టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. 1994 నాటి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనల ప్రకారం 2006లో అమలులోకి వచ్చిన ఈ నిబంధన, తాజా సవరణల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రద్దవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. డిజిటల్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో, సంప్రదాయ టెలివిజన్ బ్రాడ్కాస్టర్లకు కూడా వాటితో సమానమైన వ్యాపార అవకాశాలు కల్పించేందుకే ఈ చారిత్రక మార్పు చేసినట్లు వెల్లడించింది.
2006లో ఈ పరిమితి విధించినప్పుడు దేశంలో కేవలం 62 ఛానెళ్లు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 900 దాటిపోయిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిజిటలైజేషన్, డీటీహెచ్, ఐపీటీవీల విస్తరణతో ప్రేక్షకుల వద్దకు 300 నుంచి 500 కి పైగా ఛానెళ్లు చేరుతున్నాయని, తద్వారా వీక్షకుల ఎంపికలు, పోటీ భారీగా పెరిగాయని వివరించింది. ప్రధానంగా ప్రకటనల ఆదాయం పైనే ఆధారపడే పే-టీవీ, ఉచిత ఛానెళ్లకు ఈ నిర్ణయం ద్వారా తమ అడ్వర్టైజింగ్ ఇన్వెంటరీని స్వయంగా నిర్ణయించుకునే పూర్తి వెసులుబాటు లభించనుందని, ఇది భారత బ్రాడ్‌కాస్టింగ్ రంగానికి సరికొత్త ఉత్తేజాన్నిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.