తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాడీవేడిగానే సాగింది. మైక్ ఎవరిదైనా.. మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, 22ఏ భూముల వివాదం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాల ఆందోళనతో సభ రాజకీయ రణరంగంగా మారింది. మరోవైపు పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లు, 2027 జనగణనలో బీసీల లెక్కల చేర్పు వంటి కీలక అంశాలు ఎజెండాలో ఉన్నా.. రాజకీయ వివాదాలే ప్రధానంగా నిలిచాయి.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో ప్రతిపక్షం లేకుండానే సభ కొనసాగింది. 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరింది. స్పీకర్‌పై వ్యాఖ్యలు, ఎర్రవల్లి ఘటన, శుద్ధి కార్యక్రమం వివాదం చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఘటనలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ డీసీపీ విజయ్‌కుమార్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించింది.
అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కుట్ర జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు, దళితులను అవమానించే చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు వెనుక ఉండి నడిపించిన వారిపైనా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దళితులను అవమానించేలా ప్యూరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించడం తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. పలువురు మంత్రులు కూడా ఘటనను ఖండించారు.