కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గమనించి ఈవోకు సమాచారం అందించారు. శివాలయం మరియు గంగమ్మ వారి దేవస్థానంలో రెండు హుండీలను పగలగొట్టి నగదు మరియు అమ్మవారి మంగళ సూత్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు ఈఓ ప్రసాద్ తెలిపారు. వాటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఆయన తెలియజేశారు. చోరీ చేసిన హుండీని పక్కనే ఉన్న పొలాల్లో దుండగులు పగలగొట్టి అక్కడే వదిలి వెళ్ళిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం వద్ద వాచ్ మెన్ లేకపోవడంతోనే చోరీ జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
Devotional
ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల గట్టమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, దేవాదాయ, ఆటవి శాఖ మంత్రి కొండా సురేఖలు. మేడారం జాతర నిర్వహణ పనులను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి వద్ద నాయకపోడ్ గిరిజన పూజారులు మంత్రి సీతక్క, కొండా సురేఖ లకు ఘన స్వాగతం పలికారు. ఘట్టమ్మ తల్లికి మంత్రులు చీరే, సారె లను సమర్పంచారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రులు సీతక్క, సురేఖ లను ఆశీర్వదించారు. అనంతరం గట్టమ్మ దేవాలయం పరిసరాలను మంత్రి సీతక్క పరీశీలించారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దేవతాస్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు తెలిపారు. తిరుమల శ్రీవారికి దేశీయ గో జాతుల పాల నుండి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా జరగనున్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హాజరవ్వడం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు విరాట్ అభ్యర్థనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకొని అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న ప్రాక్టీస్ సెషన్ అనంతరం కోహ్లీ టీమిండియా శిబిరం నుంచి బయలుదేరి మరుసటి రోజు అయోధ్య చేరుకోనున్నాడని క్రిక్‌బజ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ నుంచి అనుమతి ఇచ్చిందని తెలిపింది. కాగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన క్రికెటర్లలో కోహ్లీతోపాటు మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీతోపాటు పలువురు దిగ్గజాలు ఉన్నారు. భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న 3 టీ20 మ్యాచ్‌లు ముగిసిన అనంతరం ఆటగాళ్లకి, సిబ్బందికి రెండు రోజుల విరామం లభిస్తుంది. అనంతరం ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌కు సన్నాహలు మొదలుకానున్నాయి. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ చేరుకొని టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తుండడంతో కోహ్లీ ఒక రోజు ప్రాక్టీస్ సెషన్‌కు దూరం కానున్నాడు.
శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము మంగళవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామి వారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణ స్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంతరం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి. శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. తరువాత శ్రీ మలయప్ప స్వామి వారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణము వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. శ్రీ మలయప్ప స్వామి వారు ఉత్సవము పూర్తయి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసింది.
తిరుమల శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కలియుగ వెంకటేశ్వర స్వామి అన్ని కోర్కెలను తీర్చాడని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలు కోరుకున్నట్లు గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా పాలన జరగలేదని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా పాలనను కోరుకుంటున్నారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ప్రజా పాలన, ప్రజలు మెచ్చే పాలన కొనసాగే విధంగా నడుచుకుంటుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూరాబాద్ లో శ్రీవారి దేవాలయం నిర్మాణం చేయాలని టీటీడీని కోరాలని భావించాను. టిటిడి ఈఓ చైర్మన్ అందుబాటులో లేని కారణంగా అడగలేదని హుజూరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థల సమీకరణ చేస్తామని టీటీడీ ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రిని కూడా అడుగుతామని అన్నారు. విభజన సమయంలో… విభజన అనివార్యమైనప్పుడు కచ్చితంగా ఏపీని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది దానికి కట్టుబడి ఉంటుందని, కచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దక్షిణ కైలాసం గా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కైలాసగిరి ప్రదక్షణ అత్యంత వైభవంగా నిర్వహించారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణానికి కైలాసగిరి పర్వతాల్లో కొలువైన ముక్కోటి దేవతలన మరియు సప్త ఋషులను తమ కళ్యాణానికి రమ్మని ఆహ్వానించేందుకు కనుమ పండగనాడు స్వయంగా స్వామి అమ్మ వార్లు కైలాసగిరి ప్రదక్షణ చేసి తమ వివాహానికి రావాలని ఆహ్వానించడానికి బయలుదేరినారు. ఈ కార్యక్రమంలో స్వామి అమ్మవార్లతో పాటు అనేకమంది భక్తులు ఆలయ అధికారులు మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మూల విరాట్ కు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలయందు స్వామివారి ఉత్సవ మూర్తికి తిరుమంజన స్నపనం గావించి మన్యుసూక్త హోమం నిర్వహించారు.కనుమ పండుగ సందర్భంగా దేవస్థాన గోశాల యందు కనుమ పండుగ సందర్బంగా గోపూజా కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ అధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి శ్రీశైలంలోని ఇద్దరి ఆధ్యాత్మిక గురువులకు శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానం వచ్చింది. ఇందులో ముందుగా శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి 1008 శ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీకి అలానే ఆయనతో పాటుగా క్షేత్రంలోని శ్రీదత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువైన శ్రీశివస్వామికి ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వాన పత్రిక అందింది. ఈ మేరకు శ్రీశైలంలోని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు చేతుల మీదుగా చిత్రపటం, అక్షింతలు అందజేశారు.
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి దుర్గా ప్రసాదరావు, తెలంగాణ హైకోర్టు జడ్జ్ లక్ష్మీనారాయణ అలిశెట్టి వేరు వేరు సమయాల్లో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జడ్జీల దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి అర్చకులు, వేదపండితులు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. అనంతరం జడ్జీల దంపతులు శ్రీస్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనంతరం జడ్జీల దంపతులకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితుల నుండి ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో పెద్దిరాజు శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.