రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యాంక్ స్ట్రీట్‌లో కార్యాలయాల ఏర్పాటుకు 13 బ్యాంకులు ముందుకు రాగా, వాటిలో 11 సంస్థలు తమ భవన నిర్మాణ బాధ్యతలను సీపీడబ్ల్యూడీకి అప్పగించాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నిర్మాణాలను పూర్తి సమన్వయంతో వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఆర్డీఏ అధికారులకు సూచించారు.
రాజధానిలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ వంటి కనెక్టివిటీ సేవల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో డిజిటల్ వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరావతిని కేవలం నిర్మించడమే కాకుండా, నివాస వ్యయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు, ఇండక్షన్ స్టవ్‌ల వాడకాన్ని ప్రోత్సహించడం, డిస్ట్రిక్ట్ కూలింగ్ వంటి ఆధునిక వ్యవస్థలను అందుబాటులోకి తేవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.రాజధాని సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వరకు ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చూడటం ద్వారా పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉంటాయని అన్నారు. జల క్రీడలు, స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.
Andhra Pradesh
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వరస్వామి దేవస్థానాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.వాడపల్లి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అన్నదాన భవనం పనుల పురోగతిని సమీక్షించిన కమిషనర్, 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ‘శ్రీనివాసం’ వసతి భవనం ప్రతిపాదనలను, స్థల పరిస్థితులను పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వరస్వామి దేవస్థానంలో సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అభిషేక మండపం, అన్నదాన భవనం పనులను పరిశీలించారు. గోదావరి పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన న్యాయస్థానం, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఒక పార్లమెంట్ సభ్యుడిని కస్టడీలో హింసించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడితో సమానమని కోర్టు వ్యాఖ్యానించింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి పెద్దగా తేడా లేదని పేర్కొంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందుగా లొంగిపోవడం మంచిదని హైకోర్టు సూచించింది. ఎంపీపై జరిగిన కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు చాలా తీవ్రమైనవని అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా.. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, తదుపరి విచారణను జూలై 3, 2026కి చేపడుతున్నట్లు కోర్టు ప్రకటించింది. అంతవరకు ఆయనకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో ఉన్న ‘డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను, ప్రారంభించిన మంత్రి..చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ విజన్‌కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను ఏర్పాటు చేశామన్న మంత్రి.. కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్..రెండేళ్ల కూటమి పాలనలో ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచామన్నారు.
హానికరమైన డ్రగ్స్ ను నివారించేందుకు సువిశాలమైన డ్రగ్స్ కంట్రోల్ భవన్ ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి వంతెన నడిపూడి వంతెనలను కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కు గజామాల తో స్వాగతం పలికారు ఎమ్మెల్యే ఆనందరావు, కూటమి నాయకులు. రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. కోనసీమ ప్రాంత రవాణా రంగానికి, రైతాంగానికి, వ్యాపారులకు వంతెనలు ఎంతో మేలు చేకూరుస్తాయని అన్నారు ఎమ్మెల్యే.. అమలాపురాన్ని ప్రగతి పథంలో నడిపించడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అమలాపురం రూపురేఖలు మారుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్‌ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అనంతరం భారతి కన్వెన్షన్‌లో జరిగిన విజయోత్సవ సభకు హాజరైన హోంమంత్రి, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి స్టాల్స్‌ను సందర్శించారు.ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తాను ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించి, ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా, అనంతరం మంత్రిగా ఎదిగానని చెప్పారు.ఎన్నికల వరకు మాత్రమే రాజకీయ పార్టీలు ఉంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని, విమర్శలకు తాము భయపడబోమని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కొడాలి నాని చంద్రబాబుతో పాటుగా అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం నుంచి చంద్రబాబును వెళ్లగొట్టాలని.. నిమ్మగడ్డ రమేష్‌కు దురుద్దేశాలు ఆపాదిస్తూ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ కమిషనర్ కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక ఇచ్చారు. కొడాలి నానిపై 2021 ఫిబ్రవరి 16న స్థానిక న్యాయస్థానం అనుమతితో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
కొడాలి నాని మంత్రి పదవిలో ఉండటంతో ఈ కేసుపై కోర్టులో విచారణ చేయాలంటే ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసినా ఈ కేసు విచారణను కోర్టు స్వీకరించలేదు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఈ కేసుకు సంబంధించి ప్రతిపాదనల్ని పంపారు. వీటిని ప్రభుత్వం పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించి నానిపై కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతి రావడంతో కోర్టులో విచారణ ప్రారంభంకానుంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్‌ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లగా.. డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో గ్రామస్తులు, విద్యార్థులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులతో చర్చించి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.పాఠశాలలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహించాలని, ఉపాధ్యాయుల కొరతను వెంటనే తీర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ నాయకులతో కలిసి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమివంకపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. గతంలో జరిగిన నిర్లక్ష్యంతో వంకలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం నిలిచిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నగరంలో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా ఉపేక్షించబోమని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలందరూ సహకరించాలని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమిదేనని ఆయన పేర్కొన్నారు.
రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులను బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. విద్యార్థుల గొంతును నొక్కివేయడమే లక్ష్యంగా యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన విద్యార్థి నేతలు బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే విద్యార్థి సంఘాల నాయకులను వీసీ, రిజిస్ట్రార్ కలిసి బహిష్కరించారని ఆందోళనకారులు ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం కాకుండా, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.





Total views : 202733