పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు, గ్యాస్ రిఫైనరీలే లక్ష్యంగా దాడులు, హర్మూజ్ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మనదేశంపైనా పడింది. ఐతే క్రమక్రమంగా ఎల్పీజీ కష్టాలకు బ్రేక్ పడుతోంది. తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు చేరింది.. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఒక కార్గో నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పిక్సిస్ పయనీర్ నౌక 16 వేల 714 టన్నుల ఎల్పీజీని మోసుకొని మంగళూరు పోర్టుకు చేరుకుంది. వచ్చే వారంలో ఇంకా 72 వేల 700 టన్నుల ఎల్పీజీ రానుంది. ఈనెల 25న 26వేల 687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్..ఈనెల 29న 30 వేల టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత్‌కు చేరనుంది. అంతే కాదు..గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నౌకలు, నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన టైమ్‌లో నౌక భారత్‌కు చేరడం గర్వకారణంగా చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఇంధన సరఫరాలను నిర్ధారించడానికి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం బిగ్ రిలీఫ్‌గా మారింది.
#gas rate
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరా దెబ్బతింటోంది. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. భారత్ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎల్పీజీ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ DME డైమిథైల్ ఈథర్ అనే కొత్త ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారించింది. ఇది ఎల్పీజీకి సమానంగా ఉపయోగించగల వాయువు. రసాయన పరంగా కూడా ఇది ఎల్పీజీకి దగ్గరగా ఉండటంతో వంట గ్యాస్‌గా సులభంగా ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దీనిని ‘ప్లాన్-బి’గా ప్రభుత్వం పరిగణిస్తోంది. డీఎంఈను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు దేశంలోనే లభిస్తాయి. బయోమాస్, బొగ్గు, మిథనాల్, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ వంటి వనరులతో దీనిని తయారు చేయవచ్చు. అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరులతోనే గ్యాస్ తయారు చేసే అవకాశం ఉంటుంది.
డీఎంఈను నేరుగా వంట గ్యాస్‌గా వాడవచ్చు. అలాగే ఎల్పీజీతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. దీన్ని బ్లెండింగ్ అంటారు. మొదటి దశలో ఎల్పీజీలో కొంత శాతం డీఎంఈ కలిపి వినియోగించే ప్రణాళికను పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతమైతే క్రమంగా పూర్తిగా ప్రత్యామ్నాయ ఇంధనంగా మారే అవకాశం ఉంది. డీఎంఈ వినియోగంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్తగా స్టవ్‌లు లేదా సిలిండర్లు కొనాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇళ్లలో ఉపయోగిస్తున్న ఎల్పీజీ సిలిండర్లు, రెగ్యులేటర్లు, పైపులు, బర్నర్ స్టవ్‌లు ఇదే విధంగా పనిచేస్తాయి. అందువల్ల వినియోగదారులకు అదనపు ఖర్చు ఉండదు.
ఈ ప్రాజెక్టుపై CSIR – Council of Scientific and Industrial Research శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి డీఎంఈ ఉత్పత్తి విధానాన్ని పరీక్షిస్తున్నారు. దీనిని తక్కువ ఖర్చుతో తయారు చేయడం ఎలా అనే దానిపై ప్రత్యేకంగా పరిశోధనలు సాగుతున్నాయి. డీఎంఈను స్వచ్ఛమైన ఇంధనంగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని కాల్చినప్పుడు సాధారణంగా తక్కువ కాలుష్యం ఉత్పత్తి అవుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశీయంగా ఎల్పీజీ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గ్యాస్ నిల్వలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా ప్రయోగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ అవసరాల దృష్ట్యా ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆయిల్ రిఫైనరీలను పెట్రోలియం శాఖ ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న నిల్వలను కేవలం డొమెస్టిక్ గ్యాస్ , ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యతగా కేటాయించాలని నిర్ణయించింది. అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. మరోవైపు, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై పిడుగులా పడింది. ఎల్పీజీ కొరత సాకుతో హోటళ్లు, రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయడంతో యజమానులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇప్పటికే సరఫరా నిలిచిపోయింది. దీనిపై చెన్నై హోటల్స్ అసోసియేషన్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. “ఆహార రంగం నిరంతర సేవలు అందించే రంగం. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టళ్లు, రైలు ప్రయాణికులకు ఆహారం అందించడం ఇప్పుడు కష్టతరంగా మారింది. ఇప్పటికే బుక్ అయిన స్టార్ హోటల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఈ నిర్ణయంతో కుప్పకూలే ప్రమాదం ఉంది. వెంటనే ఎల్పీజీని అత్యవసర సేవగా గుర్తించి సరఫరాను పునరుద్ధరించండి” అని వారు విజ్ఞప్తి చేశారు.




Total views : 78931