రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడమే లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు .పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 142 కోట్ల సింగరేణి నిధులతో నూతనంగా నిర్మించే ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ తో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కళాశాలను సైతం మంజూరు చేసిందని అన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు.ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పెంచిన తర్వాత సుమారుగా రెండు వేల మంది చికిత్స పొందారని అన్నారు.రామగుండం కార్పోరేషన్ పరిధిలో అవసరమైన చోట బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.
ఎమ్మెల్యేగా ఎం.ఎస్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ,సంస్థ చొరవతో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు.సింగరేణి సంస్థ సహకారంతో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.
karimnagar district news
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంచినీటి, సాగునీటి సరఫరాలో, కరెంటు సప్లయ్‌లో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే.. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన అంత బలంగా, కాపలాదారుగా కొట్లాడుతుందని భరోసా ఇచ్చారు..
రాష్ట్రంలో మంచి నీళ్లకు, కరెంటుకు ఎందుకు సమస్యలు వస్తున్నయో నాకు అర్థం కావడం లేదు. మేం ఎంతో శ్రమించి ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్ భగీరత పథకం తీసుకొచ్చినం. ఆదిలాబాద్ గోండు గూడెం నుంచి నల్లగొండ లంబాడీ తండా దాకా అందరికీ మంచినీళ్లు అందేలా చూసినం. బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథాకాన్ని నడిపే తెలివిలేదా..? ఎందుకు మిషన్ భగీరథలో సమస్యలు వస్తున్నయ్..?’ అని ప్రశ్నించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
‘నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఏడాదినర్థం తిరగకుండానే కరెంటు పరిస్థితిని చక్కదిద్దినం. ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినం. దాంతో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు వచ్చింది. రైతు బంధు ఇచ్చినం. కరోనా వచ్చి కాటేసినా రైతుబంధు ఆపలే. ఇయ్యాల ఆ రైతుబంధు ఏసుడు చేతనైతలేదా..? కేసీఆర్ జర్ర ముఖం మల్పంగనే కట్క బంద్‌జేసినట్టు కరెంటు బందైతదా..? మేం తొమ్మిదేళ్లు ఇచ్చింది ఇయ్యాల ఈ చవట దద్దమ్మలకు ఇయ్యొస్తలేదా..?’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
‘ఇయ్యాల మళ్ల మీరు ఆళ్లకే ఓటేస్తే నష్టపోతరు. మేం రైతుబంధు ఎయ్యకపోయినా.. కరెంటు సక్కగ ఇయ్యకున్నా.. తాగునీటి, సాగునీటి సరఫరా సక్కగ లేకున్నా.. మోటర్లు కాలబెట్టినా.. పొలాలు ఎండబెట్టినా.. జనం మళ్లీ మనకే ఓటేసిండ్రని ఆరు గ్యారంటీలకు ఎగనామం పెడ్తరు. ఈ టైమ్‌లో మీరు కర్రు కాల్చి వాతపెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం వస్తది. అహంకారం పెరుగుతది. ఇయ్యాల చెప్పుతో కొడుత అన్నోడు రేపు నిజంగనే కొడుతడు. ఇట్ల మోసపోదామా..? లేదంటే గులాబీ జెండా ఎగరేసి మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా..? ఇది మన తెలంగాణ సమాజం బాగా ఆలోచించాలె. ఈ లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా అంత బ్రహ్మాండంగా ముందుకుపోతం’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ఇది చదవండి : ధరణి పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
‘భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే.. అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం పది జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినం. 150 ఉత్తరాలు రాసినం.. పర్సనల్‌గా కలిసి అడిగినం కానీ ఒక్కటంటే ఒక్కటి నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. బండి సంజయ్ ఎంపీగా ఏం చేశాడు. ఐదు రూపాయల పని అయినా జరిగిందా. ఎటువంటి వ్యక్తి మనకు ఎంపీగా ఉంటే లాభం అవుతుందనేది ప్రజలు ఆలోచించాలి. ‘ అని కేసీఆర్ అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే దుఃఖం వస్తుంది.. కరీంనగర్ కదనభేరిలో కేసీఆర్ భావోద్వేగం
రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా? ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నప్పుడు పచ్చటి పొలాలు ఉండే.. 24 గంటల కరెంటు ఉండే.. ఇంతమాయిల్లమే అవన్నీ ఎందుకు మాయమైనయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవొట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టి బాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా..? అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కరీంనగర్ కదన భేరిలో బీఆర్ఎస్ అధినేత పాల్గొన్నారు. ‘తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కుతోచని స్థితిలో, భయంకరమైన కరువు కాటలతో కరెంటు కోతలతో.. ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలమైన తెలంగాణ.. ఇగ ఎక్కడైతది తెలంగాణ.. దశ దిశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటించాం. ఆ రోజు ఎవరికీ విశ్వాసం లేదు. తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు’ ఉండేవని గుర్తు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రైతులు నిలబడగలుగుతం అనుకున్నరు… కానీ 3 నెలల్లోనే పంటలు ఎండబెట్టే పరిస్థితి : కేసీఆర్
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశాం. రైతుబంధు తీసుకువచ్చాం. 24గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేశాం. ఈ సదుపాయంతో తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. ఇగ నిలబడగలుగుతం అనుకున్నరు. కానీ, మూడునెలల్లోనే ఇంత మార్పు జరిగితే.. పంటలు ఎండబెట్టే పరిస్థితి. నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్. ఏం అన్యాయం.. ఏం గరి’ అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ కదనభేరి సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనను తూర్పారబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ నాడు సమైక్య పాలకులను తిట్టినం. ఇప్పుడు అంతకన్నా భయంకరంగా తయారైంది. నేను చేనేత కార్మికులకు మనవి చేస్తున్నా. మీరు మళ్లీ బతకాలంటే మీ తరఫున కొట్లాడే వాళ్లు.. అసెంబ్లీలో ఉన్నరు. పార్లమెంట్లో ఉండే అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్రాన్ని.. అటు కేంద్రాన్ని నిలదీస్తాం. చేనేత కార్మికులు ఆలోచన చేయాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు
మొన్న తమాషకు ఓటేశారు..
‘ఓటు తమాషాకు వేయొద్దు. మొన్న తమాషాకు వేశారు. కరెంటు బాగైంది.. మంచినీళ్లు బాగైనయ్.. రైతుబంధు వస్తుంది.. అన్ని సెటిల్ అయ్యాయి.. బాధ లేదు.. వీడు ఎక్కువ ఇస్తమని దురాశకు అటు చేయి చూపారు. తీర్థం పోదం తిమ్మక్కంటే.. వాడు గుళ్లే.. మనం చలిలే. నమ్మి తీర్థం పోయినం.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నం ఏమైంది ? వాళ్లు మంచిగ పదవులకెక్కారు.. బ్రహ్మాండంగా ఉన్నరు. డబ్బు మూటలు గుంజుతున్నరు. దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నరు. ఢిల్లీకి మళ్లీ సూట్‌కేసులు పంపుతున్నరు.. ఆ పని మీద ఫుల్ బిజీగా ఉన్నరు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్.. ఢిల్లీ.. ఢిల్లీ, హైదరాబాద్ తిరుగుడు. మూడునెలల్లో తొమ్మిదిసార్లు పోతరా? ఇన్ని యాత్రలా? ఏం జరుగుతుంది ? మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దలదగ్గర.. పాదాల దగ్గర తాకట్టుపెట్టి.. మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరు. ఇది ఈ విధంగానే కొనసాగాలా? లేక ప్రజల పక్షాన బలం గళం వినిపించి పోరాడే నాయకులు పార్లమెంట్‌కు వెళ్లాలా? ఆలోచించాలి’ అన్నారు.
ఇది చదవండి : గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన…
బీజేపీ ఎంపీలు నలుగురు ఏం చేశారు..
‘ఇంతకు ముందు నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేశారు? ఏకాన పైస తెచ్చారా? ఏమన్నా రాష్ట్రానికి లాభం చేశారా? దయచేసి ఆలోచన చేయాలి. అవలోకగా, తమాషాగా ఓట్లు వేయొద్దు. భయంకరంగా దేశం అన్నివిధాలా నష్టపోతున్నది. ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలు ఉన్నయ్. 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. 70వేల టీఎంసీల నీళ్లు నదుల్లో ప్రవహిస్తున్నయ్. 40కోట్ల ఎకరాల సాగుభూమికి సరిపడా నీళ్లు ఉన్నయ్. కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే.. బ్రహ్మాండంగా యావత్ దేశం కరెంటు కొరత లేకుండా ఉంటుంది. మొన్న నన్ను ఆగవట్టి బ్రేక్ కొట్టారు కానీ.. మొన్న గెలిచి ఉంటే.. ఆపాటికి దేశంలో చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బతగిలింది పర్వాలేదు. ఓర్సుకుందాం.. తట్టుకుందాం. ఉద్యమాలు చేసినోళ్లం. ఓపిక ఉన్నోళ్లం. పేగులు తెగేదాక కొట్లాడే శక్తి.. ధైర్యం ఉన్నోళ్లం.. ధైర్యంగా ముందుకెళ్లాలి. దళితబంధు తెచ్చినా.. చేనేత కార్మికుల కోసం తెచ్చినా.. రైతుబంధు తెచ్చినా.. కులం, మతం, జాతి ప్రసక్తి లేకుండా.. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా.. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పెట్టిన కులం.. మతం, జాతి చూడలేదు. ఇవాళ మనం తెలంగాణ జాతిగా నిలబడాలి. కలబడాలి. ఇక్కడికి ఉపన్యాసం చెప్పేందుకు రాలేదు. ఒక సందేశం, ఒక టేకాఫ్.. ఇది లక్ష్మీగడ్డ కాబట్టి.. ఇదేగడ్డ నుంచి తెలంగాణ సాధించాం కాబట్టి.. నేను మీ అందరికీ నమస్కరిస్తున్నా’నన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కరీంనగర్ బీఆర్ఎస్ కదనభేరి సభలో కాంగ్రెస్ పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మేం ఇంటింటికీ మంచి నీరు సరఫరా చేశాం. రెప్పపాటు కూడా కరెంట్ తీయలేదు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటేస్తే.. కరెంట్ ఇవ్వకపోయినా, రైతు బంధు లేకున్నా మళ్లీ మాకే ప్రజలు ఓటేశారు అంటారు. గ్యారంటీలకు ఎగనామం పెడతారు. ఈ టైమ్ లో వారికి మీరు కర్రు కాల్చి వాత పెట్టకపోతే అహంకారం పెరిగిపోతుంది’ అని ఈ విషయం తెలంగాణ ప్రజలు గ్రహించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పై కరీంనగర్ సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. హోదాకు తగిన తీరులో ఆయన మాటతీరు లేదంటూ విమర్శించారు. ‘ఆరు గ్యారంటీలు ఏవయ్యా, కరెంటేదీ? నీళ్లేవీ? అని అడిగితే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా.. చీరుతా చంపుతా అని మాట్లాడతాడు. ఒక సీఎం మాట్లాడాల్సిన భాషా ఇది..? నేనూ ఉద్యమం సమయంలో మాట్లాడాను… కానీ పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా నా నోటి నుంచి దురుసు మాట విన్నారా?’ అని ప్రశ్నించారు. ఇక ఇదే విషయంపై మా కరస్పాండెంట్ సత్యనారాయణ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కదనభేరి నుండి మరిన్ని వివరాలు అందిస్తారు…
ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూర్తి సహకారంతో మంథని శివ కిరణ్ గార్డెన్ లో మెగా జాబ్ మేళా రామగుండం సిపి రిబ్బన్ కట్ చేసి , ప్రారంభించి, యువతి యువకుల్లాని ఉద్దేశించి నిరుద్యోగం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మెగా జాబ్ మేలని ఉపయోగించుకొని, ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించే దిశగా ముందు సాగాలని సూచించారు. నేడు దాదాపుగా 65 కంపెనీలతో దాదాపుగా 5 వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇంత చక్కని ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతీ, యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కమీషనరేట్ పరిధి పోలీస్ సిబ్బంది, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు.
కదనభేరి సభ (Kadana Bheri Sabha) :
కరీంనగర్ కదన భేరి సభ(Kadana Bheri Sabha)కు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను గుర్తించినట్లు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. నేడు శనివారం ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లతో పాటు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ…తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈ నెల 12 న ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానం లో సాయంత్రం జరిగే కరీంనగర్ కదనభేరి సభకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు హాజరవుతున్నా..ఈ సభకు కరీంనగర్ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల నుండి లక్షకు పైగా జనాలు వస్తారని వెల్లడించారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కరీంనగర్ నుండి 20వేల మంది, మానకొండూర్ హుజురాబాద్ హుస్నాబాద్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల.. ఒక్కో నియోజకవర్గం నుండి 15 వేల మంది హాజరువుతున్నట్లు చెప్పారు. కదనభేరి సభకు పెద్ద ఎత్తున రైతులు, యువకులు, మహిళలు హాజరవుతున్నట్టు వెల్లడించారు. సిరిసిల్ల, వేములవాడ, హుజరాబాద్ హుస్నాబాద్, మానకొండూరు, నియోజకవర్గాల నుండి వచ్చే వాహనాలకు సెయింట్ జాన్, సెయింట్ అల్ఫోర్స్ పాఠశాలలో కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలనుండి వచ్చే వాహనాల కోసం రేకుర్తి ఈద్గా, శుభం గార్డెన్, లో మరియు కార్లు, ఆటోలతో పాటు చిన్న వాహనాలను డి మార్ట్ వద్ద పార్కింగ్ స్థలం గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ మాజీ గ్రంథాలయ చైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి పొన్నం అనిల్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్ గందె మహేష్ ఏసిపి విజయ్ కుమార్, సీఐ లు సృజన్ కుమార్, ఓ.రమేష్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పర్శ రమేష్ తదితరులు ఉన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కరీంనగర్ గాంధీనగర్ కి చెందిన సింగిరెడ్డి మోహన్ రెడ్డి తండ్రి నర్సింహారెడ్డి వ్యాపారి వద్ద నుండి 2016 లో గంగాధర మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మాల కనకయ్య ముప్పై లక్షల రూపాయలు, 2017 లో మరో ఇరువై ఆరు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని హామీగా మాల కనకయ్య అతని భార్య మాల మంజుల తన పేరిట ఉప్పర మల్యాల రెవిన్యూ గ్రామ శివారులో వున్న మూడెకరాల ముప్పైతొమ్మిదిన్నర గుంటల భూమిని మోహన్ రెడ్డి పేరిట మార్టిగేజ్ చేయడమే గాక రెండు బ్యాంకు చెక్కులను సైతం ఇచ్చారు. ఇట్టి విషయాన్నీ దాచి పెట్టి అదే భూమిపై నకలు ధ్రువపత్రాలు సృష్టించి వేరే వ్యక్తులకు విక్రయించారని, విషయం తెలుసుకుని నిందితులను నిలదీసిన బాధితుడు మోహన్ రెడ్డిని చంపుతామని బెదిరింపులకు గురిచేసారని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగధార పోలీస్ స్టేషన్ నందు గురువారం నాడు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో ఫిర్యాదులో తెలిపిన విషయం వాస్తవమేనని తేలినందున భార్యాభర్తలయిన మాల కనకయ్య మరియు మాల మంజుల ఇరువురిని అదుపులోకి తీసుకుని గౌరవ కోర్టులో హాజరు పరచగా కేసును పరిశీలించిన గౌరవ మేజిస్ట్రేట్ నిందితులిద్దరికి 14 రోజుల రిమాండ్ విదించినందున, వారిని జైలుకు తరలించారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న 33,549 మంది విద్యార్థులు
- జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలు
- ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలతో ప్రారంభమై మార్చి 16 వరకు జరిగే పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, మోడల్, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 33,549 మంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,590 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తుండగా 16,959 మంది విద్యార్థులకు సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 56 మందిని చీఫ్ సూపరింటెండెంట్లను, 56 మంది డిపార్టుమెంట్ అధికారులను నియమించారు. ఎలాంటి పొరపాట్లు, కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డీఈసీ స్క్వాడ్, ఒక హెపీసీ స్క్వాడ్, మూడు ఫ్లయింగ్ స్వ్కాడ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్, పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ల నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఉదయం 8.15 కే కేంద్రంలోకి అనుమతి
ఉదయం 8.15 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు.. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించరు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఒక జూనియర్ లెక్చరర్, ఒక హెచ్పీసీ మెంబర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పరీక్షలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇన్విజిలేటర్లుగా జూనియర్ కళాశాలల లెక్చరర్లతోపాటుగా 170 మంది జిల్లా విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులను నియమించారు. జిల్లా కేంద్రంలో 35 పరీక్షా కేంద్రాలు,, ఇతర ప్రాంతాల్లో 21 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈసారి జరిగే ఇంటర్మీయట్ పరీక్షలకు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పెరిగారు.ఏడు పరీక్షా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయడంతోపాటు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను పరీక్ష ముగిసే వరకు మూసివేస్తారు.
జి జగన్మోహన్రెడ్డి, డీఐఈవో
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ, విద్యా శాఖ, ఎన్పీడీసీఎల్, ఆరోగ్యశాఖ, ఆర్టీసీ అధికారుల సమన్వయంతో పరీక్షలు సజావుగా జరిగేందుకు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. టెలి మానస్ అనే కార్యక్రమం ద్వారా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసింది. విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబర్లు 14416, 1800-914416కు ఫోన్ చేస్తే సలహాలు, సూచనలు ఇస్తారు. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలి. విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం, గెజిటెడ్ సంతకం చేయించాల్సిన అవసరం లేదు. హాల్టికెట్లలో పరీక్షా కేంద్రా చిరునామా సరిగా ఉందో లేదో చూసుకోవాలి. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి : బయో ఆసియా 2024 సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రోడ్డు భద్రత మాసొత్సవాల సందర్భంగా రామగుండం సి పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ రహదారి మేడిపల్లి చౌరస్తా నుండి సిపి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం నగరంలోని ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్, కార్పొరేషన్ కార్యాలయం, గాంధీ చౌరస్తా, విఠల్ నగర్ మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సి పి శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు భద్రత పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని అన్నారు. హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి, రవాణా శాఖ అధికారులు, సింగరేణి రక్షణ సిబ్బంది, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు నెలలుగా ఆశా కార్యకర్తలకు వేతనాలు ఇవ్వడం లేదని, ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలపై ఏఎన్సీ పేరుతో అధిక భారం పడే విధంగా పని ఒత్తిడి కల్పిస్తున్న అధికారులు తక్షణమే దీన్ని రద్దు చేయాలని కోరారు. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని పలుమార్లు అడిగినా అందించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల నిరావధిక సమ్మె చేపట్టడానికి ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలతో పాటు సిపిఐ, సిపిఎం వామపక్ష నేతలు పాల్గొన్నారు.





Total views : 89234