పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు రంపచోడవరం RDO. పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. దేవీపట్నం పాత పోలీసుస్టేషన్ ప్రాంతానికి వెళ్లేసరికి సాంకేతిక లోపం ఏర్పడటంతో అప్రమత్తమైన డ్రైవర్ బోటును నిలిపివేశారు. దీంతో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు బోట్ల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలపై పరిశీలన చేయిస్తున్నారు. వీటిపై నివేదిక వచ్చాకే.. బోట్లకు అనుమతులు ఇస్తామని ఆర్డీవో తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
Andhra Pradesh
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వివాహిత న్యాయం కోసం అత్తింటి ముందు దీక్షకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తన భర్త తనకు కావాలంటూ, అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మహిళ భర్త ఇంటి ముందు భీష్మించుకుని కూర్చుంది.వివాహం జరిగిన కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు తనను వేధించడం ప్రారంభించారని నవ్యశ్రీ ఆరోపించింది. అంతేకాకుండా తన భర్తకు విడాకులు ఇవ్వాలంటూ నోటీసులు పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది.తనకు తన భర్తతోనే కలిసి జీవించాలని ఉందని, న్యాయం జరిగేంత వరకు అత్తింటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ భీష్మించుకుని దీక్ష కొనసాగించింది.అనంతరం నవ్యశ్రీ కాళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కాళ్ల ఎస్ఐ శ్రీనివాస్ వరకట్న వేధింపుల కేసు కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి… శిల్పా చక్రపాణి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిపై తాను ఎప్పుడైనా, ఏ వేదికపైనైనా ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో శ్రీశైలం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులను చూపించాలని సవాల్ విసిరారు. అయితే, ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత స్థాయిలో తీవ్ర హెచ్చరికలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని, హద్దులు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి… తనపై చేసిన విమర్శలతో పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. తాను ఒక్క సూచన ఇచ్చినా పరిస్థితి మరోలా ఉండేదంటూ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. మరోవైపు, ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వాగ్వాదంతో శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది.
కేశినాని నాని… ఆంధ్రా విజయమాల్య అంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. మాజీ ఎంపీ కేశినేని నాని… నేషనలైజ్ బ్యాంకులో 120 కోట్ల రుణం తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. రైతులు రుణం తీసుకుని రెండో వాయిదా కట్టకుంటేనే ఇంటికి వస్తారని… మరి మాజీ ఎంపీ అప్పును ఎందుకు వసూళ్లు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తిని మరోసారి కుదవ పెట్టి రతన్ టాటాకు చెందిన వెస్ట్ సైడ్ కంపెనీని మోసం చేశారని ఎద్దేవా చేశారు. రైతులు, కార్మికులు, డ్రైవర్లకు సమయం ఇవ్వని బ్యాంకులు… మాజీ ఎంపీని 11 ఏళ్లుగా ఎందుకు విడిచిపెడుతున్నారని నిలదీశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేశినేని చిన్న సవాల్ విసిరారు.
రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగు ప్రజలు, ఎన్నారైలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాసాంధ్రులు చంద్రబాబును ఆప్యాయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగిన సీఎం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక, ఇవాళ, రేపు ఆ దేశ మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సింగపూర్ ప్రధాని సహా పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అయి.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఉదయం 10.30 గంటలకు సింగపూర్ లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశమవుతారు. అనంతరం స్టార్టప్ వెంచర్ కేపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొంటారు. అది పూర్తయ్యాక యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్ తో లంచ్ లో పాల్గొంటారు.
మధ్యాహ్నం సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్ తో, తర్వాత గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ భజ్వాతో, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ తో భేటీ అవుతారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగమంత్రి బాలకృష్ణమన్, హోంమంత్రి కె.షణ్ముగమ్, హెచ్ఆర్డీ మంత్రి టాన్ సీ లెంగ్ లతో వరుసగా భేటీ కానున్నారు.
మంగళవారం సింగపూర్ లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే సీబీఎన్ @361 ప్రోగ్రామ్ ను ప్రారంభించి.. సుర్బాన్ జురాంగ్ – అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సీఐఐ నిర్వహించే రోడ్ షో కు హాజరుకానున్నారు. మంగళవారం సాయంత్రం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత.. ఆయన తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి నిర్ణయం ఏ రోజు జరగలేదు. వరుస ప్రమాదాల నేపథ్యంలో యాజమాన్యం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయి. ప్రమాదం విషయంలో యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్లాంట్ విషయంలో భద్రత చర్యలు మెయింటినెన్స్ చేపట్టాలని సూచిస్తున్న పట్టించుకోలేదని… ప్రమాదం జరిగిన తర్వాత ఇలా వ్యవహరించడం తగదంటున్నారు.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన సుబ్బారావు… వారికి తాత్కాలిక నివాసం కల్పించి తన సరుగుడు, సుబాబుల్, జామాయిల్ తోటల్లో పనులు చేయిస్తున్నాడు.
అయితే వారిని నిర్బంధించి బలవంతంగా పనులు చేయించుకుంటూ, తగిన కూలి చెల్లించకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. ఇదే సమయంలో ఓ గిరిజన మహిళపై సుబ్బారావు అత్యాచారానికి పాల్పడ్డాడని, దీనిని ప్రశ్నించిన ఆమె భర్తపై దాడి చేశాడని బాధిత కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థల ద్వారా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారికి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై స్పందించిన జేసీ కల్పనా కుమారి సంబంధిత అధికారులతో కలిసి తొర్రగుడిపాడు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధిత మహిళను స్వయంగా విచారించగా, తనపై అత్యాచారం జరిగినట్లు ఆమె వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఇతర గిరిజన కుటుంబ సభ్యులు కూడా తమతో బలవంతంగా పనులు చేయించుకుంటున్నట్లు జేసీ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో నిందితుడు బత్తుల సుబ్బారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు. నాలుగు కుటుంబాలకు చెందిన 18 మంది గిరిజనులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పార్కులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోయిందని.. భవిష్యత్తులో మానవ వనరుల కొరత, వృద్ధాప్య సమస్యలను అధిగమించాలంటే ఈ కొత్త పాలసీ తప్పనిసరని సీఎం పేర్కొన్నారు. ఇదే వేదికపై రాష్ట్రాభివృద్ధిని ప్రస్తావించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం కోసం ‘ప్రాజెక్టు సంజీవని’, విద్యార్థుల కోసం ‘ఏఐ లెర్నింగ్’ వంటి విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు.
కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, నిధుల మళ్లింపు, అవినీతి జరిగాయని ఆరోపించారు. కూటమి పాలనలోనే ఉచిత బస్సు, పెంచిన పింఛన్లు, ‘తల్లికి వందనం’ లాంటి పథకాలతో పాటు పులివెందులలో శాంతిభద్రతలు, నిజమైన అభివృద్ధి సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు.



Total views : 203020