Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News హుజూరాబాద్‌లో 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఖాళీగానే.

హుజూరాబాద్‌లో 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఖాళీగానే.

by CVR NEWS

సొంతింటి కలతో ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే మిగులుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పదేళ్ల క్రితం నిర్మించిన 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదు. సర్వేలు, విచారణలు కొనసాగుతున్నా… పంపిణీ మాత్రం ముందుకు సాగడం లేదు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో 2015-16లో హుజూరాబాద్ పట్టణంలోని గణేష్‌నగర్‌లో 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారు. ఇళ్లు పూర్తయినా… ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ కేటాయింపు జరగకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

2021 హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది. అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన వార్డు సభల్లో మరోసారి దరఖాస్తులు స్వీకరించగా… 2,450 మందికి పైగా అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 450 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో… అర్హత లేని వారికి కూడా ఇళ్లు కేటాయించారనే ఫిర్యాదులు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో జిల్లా కలెక్టర్ మరోసారి సమగ్ర విచారణకు ఆదేశించారు.

విచారణ ప్రారంభమై నెల రోజులు దాటినా… ఇళ్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు కేటాయింపులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా… ఇన్నాళ్లు ఖాళీగా ఉండటంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. పలుచోట్ల కిటికీలు, తలుపులు, విద్యుత్ మీటర్లు చోరీకి గురయ్యాయి. డ్రైనేజీ, తాగునీటి వంటి కనీస మౌలిక వసతులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.

పదేళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నామని… ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇళ్లకు మరమ్మతులు చేసి, మౌలిక వసతులు కల్పించి అర్హులకు కేటాయించాలని కోరుతున్నారు. నిర్మాణం పూర్తై దశాబ్దం గడిచినా… డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అందకపోవడం హుజూరాబాద్‌లో చర్చనీయాంశమైంది. విచారణను త్వరగా పూర్తి చేసి… ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040024
Total views : 203024

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: