ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 20 వరకు నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాలనకు సంబంధించిన అంశాలపై చర్చకు అవకాశం ఉంది. కాగా.
తొలిరోజు నుంచే సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి కనిపించింది. మెగా డీఎస్సీ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై అధికారపక్షం ప్రతిపక్షాన్ని నిలదీస్తుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వైసీపీ చెబుతోంది. ముఖ్యంగా మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో చర్చకు కేంద్రబిందువుగా మారాయి. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అధికారపక్షం చెబుతుండగా.. ఆరోపణలపై సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
మొత్తంగా నాలుగు రోజుల సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. కీలక బిల్లులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. సభా వ్యవహారాలను బీఏసీ నిర్ణయాల మేరకు ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఏపీ శాసనమండలిలో డీఎస్సీ అంశంపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డీఎస్సీలో అక్రమాలపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద నిరసనకు దిగారు. డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దీంతో సభలో కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.
వైసీపీ ఆరోపణలపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు డీఎస్సీ నిర్వహించకుండా ఇప్పుడు అక్రమాలంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నిర్వహిస్తే.. వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, నాలుగు రోజులపాటు చర్చించినా అభ్యంతరం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ మంత్రులు ఆరోపణలను తిప్పికొట్టడంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. దీంతో డీఎస్సీ అంశంపై శాసనమండలిలో రాజకీయ వేడి కొనసాగింది.