ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కర్నాటక రాష్ట్ర ప్రతినిధులు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ఎస్ బోసేరాజు, ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బస్వన్న గౌడ్ కలిసి సీఎంను కలిసి కీలక ఆహ్వానాన్ని అందజేశారు. ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు.. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ఏర్పాటు ద్వారా ప్రాజెక్టు భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడనున్నట్లు ప్రతినిధులు సీఎంకు వివరించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్నాటక మధ్య జలవనరుల వినియోగం, సాగునీటి అభివృద్ధి, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై కూడా సమాలోచనలు జరిపారు.
Andhra Pradesh
నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రణాళికా విభాగం ఒక కీలకమైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు రూపొందించిన “స్వర్ణాంధ్ర 2047 విజన్” లక్ష్యాల సాధనే ధ్యేయంగా ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రణాళికా విభాగంతో కేఆర్ఈఏ యూనివర్సిటీ సారధ్యంలోని ప్రసిద్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్..ఐఎఫ్ఎంఆర్ఈ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంది.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ మరియు ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పరం మార్చుకున్నారు. ఈ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా నిర్దేశించుకున్న పది సూత్రాల ఆర్థిక మరియు సామాజిక లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ రెండు విభాగాలు కలిసి పనిచేస్తాయి.
అమరావతి సచివాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కర్ణాటక మాజీ మంత్రి ఎన్.ఎస్.బోస్ రాజు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన గౌడ బదర్లి నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం తరఫున అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, అలాగే ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
గతంలో వచ్చిన వరదలకు 19వ గేటు కొట్టుకుపోతే, నాడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడామని, రాయలసీమను ఆదుకున్నామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనలో దేవాదాయ శాఖ సాధించిన ప్రగతిని వివరించిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. డిజిటల్ సేవల విస్తరణతో భక్తుల విశ్వాసం మరింత పెరిగిందని పేర్కొన్నారు.2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో విచ్చిన్నకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించిన ఆయన.. దేవాలయాలు సమాజంలో కీలక భాగమనే విషయాన్ని అప్పటి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
రాష్ట్రంలో ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ఎరువుల లభ్యత, పంపిణీపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
యూరియా, డీఏపీలతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయిస్తే డీలర్లు, కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల బుకింగ్ యాప్ ఇబ్బందులను సరిచేయాలని, ఓటీపీల ఆలస్యాన్ని నివారించాలని ఆదేశించారు. ఎంఆర్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని, నల్లబజారుకు తరలకుండా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలను అందుకునేందుకు ఢిల్లీకి విచ్చేసిన ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా సత్కరించారు.
నేడు హస్తినలో జరగనున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఈ ఇద్దరు సీనియర్ నటులను లోకేశ్ కలుసుకుని, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. వందలాది చిత్రాలలో నటించి, తెలుగు చిత్రసీమకు వన్నె తెచ్చిన ఇద్దరు దిగ్గజ నటులకు ఏకకాలంలో పద్మశ్రీలు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని ఈ సందర్భంగా లోకేశ్ ప్రశంసించారు. దివంగత నందమూరి తారక రామారావు గారితో తమకున్న సాన్నిహిత్యాన్ని మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులోనూ తెలుగు కళామతల్లికి తమ సేవలను కొనసాగించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొని మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను అభినందించి సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఢిల్లీలో పర్యటిస్తున్న నారా లోకేశ్ ఢిల్లీలో భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై ఈ భేటీలో చర్చించారు. భారత్‌లో కొరియన్ కంపెనీల విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాలు, మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా దక్షిణ కొరియా అగ్రగామిగా ఉందని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో, కొరియా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ఒక నమ్మకమైన, దీర్ఘకాలిక భాగస్వామిగా ఎలా నిలవగలదో రాయబారికి వివరించారు. భవిష్యత్తులో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకునే మార్గాలపై లోకేశ్, లీ సియోంగ్ హో చర్చించుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ విధానాలను లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ భేటీ ద్వారా ఏపీ, దక్షిణ కొరియా మధ్య పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.
రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి సంఘటనకు కుల, మత రంగు పులిమి, వివాదాస్పదం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న తప్పుడు ప్రచారాలను, ఘటనలను అరికట్టేందుకు అధికారులు, ఉద్యోగులు చొరవ చూపాలన్నారు. ఇటీవల జరిగిన కొన్ని నేరాలకు మానసిక సమస్యలు, మరికొన్నింటికి గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యసనం కారణమని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వం పాత కేసులను సైతం పరిష్కరిస్తోందని, 2019లో జరిగిన నేరాలను ఇప్పుడు గుర్తించి నిందితులను పట్టుకుని శిక్షలు పడేలా చేస్తున్నామని తెలిపారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరనే వాస్తవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సాంకేతికత కీలకమని, ఈ నేపథ్యంలో క్వాంటం ఆర్క్, సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లో క్వాంటం కంప్యూటర్ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. పచ్చదనం పెంపు, పరిశుభ్రత, జల భద్రత, భూగర్భ జలాల రీఛార్జ్, నదుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కింద వచ్చే అర్జీలను సానుభూతితో పరిశీలించాలన్నారు. సమస్య పరిష్కారం కోసం తమ దగ్గరకు వచ్చే పౌరులతో అధికారులు, ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించాలి. వారి స్థానంలో మనమే ఉంటే ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి సేవలు అందించాలి. ఇది పరిపాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతుందని ఆయన హితవు పలికారు. ఉద్యోగుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తామని, పనితీరు ఆధారంగానే బాధ్యతలు అప్పగిస్తామని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారానే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఫైళ్ల క్లియరెన్స్ సులభమైందని, అయితే వినూత్న ఆలోచనలు లేకపోతే వ్యవస్థలు నిస్సారంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పీఎస్ వద్ద వద్ద హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. అయితే ఆయనను అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారిస్తుండగానే దువ్వాడను అరెస్ట్ చేశారంటూ ఆయన సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో..దివ్వెల మాధురి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. సీఐ ప్రసాదరావు స్వయంగా బయటకు వచ్చి.. దువ్వాడను కేవలం విచారిస్తున్నామని, ఇంకా అరెస్ట్ చేయలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె శాంతించలేదు. మరోవైపు దువ్వాడపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇవన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లే అయినప్పటికీ.. బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఓ ప్రముఖ మీడియా కాంక్లేవ్ లో పాల్గొనడానికి మంత్రి నారా లోకేష్ హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో లోకేష్ కు టీడీపీ ఎంపీలు సాదరంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జాతీయ స్థాయిలో రెండు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించే సదస్సులలో పాల్గొంటారు. ఓ ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించనున్న వేర్వేరు కాంక్లేవ్‌లలో మంత్రి లోకేశ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దార్శనికతను, పాలన విధానాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా ఏపీ విజన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన ప్రగతి వంటి అంశాలపై లోకేశ్ మాట్లాడనున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ వేదికలను ఆయన ఉపయోగించుకోనున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలను జాతీయ స్థాయిలో వివరించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, మంత్రులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి పథంలోకి నడిపించారో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు.
మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ఏడు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు. . రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్, శాంతిభద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వంటి అంశాలపై వాస్తవ పరిస్థితులను ఆ శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచారు.
ఇప్పుడు ఆ శ్వేతపత్రాలకు కొనసాగింపుగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉండాలని సీఎం సూచించారు. వివిధ శాఖల్లో వచ్చిన మార్పులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా సంస్కరణలను సమగ్రంగా ఇందులో పొందుపరచాలన్నారు. ప్రభుత్వంపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు, వాస్తవాలను ప్రజల ముందు ఉంచి రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టారో స్పష్టంగా తెలియజేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నివేదికల ద్వారా రెండేళ్ల ప్రభుత్వ పనితీరును ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు విద్యుత్ తో సహా 4 అంశాలపై నివేదికలు విడుదల చేయనున్నారు.





Total views : 201207