ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, పరిశ్రమలు, పెట్టుబడులు-మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం 50కి పైగా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఎస్ఐపీబీ, వాటికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఉపాధి అవకాశాల సృష్టి, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.
Andhra Pradesh
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు. డీఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్లు చర్చకు రావాలన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలు ఆపలేరన్న మంత్రి లోకేష్..నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామన్నారు. బెంగళూరు- తాడేపల్లి- హైదరాబాద్ వీడి ఏపీ వైపు చూస్తే అభివృద్ధి కనిపిస్తుందన్నారు. మహిళల్ని కించపరిచే వారిని, తిట్టేవారిని తన చుట్టూ పెట్టుకుంటారని విమర్శించారు లోకేష్. గుడివాడ అమర్నాథ్ అద్భుతంగా మాట్లాడారని జగన్ కితాబు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. భారతీరెడ్డిని, తన ఇద్దరు కుమార్తెలను హోం మంత్రిని అవమానించినట్లు అవమానిస్తే కూడా జగన్ శభాష్ అంటారా? అని ప్రశ్నించారు. టీడీపీది ఆ సంస్కృతి కాదు కాబట్టే జగన్ కుటుంబ సభ్యుల్ని కించపరిచిన వారిపైనా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి లోకేష్. స్థానిక ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. మంగళగిరి-నిడమర్రు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్ వారి ఇంటికి వెళ్లారు. చాలా కాలంగా కాళ్లు పనిచేయక బాలుడు బాధపడుతున్నాడు. నరాల సంబంధిత వ్యాధి కారణంగా నిరంజన్ కాళ్లు పనిచేయడం లేదు. అతని వయసు 15 సంవత్సరాలైనా.. 2-3 ఏళ్ల బాలుడిగా కనిపించడం గమనార్హం. గాలిబుడగ లాంటి తన జీవితంలో పవన్ కల్యాణ్ ను కలిసి, ఆయనకు ఆయన సినిమాలోని డైలాగ్ వినిపించాలన్నదే చివరి కోరిక. ఆ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ నిరంజన్ ను పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి.. అతని ఆరోగ్య సమస్యలు, దాని చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో జనసైనికులతో ఏర్పాటు చేసిన లంచ్ లో పాల్గొని, తిరిగి విజయవాడకు వెళ్తారు. ఇటీవల హైదరాబాద్ జనసేన పార్టీ సభకు అనుమతి రాని నేపథ్యంలో.. తెలంగాణలో ఇదే పవన్ కల్యాణ్ తొలి పర్యటన అయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. వారికి సమర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసం నుంచి హోం మంత్రి అనిత బయలుదేరారు. మార్గమధ్యంలో ఎలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. రోడ్డుపై గాయాలతో బాధపడుతున్న వారిని చూసిన హోంమంత్రి అనిత చలించిపోయారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయాలైన వారికి సపర్యలు చేశారు. అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందజేశారు. వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితుల పట్ల హోంమంత్రి అనిత చూపిన చొరవ, మానవత్వంపై స్థానికులు ప్రశంసించారు.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో ఉన్న కంచెకు హఠాత్తుగా చిన్న చిన్న బొమ్మలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు వేర్వేరు చోట్ల ఈ వింత బొమ్మలు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ బొమ్మల మిస్టరీపై తుని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగానే తామే ఆ బొమ్మలను అక్కడ ఏర్పాటు చేశామని ఎస్సై కృష్ణమాచారి స్పష్టం చేశారు. చిన్నారి అదృశ్యమైన జీడి తోటలో క్రూర జంతువుల కదలికలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సాంకేతికంగా ఈ బొమ్మలను కట్టామని ఆయన వివరించారు. ఏదేమైనప్పటికీ చిన్నారి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపులో ఈ బొమ్మల ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముత్తాతల కాలం నుంచి మట్టిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఆ భూమే ఇన్నాళ్లు వారికి కూడు పెట్టింది. వారి పిల్లల్ని చదివిస్తోంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో నోట్లో మట్టి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని కదం తొక్కారు కర్షకులు. ప్రాణాలైనా ఇస్తాం గానీ…. భూములను ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ సాక్షిగా గుండెలు బాదుకుంటూ రైతులు చేసిన నినాదాలు ఇవి.
తమ జీవనాధారమైన భూమిని కాపాడుకునేందుకు అన్నదాతలు రోడ్డెక్కారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలానికి చెందిన కొండకిండాం, రాచకిండాం, కిండాం అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు బొండపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం దాదాపు 175 ఎకరాల సాగు భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటమే ఈ నిరసనకి కారణమైంది. దశాబ్దాలుగా ఆయా భూములను సాగు చేసుకుంటూ… పచ్చని పొలాల పైనే ఆధారపడి జీవిస్తున్న వందలాది రైతు కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. పారిశ్రామికీకరణ పేరుతో పచ్చని పంట పొలాలను లాక్కోవాలని చూడటంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధి కల్పిస్తామంటూ తమకు ఉన్న ఉపాధిని దెబ్బతీయడం ఏంటని రైతుల ప్రశ్న.
ఆందోళన జరుగుతున్న సమయానికి బొండపల్లికి జిల్లా కలెక్టర్ రాగా. రైతులు, నాయకులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. భూసేకరణను తక్షణమే నిలిపివేసి, తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లి భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే, తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఏ త్యాగానికైనా సిద్ధమని రైతులు స్పష్టం చేశారు.
చిన్నారుల సమగ్రాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలే బలమైన వేదికలని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో.. మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఐటీసీ మిషన్ సునెహ్రా కల్, మరియు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ కేంద్రాల బలోపేత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల ఫ్రీ స్కూల్ చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక బాల్య సంరక్షణ, విద్య అందించడమే ఈ ఉమ్మడి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి నల్లమలసాగర్ రిజర్వాయర్‌ను నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రకాశం జిల్లా డోర్నాల పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. టన్నెల్స్‌లోకి వెళ్లిన మంత్రి.. అక్కడ జరుగుతున్న లైనింగ్, టీబీఎం మెషిన్ తొలగింపు పనులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పనులు నత్తనడకన సాగాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. రాబోయే సీజన్ నాటికి నల్లమలసాగర్‌ను నీటితో నింపేలా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే నిర్వాసితులకు ఈ నెలలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్అండ్ఆర్ పరిహారం అందిస్తామని, పునరావాసం కోసం అదనపు బడ్జెట్లో రూ.905 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
గత వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తే.. వారి సంక్షేమం, అభ్యున్నతి కోసం పోరాడుతున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ అత్యంత ఘనంగా జరిగింది. ఈ సభకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొలుసు పార్థసారథితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, భారీగా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి.. జగన్ ఏలూరు జిల్లాకు గొడ్డలి వేటు వేశారని మండిపడ్డారు.మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రైతుకే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే అదనంగా లబ్ధి చేకూరుస్తున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందజేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని, యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 6,474 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహిస్తూ మరింత మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.




Total views : 202846