కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. అనంతరం కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.ప్రజలకు అవసరమైన రహదారులు, ప్రాథమిక పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. ఉచిత పథకాల కంటే మౌలిక వసతుల అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 800 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఆత్కూరు పీహెచ్సీ ద్వారా పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కాపుల విషయంలో వైసీపీ చేస్తున్న కుట్రలపై జనసేన నాయకులు మండిపడ్డారు. వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని వారు మండిపడ్డారు. కాపుల ఎదుగుదలను అణచివేయడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని జనసేన నేతలు ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి దక్కాల్సిన ప్రాధాన్యతను, హక్కులను వైసీపీ కాలరాస్తోందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కాపుల నుంచి దూరం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అంబటి రాంబాబు, నాని, అమర్నాథ్ లకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గూడూరు నుంచి జనసేన నాయకులు సవాల్ విసిరారు. కాపులకు జరుగుతున్న అన్యాయాలను జనసేన పార్టీ ఎల్లప్పుడూ అడ్డుకుంటుందని, వారికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అరకు పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయాన్ని అరకు ఎంపీ తనూజా రాణి ప్రారంభించారు. గతంలో అరకు పేరు చెప్పుకుని గెలిచిన కొందరు ఎంపీలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో విమర్శలు వచ్చాయని ఎంపీ తెలిపారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలకు నేరుగా సేవలందించాలనే ఉద్దేశంతో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని సూచించారు.రాష్ట్రంలో వైసీపీ గతంతో పోలిస్తే మరింత బలపడిందని పేర్కొన్న ఎంపీ తనూజా రాణి.. ప్రతిపక్షాలు వైసీపీని లేకుండా చేయాలని పగటి కలలు కంటున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గిరిజన హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.జీవో నంబర్–3 అమలుపై లోక్‌సభలో తొమ్మిది సార్లు ప్రస్తావించినట్లు వెల్లడించిన ఆమె.. ఈ అంశంపై కేంద్ర మంత్రులు, రాష్ట్రపతిని కూడా కలిసినట్లు తెలిపారు. హైడ్రో ప్రాజెక్టులు, బాక్సైట్‌కు సంబంధించిన సర్వేలను ఖండించిన ఆమె.. గత వైసీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల రద్దుకు జీవో నంబర్–97 తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం నియోజకవర్గం, లేపాక్షి మండలంలోని కూర్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.24 లక్షలు వెచ్చించి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించింది.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించి, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషలో మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
విద్యార్థులతో సరదాగా మాట్లాడిన ఆమె, “మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు?” అని ప్రశ్నించారు. దీనికి విద్యార్థులు “నారా లోకేష్ బాబు” అని సమాధానం ఇవ్వగా, “నారా లోకేష్ అని చెప్పాలి” అని సూచించారు. నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్న భువనేశ్వరి, భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.
కూర్లపల్లి ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేయగా, విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పాఠశాల అభివృద్ధి గ్రామ విద్యా ప్రగతికి దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల పరిశీలన, మ్యాపింగ్, సవరణ పనులను ఎన్నికల అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తుండగా, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది కావడంతో, ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి..
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలు, బీఎల్ఏలతో మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఓటరుగా నమోదు కావడం ప్రతి పౌరుడి బాధ్యత..అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపు ఇచ్చారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ..ప్రస్తుత ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావడం సంతోషకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం లేదా లోపాలు గమనిస్తే… వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని ఓటర్లకు మంత్రి సూచించారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతీ బుధవారం బూత్, క్లస్టర్ ఇన్చార్జీలు, మండల నాయకులు తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న మంత్రి..కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి సంధ్య రాణి.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, ప్రతి అర్హ ఓటరు వివరాలు సేకరించి ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు చెందిన మూడు కీలక పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.మనుబోలు మండలం మడమనూరు వద్ద 3,678 కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి.అదేవిధంగా దుత్తలూరు మండలం పాపంపల్లిలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అనంత టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రక్షణ రంగానికి చెందిన మందుగుండు సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది.కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో వాయేనా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విండ్ టర్బైన్ తయారీ పరిశ్రమను స్థాపించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ మూడు భారీ పరిశ్రమల ఏర్పాటుతో నెల్లూరు జిల్లా పారిశ్రామిక రంగంలో మరింత ముందడుగు వేయనుండగా, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఒకప్పుడు బంగారు గని అనగానే కర్ణాటకలోని కేజీఎఫ్ మాత్రమే గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఆ చరిత్ర మారనుంది. రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరి, దేశ పసిడి పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనుంది. కరవు నేలగా పేరున్న ఈ ప్రాంతం, ఇప్పుడు బంగారం ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందనుంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పాయి. 405 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ బంగారం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేశాయి. ఇందుకోసం ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించగా, మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు, ప్రాసెసింగ్ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ప్లాంట్‌లో.. ప్రారంభోత్సవం అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తి మొదలవుతుంది. ఈ సందర్భంగా ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.
ఏపీలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తొలి రోజు మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్, మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.స్టేడియం సామర్థ్యం 26 వేల మంది అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా 10 వేల నుంచి 15 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.టోర్నీలో క్యాపిటల్ అమరావతి, కాకినాడ కింగ్స్, విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం, రాయలసీమ జట్లు పాల్గొని టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
కులమతాల మధ్య చిచ్చుపెట్టడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ DNAలోనే ఉందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు విమర్శించారు. కాకినాడలో ఆయన మాట్లాడారు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శ చేయడం వైసిపి నాయకుల రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శమని అన్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాపు యువతకు ఉపాధి, కాపు కళ్యాణ మండపం నిర్మాణ విషయంలో వైసిపి పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు అసత్య ప్రచారాలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని, కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా వైసిపి చూడడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనత జగన్ తండ్రిదని అదే ఆనవాయితీని జగన్ కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో ఏ ఘటన చోటుచేసుకున్నా దానికి కులం రంగు పులిమేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, చంద్రయ్యను నిర్దాక్షణ్యంగా పొట్టన పెట్టుకున్నప్పుడు వారికి కులాలు గుర్తుకు రాలేదా అని తుమ్మల బాబు ప్రశ్నించారు.






Total views : 201038