చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్బోట్లు హెచ్చరిక కాల్పులు జరిపిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ ఘటనపై వివరణ కోరుతూ దిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన మార్గంలో జరిగిన ఆ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాల ప్రకారం, ఇరాన్‌కు చెందిన గన్బోట్లు హెచ్చరిక కాల్పుల్లో సిబ్బందికి ఎలాంటి గాయాలు జరగలేదు. నౌకలకు కూడా పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ రెండు నౌకలు తమ ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసి, ఒమన్‌కు ఈశాన్య దిశగా వెనక్కి మళ్లినట్లు సమాచారం. దాడికి గురైన నౌకల్లో ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ గా గుర్తించారు.
భారీ పరిమాణంలో ఉండే ఆ ట్యాంకర్లు ముడి చమురును సుదూర ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగిస్తారు. ఇలాంటి నౌకపై కాల్పులు జరగడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హర్మూజ్ జలసంధిని తెరిచిన ఇరాన్, ఒక్క రోజులోనే మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. తమపై అమెరికా విధించిన దిగ్బంధనం కొనసాగుతున్నంతకాలం, హర్మూజ్ గుండా నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ఇరాన్ పేర్కొంది. ఆ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే భారత నౌకలపై కాల్పులు జరగడం గమనార్హం. ఈ ఘటనను బ్రిటన్ సైన్యం కూడా ధ్రువీకరించినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో జలసంధిలో రవాణాకు ఎలాంటి ఆటంకం ఉండదని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సముద్ర కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ముందస్తు అనుమతి లేకుండా వస్తున్న నౌకలను అడ్డుకుంటూ హెచ్చరిక కాల్పులకు దిగుతున్నట్లు సమాచారం. పరిస్థితిని సమీక్షిస్తున్న భారత్, అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.





Total views : 89713