించారు. అతిథులు తమ ఆధార్ కార్డులను విధిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానిస్తారు. మెగా ప్రాణ ప్రతిష్ఠకు రాముడి ఆశీర్వాదంతో తనకు తొలి ఆహ్వాన పత్రిక అందిందని మహంత్ విష్ణుదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సాధుసంతులు వస్తునట్టు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను గా మారి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్షించారు. రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని సీఎస్ వివరించారు. తీరప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సన్నద్ధం చేసినట్లు తెలిపారు. తూర్పు నౌకాదళ కమాండ్ కూడా అత్యవసర సామగ్రి, నౌకలతో సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.
పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు.. సంపన్న దేశాలు తమ సాంకేతికతను బదిలీ చేయాలని ప్రధాని మోదీ కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరుగుతున్నకాప్-28 ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పర్యావరణ మార్పులను ఎదుర్కోనేందుకు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన విధానాలకు భారత్ కట్టుబడి ఉందన్నారు. అందుకే.. 2028లో ఈ కాప్-33 సదస్సును భారత్‌లో నిర్వహించాలని ఈ వేదిక మీద ప్రతిపాదిస్తున్నా అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో కర్బన ఉద్గారాలను తగ్గించే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ గురించి ప్రస్తావించారు. తక్కువ జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కర్బన ఉద్గారాల స్థాయి చాలా తక్కువ. ప్రపంచ జనాభాలో 17శాతం భారత జనాభానే. కానీ, కర్బన ఉద్గారాల్లో మా దేశ వాటా కేవలం 4శాతమే అని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.
అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికిగానూ సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం నిర్వహించాలని గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీం కోర్టు కోరింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపలేదని స్పష్టం చేసింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సీఎంను గవర్నర్ ఆహ్వానించి.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతారని ఆశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సవ్యంగా కొనసాగుతోంది. మరోవైపు పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీలు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను’ అని ప్రధాని చెప్పారు. ప్రియాంకాగాంధీ స్పందిస్తూ.. ‘నా తెలంగాణ సోదర సోదరీమణులారా… మా తల్లులారా… పిల్లలారా… మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి చూపండి. అభినందనలు. జై తెలంగాణ. జై హింద్’ అని ట్వీట్ చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇది నవంబరు 30 నాటికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం, డిసెంబరు 2 కల్లా నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపానుగా బలపడుతుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో డిసెంబరు 3న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ మేరకు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. కోస్తాంధ్రలో డిసెంబరు 2 నుంచి 4 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబరు 30 కల్లా తిరిగొచ్చేయాలని ఐఎండీ హెచ్చరించింది.
Read Also…
Read Also…