ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఆ దేశ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ను ప్రకటించింది. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోడీకి అందజేశారు. ఈ పురస్కారం భారత ప్రజలందరికీ లభించిన గౌరవంగా ప్రధాని అభివర్ణించారు. ఇండోనేసియా దేశ సార్వభౌమత్వానికి, అభ్యున్నతికి విశేష సేవలు అందించిన వారికి 1959 నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేస్తున్నారు. అంతకుముందు, జకార్తాలోని అధ్యక్ష భవనం ‘ఇస్తానా మెర్డెకా’కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటన భారత్-ఇండోనేసియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు ప్రధాని మోదీ.
Latest News
2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఈ మేరకు జస్టిస్ ఏవై కోగ్జే, జస్టిస్ ఎస్జే దవేలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
2008 జులై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులు మాత్రమే కాకుండా, మొదటి విడత పేలుళ్లలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. ఈ పేలుళ్లలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ క్రైమ్ బ్రాంచ్.. 100 మందికి పైగా నిందితులుగా పేర్కొంది. 78 మందిపై విచారణ జరిగింది. అహ్మదాబాద్‌లో నమోదైన 20 ఎఫ్ఐఆర్లు, సూరత్‌లో నమోదైన 15 ఎఫ్ఐఆర్లతో కలిపి మొత్తం 35 కేసులను విలీనం చేసి సుదీర్ఘ విచారణ జరిపారు. ఈ క్రమంలో 9 మంది వేర్వేరు న్యాయమూర్తుల ముందు 1,163 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. భద్రతా కారణాల దృష్ట్యా 26 మంది కీలక సాక్షుల పేర్లను గోప్యంగా ఉంచారు.
గుజరాత్ హైకోర్టు హైకోర్టుకు చేరిన ఈ కేసులో గత రెండున్నరేళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిదీన్, సిమిలకి చెందిన ఉగ్రవాదులు కలిసి ఈ దారుణ కుట్రకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో బలంగా నిరూపించింది. దీంతో నిందితులపై దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద మోపిన చార్జీలను న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఇవాళ తుది తీర్పు వెలువరించింది. అయితే దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో (38 మందికి) ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే తొలిసారి.
లవ్ ఓ లవ్ ప్రీ-రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చిత్ర బృందం, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, అభిమానుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది. పావిష్ నారాయణన్, నాగ దుర్గా జంటగా నటించిన ఈ చిత్రానికి మాగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, జి. నాగేశ్వర రెడ్డి గార్లు కూడా హాజరై చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. లవ్ ఓ లవ్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిత్ర యూనిట్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.
అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ, “ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవిష్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించాడు. నేను ప్రస్తుతం ఏ నగరానికి ఏమైంది 2 సినిమా షూటింగ్లో ఉన్నాను. ఈరోజు పవిష్ సినిమా ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉందని తరుణ్ భాస్కర్‌కు చెప్పగా, ఆయన కూడా రెండు గంటల ముందే షూటింగ్ నుంచి వెళ్లమని ప్రోత్సహించారు. లవ్ ఓ లవ్ గురించి చెప్పాలంటే, ఇది భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే యూనివర్సల్ రొమాంటిక్ కామెడీ చిత్రంలా అనిపిస్తోంది. కథ, కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారు. అది తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా ఎలాంటి తేడా చూపించరు. సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో మనందరికీ తెలుసు. అదే విధంగా పవిష్ కూడా ఆ జాబితాలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ ఓ లవ్ తెలుగు ప్రేక్షకుల ప్రేమను సొంతం చేసుకుని ఘన విజయాన్ని అందుకోవాలని చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.”
నిర్మాత జి. ధనంజేయన్ మాట్లాడుతూ , “విశ్వక్ సర్‌కు నేను పెద్ద అభిమానిని. మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశ్వక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి నేను మాట్లాడటం కంటే సుబ్బారావు గారు మాట్లాడితే బాగుంటుందని భావించాను. ఆయన ఈ సినిమాపై ఎంతో గౌరవంతో వ్యవహరిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తానని ముందుకు రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నాగ దుర్గా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన నటి. అలాగే ధనుష్ గారి మేనల్లుడు పావిష్ తన గత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమై మంచి ఆదరణ పొందాడు. ఈ సందర్భంగా సుబ్బారావు గారికి మరోసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేడు తమిళ వెర్షన్‌కు సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్ మాట్లాడుతూ, “ఈ అవకాశం ఇచ్చిన దినేష్ సర్, ధనంజేయన్ సర్లకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాపై నమ్మకం ఉంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం కల్పించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. జూలై 10న లవ్ ఓ లవ్ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించండి. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు మా చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.”
నిర్మాత దినేష్ రాజ్ మాట్లాడుతూ, “ధనంజేయన్ గారితో కలిసి చేస్తున్న నా తొలి చిత్రం లవ్ ఓ లవ్. మా ఈ భాగస్వామ్యంలో మరో ఆరు చిత్రాలను కూడా నిర్మించబోతున్నాం. ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దర్శకుడు మాగేశ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడు. సినిమాపై అద్భుతమైన అవగాహన, స్పష్టమైన విజన్ ఆయన సొంతం. ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేలా, వారితో అనుబంధం కలిగించే అంశాలతో కథను రూపొందించారు. మంచి సందేశాన్ని అందించే చిత్రాన్ని తెరకెక్కించగలిగామని మేము గర్వంగా భావిస్తున్నాం.
హీరో పవిష్ చాలా అంకితభావం కలిగిన నటుడు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిస్థాయిలో కష్టపడి తన వంతు సహకారాన్ని అందించారు. అలాగే హీరోయిన్ నాగ దుర్గా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితురాలు. ఆమెను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు మద్దతు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.”
హీరో పవిష్ నారాయణన్ మాట్లాడుతూ, “ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన విశ్వక్ సర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక ఫోన్ కాల్ చేయగానే కేవలం ఐదు నిమిషాల్లోనే స్పందించి ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. విశ్వక్ సర్ నటిస్తున్న ప్రతి సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, సినీ ప్రముఖులకు, అభిమానులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా తెలుగు అంత బాగా రాకపోయినా మీతో తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఎప్పుడైనా వేదికపై మాట్లాడినప్పుడు ముందుగా ధనుష్ సర్‌కు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను.
అలాగే ధనంజేయన్ సర్, దినేష్ రాజ్ సర్లకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి సినిమా ఎంత ముఖ్యమో, రెండో సినిమా కూడా అంతే ముఖ్యమని భావించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. దర్శకుడు మాగేశ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా తొలి సినిమాలో ఏమి చూసి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారో నాకు తెలియదు కానీ, ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఈ సినిమా ద్వారా నటుడిగా ఎంతో నేర్చుకున్నాను. మొదట ఈ సినిమాలో నా సరసన కొత్త హీరోయిన్ నటిస్తుందని చెప్పారు. కానీ నాగ దుర్గ గారి గురించి తెలుసుకున్న తర్వాత, తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఎంతటి గుర్తింపు ఉందో చూసి ఆశ్చర్యపోయాను. ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నాగ దుర్గ గారే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రంలో నాతో కలిసి నటించిన సీనియర్ నటీనటులు వనిత విజయకుమార్ మేడమ్, కె.ఎస్. రవికుమార్ సర్, సెల్వా సర్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.జూలై 10న లవ్ ఓ లవ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి ఆశీర్వదించండి. మీ ప్రేమాభిమానాలే మా బలం. అందరికీ ధన్యవాదాలు.”
హీరోయిన్ నాగ దుర్గా మాట్లాడుతూ, “ఈ సినిమాలో అవకాశం రావడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక తెలుగు అమ్మాయిగా తమిళ చిత్రంతో పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటిగా నన్ను ఎంపిక చేసిన దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన ధనంజేయన్ సర్, దినేష్ రాజ్ సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తన బిజీ షెడ్యూల్లో కూడా సమయం కేటాయించి మా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ సర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన మాకు అందించిన ప్రోత్సాహం ఎంతో విలువైనది. లవ్ ఓ లవ్ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాల్సిన చిత్రం. జూలై 10న విడుదల కానున్న మా సినిమాను అందరూ థియేటర్లకు వచ్చి చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.”
నటి వనిత విజయకుమార్ మాట్లాడుతూ, “మరోసారి హైదరాబాద్‌కు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి సందర్భంలోనూ నాకు అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
లవ్ ఓ లవ్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 10న విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేస్తున్న తెలుగు నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
సొంతింటి కలతో ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే మిగులుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పదేళ్ల క్రితం నిర్మించిన 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదు. సర్వేలు, విచారణలు కొనసాగుతున్నా… పంపిణీ మాత్రం ముందుకు సాగడం లేదు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో 2015-16లో హుజూరాబాద్ పట్టణంలోని గణేష్‌నగర్‌లో 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఇళ్లు పూర్తయినా… ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ కేటాయింపు జరగకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
2021 హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది. అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన వార్డు సభల్లో మరోసారి దరఖాస్తులు స్వీకరించగా… 2,450 మందికి పైగా అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 450 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో… అర్హత లేని వారికి కూడా ఇళ్లు కేటాయించారనే ఫిర్యాదులు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో జిల్లా కలెక్టర్ మరోసారి సమగ్ర విచారణకు ఆదేశించారు.
విచారణ ప్రారంభమై నెల రోజులు దాటినా… ఇళ్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు కేటాయింపులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా… ఇన్నాళ్లు ఖాళీగా ఉండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. పలుచోట్ల కిటికీలు, తలుపులు, విద్యుత్ మీటర్లు చోరీకి గురయ్యాయి. డ్రైనేజీ, తాగునీటి వంటి కనీస మౌలిక వసతులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.
పదేళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నామని… ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇళ్లకు మరమ్మతులు చేసి, మౌలిక వసతులు కల్పించి అర్హులకు కేటాయించాలని కోరుతున్నారు. నిర్మాణం పూర్తై దశాబ్దం గడిచినా… డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అందకపోవడం హుజూరాబాద్‌లో చర్చనీయాంశమైంది. విచారణను త్వరగా పూర్తి చేసి… ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు. బిల్డింగ్‌పై నుంచి తోసేసినా చనిపోకపోవడంతో… టాయిలెట్ క్లీనింగ్ కోసం వినియోగించే హార్పిక్‌ను భర్త నరాళ్లోకి ఎక్కించి కడతేర్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో చోటుచేసుకుంది.
భర్త ఉద్యోగం నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు.. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇటీవల గల్ప్ నుంచి భర్త ఇంటికి తిరిగి రావడంతో తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తాడని భావించిన భార్య అతన్ని చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.. ప్రియుడితోపాటు.. అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తి సహాయంతో భర్తను హత్యచేసింది. అయితే, తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని.. తన కోడులు ఇందుకు కారణమై ఉండొచ్చునని మృతుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా అసలు గుట్టు వీడింది.
నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ గల్ఫ్ లో ఉద్యోగం చేస్తూ జూన్ 27న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే, అతని భార్య దాయిని సంధ్యకు నిజామాబాద్ ఇంద్రపూర్ కాలనీకి చెందిన అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ప్రశాంత్ రాకతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతాడని భావించిన సంధ్య, ప్రియుడు అనిల్‌తో కలిసి భర్త ప్రశాంత్ హత్యకు ప్లాన్ చేసింది. దీంతో అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం తీసుకుని.. పథకం ప్రకారం.. జూన్ 29న వెంకటసాయి ప్రశాంతకు పరిమితికి మించి మద్యం తాగించి డాబాపైకి తీసుకెళ్లాడు.
సంధ్య ఫోన్లో సూచనలు ఇస్తుండగా ప్రశాంత్‌ను వెంకటసాయి డాబా పైనుంచి కిందకు నెట్టేశాడు. తీవ్ర గాయాలైనప్పటికీ ప్రశాంత్ చనిపోక పోవడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సంధ్య, వెంకటసాయి కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రశాంత్ ను చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి ప్రియుడు అనిల్ కూడా వచ్చాడు. చికిత్స అనంతరం రాత్రి వేళ ఇంటికి తీసుకొచ్చాక మళ్లీ ప్రశాంత్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.
ప్రియుడు అనిల్ సూచనతో సంధ్య తన భర్త ప్రశాంత్ చేతికి ఉన్న సెలైన్ కాన్యులా ద్వారా మత్తుమందులు, టాయిలెట్ క్లీనర్ కలిపిన ద్రవణాన్ని శరీరంలోకి ఎక్కించింది. ఆపై మంచంపై నుంచి కిందకుతోసి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసింది. అయితే, ప్రశాంత్ మృతివార్త తెలుసుకున్న అతని తల్లికి అనుమానం వచ్చింది. ప్రశాంత్ ను హత్యచేశారని భావించిన ఆమె.. తన కోడల్ని అనుమానించింది. ఊరు వచ్చిన విషయం గానీ, మరణించే వరకు జరిగిన విషయాలుగానీ కోడలు తనకు చెప్పకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు భార్య సంధ్యను విచారించగా అసలు విషయం గుట్టు రట్టు అయింది. దీంతో సంధ్యతోపాటు ఆమె ప్రియుడు అనిల్, మరో వ్యక్తి వెంకటసాయిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టులో గన్నవరం పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. యువత, విద్యార్థులను రావణ్ రెచ్చగొడుతున్నాడని.. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలా రావణ్ ప్రకటనలు చేస్తున్నారని… మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతడి తీరు కనిపిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం ఉందని… ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా రావణ్ మాట్లాడారని తెలిపారు. అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని… పదవుల్లో ఉన్నవారిని దూషించడమే కాకుండా…. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.
మావోయిస్టు భావజాలాన్ని అతని ఫోన్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు… దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. రావణ్ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమే అని స్పష్టం చేశారు. అతడికి సహకరిస్తున్నవారెవరో తేల్చాల్సి ఉందని… విచారణకు నిందితుడు సహకరించడం లేదని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్‌పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బీఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్లు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. ఆదివారం సాయంత్రం రావణ్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు.
ఇక అంతకుముందు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఏపీలో కొరియా పెట్టుబడులను ఆకర్షించే అంశంపై విస్తృతంగా చర్చించారు.ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా శాంసంగ్, ఎల్జీ, ఎస్కె తదితర కొరియా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ దిగ్గజాలను ఏపీకి తీసుకురావడంలో సహకరించాలని రాయబారిని మంత్రి కోరారు. శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో రెడీ-టు-యూజ్ పారిశ్రామిక క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో కలిసి కొరియా అనుసంధాన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే, కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ భారత్ పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన “కొరియా ఎన్క్లేవ్”కు కార్యరూపం దాల్చేలా శ్రీసిటీలో కొరియా ఎంఎస్ఎంఈల కోసం ప్లగ్-అండ్-ప్లే టౌన్షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు.అనంతపురంలోని కియా–హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్ విస్తరణ, ఏపీ తీరంలో హెచ్డీ హ్యుందాయ్ తరహా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల స్థాపన అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు.
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. ప్రముఖ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఛైర్మన్, సీఈవో లీ చియాంగ్-గెన్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. గతంలో కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఫుట్‌వేర్ తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు.300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ తెలిపారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, షూఆల్స్ ఉత్పత్తులకు ఏపీని రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మంత్రి లోకేష్ సూచనలపై షూఆల్స్ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్సార్ప్షన్ టెక్నాలజీతో మెడికల్ ఫుట్‌వేర్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రస్తుతం సియోల్ నేషనల్ యూనివర్సిటీతో కలిసి ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. దలైలామా నిండు నూరేళ్లూ పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించడంలో, మానవ హక్కుల రక్షణ కోసం దలైలామా చేస్తున్న అద్వితీయమైన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. లోకానికి దయ, అహింస, కరుణ వంటి ఉన్నతమైన విలువలను పరిచయం చేస్తూ.. దశాబ్దాలుగా కోట్లాది మందిలో దలైలామా స్ఫూర్తిని నింపుతున్నారని ప్రశంసించారు. సమాజంలో ద్వేషాన్ని వీడి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలంటూ దలైలామా ఇచ్చిన సందేశాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయన్నారు. ఇలాగే మరిన్ని సంవత్సరాల పాటు సమాజానికి మార్గదర్శనం చేయాలని, ఆయనకు దైవ బలం, దీర్ఘాయుష్షు లభించాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా… రియల్‌టైమ్‌లో స్పందించే పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించడంతో పాటు… రాష్ట్రవ్యాప్తంగా జీరో వేస్ట్ పట్టణాల లక్ష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యల పరిష్కారమే అధికారుల పనితీరుకు గీటురాయి అని పేర్కొన్నారు.
ఐదు రోజుల జిల్లా పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వ స్పందన, వివిధ శాఖల సేవలు, పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, పట్టణ పరిశుభ్రత, గంజాయి నిర్మూలన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు రియల్‌టైమ్‌లో స్పందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను శాఖలవారీగా విభజించి… ప్రత్యేక కార్యాచరణతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని సూచించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని… అత్యవసర ఘటనల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ తీరంలో బోటు ప్రమాదం వంటి సంఘటనల్లో తక్షణ స్పందనే ప్రభుత్వ పనితీరుకు ప్రమాణమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మూడు నెలల్లోగా తొలగించాలని ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, స్వచ్ఛ రథాల నిర్వహణకు స్పష్టమైన కార్యాచరణ అమలు చేసి… జీరో వేస్ట్ పట్టణాలు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, మహిళలపై నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, ప్రభుత్వ పథకాల ఫలితాల విశ్లేషణపై కూడా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం టవర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ శాఖల పనితీరులో ఏఐ, డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం… సాంకేతికత ఆధారిత పాలన… పరిశుభ్రమైన పట్టణాలు… సమర్థవంతమైన పరిపాలనే ప్రభుత్వ ప్రాధాన్యత అని మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రతి శాఖ ఫలితాల ఆధారంగా పనిచేసేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.






Total views : 194569