జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఓల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడి షార్ట్ సర్క్యూట్‌కు గురైంది. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలు సజీవ దహనం కాగా మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపుగా 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి కడపకు బయలుదేరిన ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీచుపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ బయటపడే ప్రయత్నాలు చేసే లోపే సర్క్యూట్‌తో బస్సు మంటల్లో కూరుకుపోయింది. ప్రమాదం నుండి ప్రయాణికులు ప్రయత్నాలలో ఓ మహిళ ప్రయాణికురాలు అందులోనే చిక్కుకొని సజీవ దహనం అయ్యింది. మరో 12 మంది గాయాలపాలు అయ్యారు. పెట్రోలింగ్ సిబ్బంది, సమీపంలో ఉన్న మరికొంత మంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Crime
ప్రకాశం జిల్లా.. త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద.. రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, కారు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108లో త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దోర్నాల నుండి వినుకొండ వైపు కారు వెళ్తుండగా.. బొలెరో వాహనం కుంట వైపు అతివేగంతో వెళ్లడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన మహిళ పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన షేక్ షమీగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు వేర్వేరు సంఘటనల్లో 6 గురు స్మగ్లర్లను అరెస్టు చేసి, 18 ఎర్రచందనం దుంగలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్సు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలతో గురువారం సాయంత్రం కల్యాణి డ్యాం నుంచి చీకటీగలకోన మీదుగా శ్రీవారిమెట్టు వైపు కూంబింగ్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో భాకరాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్టు బీటు పరిధిలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్సు టీం చుట్టుముట్టగా వారు రాళ్లు, కొడవళ్లతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిలో తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన మణిను పట్టుకున్నారు. స్మగ్లర్లు పడేసిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్సు ఆర్ఎస్ఐ ఆలీబాషా టీమ్ నాయుడుపేట వైపు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళుతూ, గూడూరు-నాయుడుపేట హైవే రోడ్డు మీద బూధానం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. శుక్రవారం ఉదయం ఒక కారులోని వ్యక్తులు వాహనం వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్సు టీమ్ వారిని చుట్టుముట్టి కారులో తనిఖీలు చేయగా అందులో 7ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని కారుతో పాటు స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లోని దుంగలు విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి రివార్డును అధికారులు ప్రకటించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం. దాచేపల్లిలోని అలంకార్ థియేటర్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రదర్శించలేదని థియేటర్ పై రాళ్లు విసిరిన మహేష్ బాబు ఫ్యాన్స్. థియేటర్ వద్ద బెనిఫిట్ షో సమయంలో చోటు చేసుకున్న ఘటన. సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు. గొడవ జరగకుండా చూసేందుకు, థియేటర్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వీరికి మొత్తం 8 మంది సంతానం. చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్ గా పనిచేస్తున్నాడు. తనకు గత నాలుగు ఐదు నెలల నుండి జీతం రాలేదు. అయితే, చిన్న నాగమ్మ ఈ సారి సంక్రాంతి పండుగకైనా పిల్లలు, తనకు కొత్త బట్టలు కావాలని భర్తతో గొడవ పెట్టుకుంది. కొద్ది సేపు తగువులాట తర్వాత ఫైడ్లైన్ కూలీ డబ్బులు రావటంతో బట్టల కొనేందుకు బయన్న ఇంటి నుంచి బయలుదేరి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చేరుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, తన నలుగురి సంతానంలో ఇద్దరు ఆడ పిల్లలు యాదమ్మ (1), బయమ్మ (3) గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలంకలం రేపింది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ ఎఫ్ సి ఐ గోదాం వద్ద గంగాధర్ అనే లారీ డ్రైవర్ కు చెప్పుల దండ మెడలో వేసి చితకబాదారు అడ్డుకోబోయిన మరో డ్రైవర్ శ్రీనివాస్ పై దాడి చేశారు. రాయికల్ మండలం మైతాపూర్ రైస్ మిల్లు నుండి గంగాధర్ అనే డ్రైవర్ బియ్యం లోడుతో మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎఫ్.సి.ఐ గోదాంకు బియ్యం దించడానికి రావడంతో అక్కడే వేచివున్న తోటి డ్రైవర్లు రఫిక్, ఫిరోజ్, అఖిల్ అనే ముగ్గురు డ్రైవర్లు గంగాధర్ మెడలో చెప్పుల దండ వేసి దాడి చేసే సమయంలో శ్రీనివాస్ అనే మరో డ్రైవర్ అడ్డుకుపోయాడు. అడ్డుకోబోయిన శ్రీనివాస్ పై దాడి చేసి చితకబాదారు. ఇంతటితో ఆగకుండా దాడి చేసిన వ్యక్తులే ఈ సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మల్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది. ఈ సంఘటన పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోవిందరాజు, దీప దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత (9 నెలలు) జన్మించింది. చిన్నారి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగూరులోని ప్రైవేటు క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడా వీలు కాలేదు. దీంతో 108 వాహనంలో అనంతపురం తీసుకెళుతూ మార్గమధ్యంలోని పామిడిలో ఓ ప్రైవేటు డాక్టర్ వద్ద చూపించారు. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలపడంతో అక్కడి నుంచి పామిడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
Read Also..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జెప్టోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారని పోలీసులు. అతను రన్నింగ్ ట్రైన్ లో చైన్ స్నాచింగ్ చేస్తాడని గుర్తించామన్నారు. ఐదు చైన్ స్నాచింగ్ కేసుల్లో చిన్నయ్య నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 14 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రన్నింగ్ ట్రైన్ లో విండో నుంచి మహిళల మెడలో చైన్స్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడికి గంజాయి అలవాటు ఉందని తెలిపారు. డ్రగ్స్ కి బానిసై నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆరు ట్రావెల్స్ బస్సుల్లో 30 కేజీల గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న10 మందిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో అందరూ యువకులే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకువస్తున్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో గంజాయిని డోర్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చిత్తూరు జిల్లా కలకడ పట్టణంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. కలకడ పట్టణం లోని మంగళపల్లి జాతీయ రహదారి పక్కన ఎర్రయ్య గారి పల్లెకు చెందిన ఆనంద్, తన భార్య శశికళతో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న కొందరు ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేశారు. ఈ ఘటనలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళపై దాడి చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా కలకడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Read Also..
Read Also..