మొబైల్‌లో వినోదం.. చేతిలో ఫోన్ ఉంటే చాలు నిమిషాల్లో డబ్బులు సంపాదించవచ్చు అంటూ ఊరించే ఆన్‌లైన్ గేమింగ్ ప్రకటనలు ఇప్పుడు కోకొల్లలు. కానీ, ఆ ఆట వెనుక ఎంత పెద్ద ఉచ్చు ఉందో తెలిస్తే షాక్‌కు గురికావాల్సిందే.. ఎస్.. భారత ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ రంగాన్ని కుదిపేస్తున్న అత్యంత భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్‌క్రాఫ్ట్.. దాని అనుబంధ సంస్థ రమ్మీటైమ్ పై ఈడీ అక్షరాలా 19 వేల 984 కోట్ల మేర ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ ఆరోపణలతో ప్రత్యేక కోర్టులో భారీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అసలు ఈ గేమింగ్ మోసం ఎలా సాగింది..? మనం ఆడుతున్న ఆన్‌లైన్ గేమ్‌లో మనకు ఎదురుగా ఆడుతున్నది నిజమైన మనిషా? లేక కంపెనీ రంగంలోకి దించిన సాఫ్ట్‌వేర్ బాట్ ఆ..? కోట్ల మంది వినియోగదారులను ఎలా బురిడీ కొట్టించారు..?
ఈ కుంభకోణం ఎంత పెద్దదో ఒక్కసారి పరిశీలిస్తే… గేమ్స్‌క్రాఫ్ట్, రమ్మీటైమ్ ప్లాట్‌ఫారమ్‌లకు దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ముఖ్యంగా తెలుగురాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడుకు చెందిన సామాన్య ప్రజలే ఈ మోసానికి ఎక్కువగా బలయ్యారు. కేవలం వినోదం పేరుతో మొదలైన ఈ ఆటలను… భారీ క్యాష్‌బ్యాక్‌లు, వెల్కమ్ బోనస్‌లు, నిరంతరం వచ్చే నోటిఫికేషన్లతో కంపెనీ వ్యసనంగా మార్చేసింది. నిజమైన ప్రత్యర్థులతో పోటీపడుతున్నామని భావించిన యూజర్లను… తెర వెనుక ఆటోమేటెడ్ బాట్స్ తో ఓడిస్తూ కోట్లాది రూపాయలను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ అక్రమ సంపాదనను కార్పొరేట్ లావాదేవీలు, షేర్ బైబ్యాక్‌లు, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ల రూపంలో మనీ లాండరింగ్ చేసినట్లు ఈడీ తేల్చింది.
ఈ కేసుకు సంబంధించి సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లు వికాస్ తనేజా, పృథ్వీరాజ్ సింగ్, దీపక్ సింగ్ అహ్లావత్‌లను నిందితులుగా చేర్చిన దర్యాప్తు సంస్థ… ఇప్పటికే దాదాపు రూ. 2,401 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అంతేకాదు 2026 మేలో వీరిని ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం కర్ణాటక హైకోర్టు అరెస్టును చెల్లదని పేర్కొన్నప్పటికీ, చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఎలాంటి న్యాయ అడ్డంకి లేదని ఈడీ స్పష్టం చేసింది. అరెస్టుపై కొంత ఉపశమనం కల్పించినప్పటికీ, ఈడీ మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోంది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామం భారత ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ రంగానికి ఒక బిగ్గెస్ట్ వేక్-అప్ కాల్‌గా మారింది. ఇకపై బాట్ల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, ఆల్గోరిథమ్‌ల ఆడిట్ నిర్వహించాలని నిపుణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మొబైల్ స్క్రీన్ల వెనుక సాగుతున్న ఈ ఆర్థిక దోపిడీపై రానున్న రోజుల్లో మరింత కఠిన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది.