పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు, గ్యాస్ రిఫైనరీలే లక్ష్యంగా దాడులు, హర్మూజ్ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మనదేశంపైనా పడింది. ఐతే క్రమక్రమంగా ఎల్పీజీ కష్టాలకు బ్రేక్ పడుతోంది. తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు చేరింది.. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఒక కార్గో నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పిక్సిస్ పయనీర్ నౌక 16 వేల 714 టన్నుల ఎల్పీజీని మోసుకొని మంగళూరు పోర్టుకు చేరుకుంది. వచ్చే వారంలో ఇంకా 72 వేల 700 టన్నుల ఎల్పీజీ రానుంది. ఈనెల 25న 26వేల 687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్..ఈనెల 29న 30 వేల టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత్‌కు చేరనుంది. అంతే కాదు..గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నౌకలు, నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన టైమ్‌లో నౌక భారత్‌కు చేరడం గర్వకారణంగా చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఇంధన సరఫరాలను నిర్ధారించడానికి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం బిగ్ రిలీఫ్‌గా మారింది.
#ship
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు..ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన IRS దేనా నౌక..ఇటీవల విశాఖలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా..శ్రీలంక తీరంలో దాడి చేసింది అమెరికా. దీంతో ఇరాన్ నౌక సముద్రంలో మునిగిపోయింది. అందులోని 140 మందికిపైగా గల్లంతయ్యారు. 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది. ఈ నౌక గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు..ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందించింది.
దీంతో శ్రీలంక ఎయిర్‌ఫోర్స్, నౌకాదళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న 32 మందిని కాపాడారు. వారు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇక ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, ఇప్పటివరకు 87 మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు లంక అధికారులు. ఇరాన్ నౌక ప్రమాదానికి గురైన విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. నౌకలో దాదాపు 180 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఈ దాడి తామే చేశామని అమెరికా ప్రకటించింది. తమ జలాంతర్గామి నుంచి టోర్పెడోను ప్రయోగించి ఇరాన్ యుద్ధనౌకను ముంచివేశామని ఆ దేశ రక్షణశాఖా మంత్రి తెలిపారు. శత్రు దేశానికి చెందిన యుద్ధనౌకపై ఇలాంటి దాడి జరగడం రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇదే మొదటిసారని వెల్లడించారు.
ఇరాన్ అధికారికంగా హర్ముజ్ జలసంధిని మూసి వేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1 వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా, మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
కాగా, హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్ ఏకైక మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది.
అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఈ మార్గానికి ప్రత్యామ్నాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ కొంత మేర పైప్‌లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ, మొత్తం సరఫరాకు అవి సరిపోవు. 1980లలో ఇరాన్-ఇరాక్ ‘ట్యాంకర్ యుద్ధం’ తర్వాత పూర్తిస్థాయిలో హర్మూజ్ మూసివేత జరగలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరిలో ఇరాన్ సైనిక విన్యాసాల సమయంలో కొంతకాలం రవాణా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు 6 శాతం పెరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.





Total views : 81448