అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై కీలకంగా చర్చించారు. ఈగోలు పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేయాలని కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే.. సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సమావేశంలో లీడర్షిప్, జీఎస్డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్‌పై సమీక్షించారు.
7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించుకుని లక్ష్యానికి చేరువ అవుదామని అన్నారు. ఈసారి లీడర్షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్ని్ర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టామని స్పష్టం చేశారు. రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్టు చేశామని తెలిపారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ టూ వాటర్మాన్ అంటూ కథనం రాసిందని.. ఇది తనకు సంతోషం కలిగిందన్నారు. గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో తన పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు నేను ఇంత ఆనందించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది… దానిని సరిచేస్తూ ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరుగా ఉంటుందని తెలిపారు. గోదావరి- కావేరీ- మహానది- గంగా లాంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్ అని చెప్పారు.ఈ నీటి భద్రత, సంరక్షణా చర్యల్ని గుర్తించి వాటర్ మాన్‌గా పేరు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.36 ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చామని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు.
మద్యం పాలసీ అమలు, విద్యుత్ రంగంలో పురోగతి, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జీఎస్డీపీ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాల వారీగా బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తెలుసుకుని.. వాటిని ఇతర జిల్లాల్లోనూ అమలు చేసే దిశగా అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు.