గుండె ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది. నువ్వులనూనె, తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో (క్యాల్షియం ఛానెల్ బ్లాకర్స్) సమానంగా ఉండటం గమనార్హం. కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే.. మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం. ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ (ఎల్డీఎల్) కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు మంచి (హెచ్డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు. నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇది కూడా క్యాల్షియం ఛానెల్ బ్లాకర్ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ దేవరాజన్ శంకర్ పేర్కొంటున్నారు. అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది. నువ్వులనూనెలోని సీసమిన్, సీసమోల్, సీసమోలిన్.. తవుడునూనెలోని ఓరీజనోల్ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మంచి కొవ్వులు) కలిగున్నాయంటున్నారు.
Blood Pressure
భోజనానంతరం సోంపు గింజలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అవిదుర్వాసనలను దూరం చేయడమే కాదు.. చాలాసేపటికి వరకూ నోటిని తాజాగా ఉంచుతాయి. ఆరోగ్యానికీ సోంపు గింజలు చాలా మంచివి. వీటి నుంచి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. భోజనం తరవాతే కాదు.. ముందూ తీసుకోవచ్చు. సోంపులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు పెంచే కార్బోహైడ్రేట్లను ఇవి దూరం చేస్తాయి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తాయి. వీటిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియల రేటు సక్రమంగా ఉండేలా చూస్తుంది. పీచు వల్ల గుండెకు కూడా మేలే. ఎలాగంటే… పీచు పదార్థాలతో రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. సోంపును తరచూ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది. అలానే చెడు కొవ్వును సోంపులోని పోషకాలు గ్రహిస్తాయి. వీటిల్లోని కాపర్ ఎర్రరక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. జింక్ శారీరక ఎదుగుదలకూ, అవయవాలు దృఢంగా ఉండటానికీ తోడ్పడుతుంది. రక్తపోటుతో బాధపడే వారు సోంపు గింజల్ని రోజులో ఒకటి రెండుసార్లు నమిలితే మంచిది. అలా చేయడం వల్ల పొటాషియం శరీరానికి అంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తుంది. కప్పు సోంపులో ఇరవై శాతం పైనే విటమిన్ ‘సి’ ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచడానికీ, చర్మ కణజాలం దృఢపడి గాయాలైనప్పుడు త్వరగా మానిపోవడానికి దోహదం చేస్తుంది. సోంపు గింజల్లోని ఫ్లవనాయిడ్లు ఒత్తిడిని దూరం చేస్తాయి.




Total views : 141624