Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన నారా లోకేశ్.

ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన నారా లోకేశ్.

by CVR NEWS
ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన నారా లోకేశ్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలను అందుకునేందుకు ఢిల్లీకి విచ్చేసిన ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా సత్కరించారు.
నేడు హస్తినలో జరగనున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఈ ఇద్దరు సీనియర్ నటులను లోకేశ్ కలుసుకుని, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. వందలాది చిత్రాలలో నటించి, తెలుగు చిత్రసీమకు వన్నె తెచ్చిన ఇద్దరు దిగ్గజ నటులకు ఏకకాలంలో పద్మశ్రీలు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని ఈ సందర్భంగా లోకేశ్ ప్రశంసించారు. దివంగత నందమూరి తారక రామారావు గారితో తమకున్న సాన్నిహిత్యాన్ని మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులోనూ తెలుగు కళామతల్లికి తమ సేవలను కొనసాగించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొని మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను అభినందించి సన్మానించారు.

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఢిల్లీలో పర్యటిస్తున్న నారా లోకేశ్ ఢిల్లీలో భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై ఈ భేటీలో చర్చించారు. భారత్‌లో కొరియన్ కంపెనీల విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాలు, మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా దక్షిణ కొరియా అగ్రగామిగా ఉందని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో, కొరియా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ఒక నమ్మకమైన, దీర్ఘకాలిక భాగస్వామిగా ఎలా నిలవగలదో రాయబారికి వివరించారు. భవిష్యత్తులో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకునే మార్గాలపై లోకేశ్, లీ సియోంగ్ హో చర్చించుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ విధానాలను లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ భేటీ ద్వారా ఏపీ, దక్షిణ కొరియా మధ్య పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: