దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. అమెరికాపై 201 పరుగుల తేడాతో నెగ్గింది. బ్లూంఫోంటీన్ లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అమెరికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ అండర్-19 జట్టు పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (108) సెంచరీతో మెరిశాడు. ముషీర్ ఖాన్ 73, కెప్టెన్ ఉదయ్ సహారన్ 35, ప్రియాన్షు మోలియా 27, సచిన్ దాస్ 20, ఆదర్శ్ సింగ్ 25 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో అతీంద్ర సుబ్రమణియన్ 2, ఆర్య గార్గ్ 1, ఆరిన్ నాద్ కర్ణి 1, కెప్టెన్ రిషి రమేశ్ 1 వికెట్ తీశారు.
international news
శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతంలో విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ఎత్తివేసింది. క్రికెట్ పాలన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమంటూ గతేడాది నవంబరులో శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది. వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో శ్రీలంక జట్టు ఘోర పరాజయం నేపథ్యంలో, లంక క్రికెట్ బోర్డును శ్రీలంక క్రీడల మంత్రి రద్దు చేశారు. అయితే, ప్రభుత్వం క్రికెట్ బోర్డు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది. దాంతో, శ్రీలంకలో నిర్వహించాల్సిన అండర్-19 వరల్డ్ కప్ కూడా దక్షిణాఫ్రికా తరలిపోయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో జీన్ కారోల్ అనే ప్రముఖ జర్నలిస్టు, మాజీ అడ్వైజ్ కాలమిస్టుకు 83 మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది. తనపై అత్యాచారాన్ని తిరస్కరించడం ద్వారా ట్రంప్ తన విశ్వసనీయతను దెబ్బతీశాడని, తను ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ జీనో కారోల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. 1990లలో మాన్‌హట్టన్‌లోని ఒక అత్యున్నత విభాగం స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని కారోల్ తన పుస్తకం ‘వాట్ డూ వి నీడ్ మెన్ ఫర్?. ఎ మోడెస్ట్ ప్రొపజల్’ అనే పుస్తకంలో ఆమె రాసుకున్నారు. దీనిని జూన్ 2019లో ‘న్యూయార్క్ మ్యాగజైన్’ ప్రచురించింది. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, అత్యాచారం అవాస్తవమని ట్రంప్ ఖండించారు. కారోల్ ఒక అబద్ధాల కోరు అని, ఒక రాజకీయ కార్యకర్త అని ట్రంప్ విరుచుకుపడ్డారు. 1987లో ఒక పార్టీలో కలిసినట్టుగా చెబుతున్నప్పటికీ ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని కూడా ట్రంప్ ఖండించారు.
అయితే 2019లో ట్రంప్ చేసిన తప్పుడు ప్రకటన తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని, ఆమె మానసిక క్షోభకు కారణమైందని ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. తన కెరీర్‌ను ట్రంప్ దెబ్బతీశారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా తన పరువు తీశారని ఆరోపిస్తూ జనవరి 2022లో ఆమె ప్రత్యేక వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది. నష్టపరిహారంగా 18.3 మిలియన్ డాలర్లు, శిక్షాత్మక నష్టపరిహారంగా 65 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ నిర్ణయించింది. ట్రంప్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ మేరకు పెద్ద మొత్తంలో పరిహారం విధించింది. ఈ తీర్పుపై ‘ఇవి అమెరికా కోర్టులు కావు’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ తీర్పుని ఉన్నతస్థాయి న్యాయస్థానంలో సవాలు చేయాలని ట్రంప్ తరపు న్యాయవాది వెల్లడించారు.
శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు, బకాయి బిల్లుల చెల్లింపు, ఆస్పత్రులు – ట్రస్ట్ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మెకు దిగాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల యాజమాన్య సంఘం తెలిపింది. ప్రస్తుతం అడ్మిషన్లలో ఉన్న రోగులకు యథావిధిగా సేవలు కొనసాగనున్నాయని, కొత్త రోగులను చేర్చుకోబోమని తెలిపాయి. నిజానికి గత ఏడాది డిసెంబరు 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సమ్మెను విరమించుకున్నారు. అయితే హామీ మేరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చలేదంటూ మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది. కేసీఆర్ పాలనలోని అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు. అందుకే జనం ఆ పార్టీని బొందపెట్టారని, అయినా సిగ్గు లేకుండా అరువు జిల్లా నేతను తీసుకొచ్చి మొరుగుతున్నడు అని అన్నారు. బండి సంజయ్ ఏం చేసిండో కేసీఆర్ ను రమ్మను చర్చించేందుకు సిద్ధం అన్నారు. నువ్వెన్ని మొరిగినా నీ కుటుంబ గుత్తాధిపత్యాన్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అయన తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు. ఇక్కడున్న సోకాల్డ్ మేధావి వినోద్ కుమార్ టిప్పర్ దరఖాస్తులు పంపిండు తప్ప ఒక్క పని చేయలేదు. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఉపయోగపడ్డారే తప్ప కరీంనగర్ కు చేసిందేమీ లేదని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్.. జగిత్యాల, వరంగల్ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చిందెవరు? అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపీగా ఉన్నన్నాళ్లు కరీంనగర్…వరంగల్ రోడ్డు అధ్వాన్నంగా ఉండేవి… యాక్సిడెంట్స్ అవుతుంటే ఎన్నడైనా నిధులు తెచ్చినవా? నేను ఎంపీగా ఉంటూ కేంద్రంతో మాట్లాడి రిపేర్లకు రూ.41 కోట్లు తెచ్చిన అంటూ ఫేర్ అయ్యారు. ఈనెల 28న ఎస్సారార్ కాలేజీలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కర్యక్రమానికి రానున్నారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు.
గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్ప యాత్ర రెండవ రోజు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైంది. మారుతి నగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, ఎల్ఐసి కాలనీ మీదుగా స్తంభాల గరువు రామాలయం వద్ద ముగిసినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ… ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుంటే సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఆ నిధులు అన్ని దారి మళ్ళిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దేశంలో ఎక్కడికి వెళ్లినా కానీ ప్రజల మధ్య తిరుగుతున్నారని, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాల మాటున తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ మాట్లాడుతూ…
మోదీ ప్రధాని అయిన పదేళ్లలోనే అందరికీ సంక్షేమ పధకాలు అందేలా చేస్తున్నారు. మహిళలు, యువతకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే, మరో పక్క అభివృధ్ది పై దృష్టి సారిస్తున్నారు. మన రాష్ట్రంలో ఓక్క రైల్వేలకే 89 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే లక్షా 10 వేల కోట్లతో జాతీయ రహదారులు మన రాష్ట్రంలో అభివృధ్ది చేశాము. మన గుంటూరులో 500 కోట్లు ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి కేటాయించాము. మన రాష్ర్టంలో ఎన్ని పధకాలు అమలు చేస్తున్నా, ఏమీ చేయలేదనే వారికి విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర ఒక చెంపపెట్టు లాంటిది. కేంద్ర ప్రభుత్వ పధకాలకు తమ తాతలు, తండ్రుల పేర్లు పెట్టుకుని బతుకుతున్న వైసిపి ప్రజలను వంచిస్తోంది. ప్రజలకు అందుతున్న పధకాలలో వందశాతం కేంద్రం నుండి వస్తున్నవే. ఇవన్నీ తెలుసుకున్న ప్రజలు బిజెపి కి మద్దతు ఇస్తున్నారు. ఒక్కసారి బిజెపి కి అధికారం ఇవ్వండి. అభివృధ్ది అంటే ఏంటో చూపిస్తాం అని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ అక్టోబరులో కుంగింది. ఈ బ్లాకులో పియర్స్ దెబ్బతినడంతోపాటు దిగువన కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేసియర్ దెబ్బతినడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించి పలు చర్యలు సిఫార్సు చేశారు. ఏబీ పాండ్యా ఛైర్మన్‌గా ఉన్నరాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీని పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే, బ్యారేజీ కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్, హైడ్రాలజీ నిపుణుడు, మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రామరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) మురళీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత కమిటీ.. బ్యారేజీ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసి రెండు, మూడు ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది. తర్వాత కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి.
భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను ఆమె ఖండించారు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడు ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని తెలిపారు. తాను రిటైర్మెంట్ ప్రకటించానంటూ కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయని, అందులో నిజం లేదని ఆమె వివరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 24న తాను దిబ్రూఘర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని, అందులో పిల్లలను ప్రోత్సహిస్తూ మాట్లాడానని చెప్పారు. తనకు ఇప్పటికీ క్రీడల్లో ఇంకా సాధించాలనే కోరిక ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో వయోపరిమితి కారణంగా పాల్గొనడానికి వీలుండదని చెప్పానని అన్నారు. వయోపరిమితి ఉన్నప్పటికీ తన ఆటను కొనసాగించగలనని, ఇప్పటికీ తాను ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నానంటూ పిల్లలకు చెప్పానని క్లారిటీ ఇచ్చారు. తాను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కచ్చితంగా అందరికీ తెలియజేస్తానని అన్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రానికి పునర్వైభవం వచ్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి పంచనారసింహుల ఆలయాన్ని మంత్రి సందర్శించారు. క్షేత్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొండ కింద పట్టణంలోని ప్రధాన రహదారిలో అండర్‌పాస్ నిర్మించడం వల్ల స్థానికుల ఉపాధికి తీవ్ర అవరోధం ఏర్పడిందని తెలిపారు. భక్తుల అవసరాలు గమనించకుండా.. చేపట్టిన పనులు పూర్తి కావడానికి రూ.300 కోట్లు అవసరమని వైటీడీఏ అధికారులు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం విశ్రాంత అధికారులతో చేపట్టిన పనులపై ఆరా తీయనున్నట్లు చెప్పారు. త్వరలో మరో సమీక్ష సమావేశం నిర్వహించి యాదాద్రిలో చోటుచేసుకున్న లోపాలను సరిచేయడంతోపాటు భక్తులకు అవసరమైన వసతులను సమకూర్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. భక్తులు దేవుడి చెంత నిద్రచేసే మొక్కుకు అవకాశం కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. స్వామివారిని భక్తులు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు సులభంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రానికి వచ్చే ఆదాయంపై కాకుండా భక్తుల అవసరాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే సీఎంను ఆహ్వానించి.. యాదగిరిగుట్ట, బస్వాపురం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. క్షేత్ర పరిధిలో దాతలకు స్థలాలు కేటాయిస్తే వారే కాటేజీలు నిర్మించుకుంటారన్నారు. సమీక్షలో విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జిల్లా కలెక్టర్ హన్మంత్ కె.జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్చంద్ర, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
సంప్రదాయాల మడికట్టను సౌదీ అరేబియా బద్దలుగొట్టింది. మరికొన్ని వారాల్లో అక్కడ తొలి మద్యం దుకాణం తెరుచుకోబోతోంది. ఈ మేరకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. సౌదీలో 1952 నుంచే మద్యంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం తాగడం ఇస్లాంకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తెరుచుకోబోయే మద్యం దుకాణంలో ముస్లిమేతరులకు మాత్రమే మద్యాన్ని విక్రయిస్తారు. అంతకుముందు వినియోగదారులు డిప్లో అనే యాప్‌లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాత నెలవారీ కోటాకు అనుగుణంగా మద్యం కొనుగోలు చేసుకోవచ్చు. 21 ఏళ్ల లోపువారిని స్టోర్‌లోకి అనుమతించరు. ఫోటోగ్రఫీ పై నిషేధం ఉంది. మద్యం కొనుగోలు చేసే సమయంలో ఫోన్లను కూడా పౌచ్‌లలో లాక్ చేయాల్సి ఉంటుంది. సౌదీలో మద్యంపై నిషేధం కారణంగా ఇక్కడ ఆల్కహాల్ బ్లాక్‌మార్కెట్ కూడా విస్తృతంగా ఉంది. ఎంబీసీ స్మగ్లింగ్ ద్వారా ఇక్కడికి మద్యం దిగుమతి అవుతూ ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు లైసెన్స్ పొందిన సంస్థలలో ముస్లిమేతరులకు మద్యం కొంత అందుబాటులో ఉండేలా అనుమతినిస్తున్నాయి.