ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే అక్కడ శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పోలీసింగ్ తీరుపై ఆమె పూర్తి స్థాయి రిపోర్ట్ కార్డ్‌ను బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ‘దిశ’ చట్టం అమలు కాలేదని విమర్శిస్తూ.. తమ హయాంలో క్రైం రేట్ గణనీయంగా తగ్గిందని లెక్కలతో సహా వివరించారు.
ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందని హోంమంత్రి వెల్లడించారు. సీసీటీవీలు, డ్రోన్ టెక్నాలజీ వాడకం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాల టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటికే 70 శాతం పూర్తి చేశామని, నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకుంటున్నామని చెప్పారు. మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందని హోంమంత్రి అనిత తెలిపారు.
Andhra Pradesh
అమరావతిలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి.. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని జులై మూడో వారంలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా పాఠశాలల పనితీరు, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ఈ నెల 29న నిర్వహించనున్న “షైనింగ్ స్టార్స్” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే సెట్ పరీక్షలను సకాలంలో, పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.రాష్ట్రానికి ఎన్సీసీ స్టేట్ యూనిట్ మంజూరు కావడం సంతోషకర పరిణామమని పేర్కొన్న మంత్రి.. యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపునకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.విద్యా రంగంలో నాణ్యత పెంపు, విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను లోతుగా విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని త్వరలోనే తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. రాజకీయ పరిశోధకులు, నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేసేవారికి, మేనేజ్మెంట్ విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.
సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ముందుగా అక్కడి భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని..రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో సుమారు 12 వందల మంది ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు ప్రాణత్యాగాలు చేసేంత గొప్ప నేల అని, అందుకే తనకు ఆ నేల పట్ల, అక్కడి ప్రజల పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. ఒక లక్ష్యం కోసం ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకుంటారా అనిపించిందని వ్యాఖ్యానించారు. గతంలో అమరవీరులకు నివాళులర్పించేందుకు తాను వెళ్లాలని భావించగా, ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఈ సందర్భంగా ఆరోపించారు.
యువతను బలిచేసి కొందరు నాయకులు తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమ అసలు ఆకాంక్షల సాధన కోసం జనసేన నిరంతరం శ్రమిస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ఉండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికతతో పాటు ఇతర కీలక రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టెక్ దిగ్గజం గూగుల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరుపక్షాల సమన్వయంతో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ మరియు డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని గూగుల్ ప్రతినిధులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగానికి, ‘సంజీవని’ ప్రాజెక్టు అమలుకు సాంకేతిక భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర యువతకు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ రంగాలలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి లాజిస్టిక్స్ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయి, రాష్ట్రంలో సప్లై చైన్ మరియు లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరరేఖ, పోర్టులు మరియు మెరుగైన కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను వివరిస్తూ పెట్టుబడులకు ఆహ్వానించారు. మరోవైపు, యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోనూ సమావేశమైన సీఎం, రాష్ట్రంలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు చొరవ చూపారు. పట్టణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సరైన అనుమతులు లేకుండానే రియల్టర్లు వెంచర్లు వేసి.. ప్లాట్స్ అమ్మేస్తున్నారు. ప్రజల కష్టాన్నీ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఒంగోలులో ప్లాట్స్ ప్రీలాంచ్ ఈవెంట్ నిర్వహించిన శ్రీభ్రమర రాయల్ ఎవెన్యూస్ కూడా అరకొర అనుమతులతోనే ..ది సిటి మెగా గ్రేటడ్ వెంచర్స్’ లో ప్లాట్స్ అమ్మకాలు చేపట్టింది. పూర్తిస్థాయిలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే అమ్మకాలు జరిపింది. అరకొర అనుమతులు తీసుకొని అమాయకులకు అంటగడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు చేసినవాళ్లు నష్టపోతారంటూ ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జిల్లాలో అక్రమ లే అవుట్లపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రకాశం ప్రతినిధి సురేష్ అందిస్తారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో సత్తా చాటారు. నియోజకవర్గం నుంచి ఏకంగా 39 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎంపికైన విద్యార్థులను సత్కరించి వారి విజయానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విజయానికి కారణమైన అంశాలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని BRTS రోడ్డు వద్ద అగ్నిమాపక, విపత్తు స్పందన అధికారుల థీమ్‌తో జరిగిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశా పాల్గొన్నారు. అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అర్బన్, గ్రామీణ పరిధిలో యోగాసనాల అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాను తమ జీవితంలో భాగం చేసుకుని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశా తెలిపారు. సుసంపన్న, ఆరోగ్య , ఆనంద ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే వినూత్న కార్యక్రమం నిర్వహించారు. బొబ్బిలి క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ క్రీడాకారులకు క్రికెట్ సామగ్రిని పంపిణీ చేశారు. బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు చేతుల మీదుగా యువ క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్లు, బంతులు అందజేశారు. పారాది, అలజంగి, వెలగవలస, జగన్నాథపురం, అప్పయ్యపేట, చెరువుగట్టు తదితర గ్రామాలకు చెందిన యువ క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామగ్రిని అందుకున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ నారాయణరావు సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడలు, విద్య వంటి సృజనాత్మక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా సీఐ నారాయణరావు యువ క్రీడాకారులతో కలిసి మైదానంలోకి దిగి కొంతసేపు క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టి షాట్లు ఆడుతూ క్రీడాకారులతో మమేకమయ్యారు. పోలీసు అధికారి తమతో కలిసి ఆటలో పాల్గొనడం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపగా, క్రీడాభిమానులు చప్పట్లతో అభినందించారు.




Total views : 202964