మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో అంటూ ఓ మానసిక వికలాంగుడు రెవిన్యూ కార్యాలయ గడప తట్టాడు. విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం పంచాయతీలో తమ కుటుంబానికి చెందిన భూమిని ఇతరులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఎమ్మార్వోకు విన్నవించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. సుమారు ఎకరం 32 సెంట్ల భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితుడు ఆరోపించాడు. అడంగల్‌లో పేరు మార్పును ఆధారంగా చేసుకుని ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. తమ భూమిని కాపాడాలని అధికారులను వేడుకున్నాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించామని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు.
Andhra Pradesh
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ కావడంపై ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ఎం. రమ్యశ్రీ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత బాలికలకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని పేర్కొన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. జూనియర్ కళాశాలలో ఎంసీపీసీ, బైపీసీ గ్రూపుల్లో తలో 40 సీట్లు అందుబాటులోకి రానుండటంతో విద్యార్థినులు వైద్య, ఇంజినీరింగ్, సైన్స్ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు. ఇంటర్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన విద్యను పొందే అవకాశం కలగడం తల్లిదండ్రులకు కూడా ఊరటనిస్తుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గురుకుల విద్యాసంస్థ విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ప్రిన్సిపాల్ ఎం. రమ్యశ్రీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. సునీల్ అరెస్టుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం రవాణా టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపిస్తోంది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి కొన్ని సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా మార్చారని, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి సుమారు 195 కోట్ల రూపాయల మేర గండికొట్టారని ఈడీ అంచనా వేసింది.
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంగా దూసుకెళుతోందని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా రెండేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్న మాధవ్.. సీఎం చంద్రబాబు ముందుచూపుతో పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 35 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. అసాధ్యం అనుకున్న విశాఖ రైల్వే జోన్ ను ప్రధాని నరేంద్ర మోడీ సాధ్యం చేశారన్నారు. రెండేళ్లలో ఏపీలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని జగన్ , షర్మిళ పాదయాత్ర చేసి చూసుకోవచ్చని అన్నారు. డీఎస్సీ పోస్టులపై అధికారులు వివరణ ఇచ్చిన తర్వాత జగన్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే బీజేపీకి ఒక ఎమ్మెల్సీ, రెండు రాజ్యసభ సీట్లు వచ్చాయన్న మాధవ్..రానున్న రోజుల్లో బిజెపికి రావలసిన నామినేటెడ్ పదవులపై కూటమిలో సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటే..జీర్ణించుకోలేక విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఆదాయం పెంపే లక్ష్యంగా మైనింగ్ రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీల వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శించారు. 2019–24 మధ్య మైనింగ్ రంగ వృద్ధిరేటు గణనీయంగా తగ్గగా… తమ ప్రభుత్వం పారదర్శక విధానాలతో మైనింగ్ వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోందని వెల్లడించారు. ఆన్లైన్ అప్లికేషన్ విధానాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర… అక్రమ తవ్వకాలను ఉపగ్రహ సాంకేతికతతో పర్యవేక్షించి… నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తామని వెల్లడించారు.
తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండేళ్లలోనమ్మకం, సంక్షేమం,అభివృద్ధికి చిరునామాగా చంద్రన్న ప్రభుత్వం నిలిచిందన్నారు టీడీపీ నేతలు పనపాక లక్ష్మి, శంకర్ రెడ్డి. సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. సత్యవేడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దడమే మా లక్ష్యమన్నారు. జగన్ రెడ్డి లాంటి అరాచకశక్తి మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం కొనసాగడం ఖాయమనీ ధీమా వ్యక్తం చేశారు.
అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ ప్రాజెక్టుల పురోగతి, అలాగే సమాచార శాఖ పనితీరుపై ఆయన వివరాలు వెల్లడించారు.రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత పారదర్శకంగా సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఉన్న ఆలస్యాలను తగ్గించేందుకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20 వేల 876 కిలోల గంజాయి, 23 కిలోల హాశిష్ ఆయిల్‌ను కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌లో నాశనం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని పేర్కొన్నారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, గంజాయి కేసుల విచారణను వేగవంతం చేస్తూ జాతీయ, అంతర్జాతీయ ముఠాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు.
ఏపీ మంత్రి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మలేషియా చేరుకున్న మంత్రి నారాయణ కు ఘన స్వాగతం లభించింది.కౌలాలంపూర్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణతో క్లాంగ్ ఎంపీ గణపతిరావు,మంత్రి పప్పారాయుడు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు.సెలంగార్ లోని KDEB వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థ కార్యాలయంలో మంత్రికి మలేషియా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మలేషియాలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ లను మంత్రి సందర్శించనున్నారు. మంత్రి వెంట మున్సిపల్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉన్నారు.
ఏపీలో ప్రభుత్వ వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య సేవల్లో బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఈ చర్యల ద్వారా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించారు. నాలుగేళ్లుగా ఈ 43 మంది వైద్యులు తమ విధులకు హాజరుకావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై వారికి పలుమార్లు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. వారిపై అభియోగాలు కూడా నమోదు చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత నెలలో కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మందిని శాశ్వతంగా తొలగించారు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. తాజా చర్యలతో పాటు మరో 34 మంది వైద్యులపై అభియోగాలు నమోదు చేసి నోటీసులు ఇవ్వగా… వారు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది.




Total views : 202743