పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. అమెరికా గర్వకారణంగా భావించే అత్యాధునిక F-35 లైట్నింగ్ 2 యుద్ధ విమానాన్ని..తాము విజయవంతంగా ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఈ విమానాన్ని తాకిన మొదటి దేశం తామేనని వెల్లడించింది. IRGC, మధ్య ఇరాన్ గగనతలంపై ఎగురుతున్న అమెరికా F-35 విమానాన్ని తమ అధునాతన రక్షణ వ్యవస్థలతో ఢీకొట్టినట్లు తెలిపింది. ఇరాన్‌పై సైనిక ఆపరేషన్ ముగించుకుని తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇరాన్ దళాలు జరిపిన కాల్పుల్లోనే విమానం దెబ్బతిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పైలట్ ఆ విమానాన్ని పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఒకవేళ ఇది ఇరాన్ పనే అని తేలితే, ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ నేరుగా లక్ష్యం చేసుకోవడం ఇదే మొదటిసారి.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానంగా పేరుగాంచింది అమెరికా F-35 ..దాదాపు 100 మిలియన్ డాలర్లు..అంటే దాదాపు 800 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, పైలట్ క్షేమంగా ఉన్నారని ప్రకటించింది అమెరికా. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఐతే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 రీపర్ డ్రోన్లతో సహా 16 అమెరికా విమానాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది అమెరికా. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా సాగుతోందని, యుద్ధంలో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్… అంతేకాకుండా, ఇరాన్ మునుపెన్నడూ చూడని రీతిలో అతిపెద్ద వైమానిక దాడిని ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తన ఎస్-400, ‘బావర్-373’ గగనతల రక్షణ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన మొహరించింది. అమెరికా విమానాన్ని తామే దెబ్బతీశామంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.





Total views : 81439