135 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ధేశించిన 78 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో ఇప్పటివరకు 51.74 కు గాను 47.59 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 92 శాతం లక్ష్యాన్ని చేరుకుందని అర్జీ1 జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన 135వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిఎం శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా సింగరేణి పతకాన్ని ఆవిష్కరించి అనంతరం సంస్థ ఏర్పాటు చేసిన 22 స్టాల్స్ ను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. సంస్థ ఉత్పత్తి ఒకటే కాకుండా పర్యావరణం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఒక కోటి 59 లక్షల రూపాయల సి ఎస్ ఆర్ నిధులు వెచ్చించి రాజీ రహదారి వెంబడి 24 కిలోమీటర్ల మేర మొక్కలు నాటించడం జరిగిందన్నారు. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల మానసిక ఉల్లాసానికి ఆహ్లాద భరితమైన పార్కుల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి, కార్మికుల సంక్షేమంతో పాటు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తున్నామని జిఎం శ్రీనివాస్ తెలిపారు.
karimnagar district news
కుళ్ళిన, చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్ బి రెస్టారెంట్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించిన మున్సిపల్ కమిషనర్ యజమానిపై మండిపడ్డారు. చెడిపోయిన ఆహార పదార్థాలను మున్సిపల్ చెత్త వాహనంలో బయటకు తరలించారు. అనంతరం 10 వేల రూపాయలు జరిమానా విధించారు. రెస్టారెంట్లో తినడానికి వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శని నగర్ వీధిలో నివాసం ఉంటున్న సహాయ కార్మిక శాఖ అధికారి కె. సాయిబాబా నివాసంలో ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కాడు. కడెం మండలం పెద్ద బిళ్ళలు గ్రామానికి చెందిన గంగన్న అనే వ్యక్తి ద్వారా లేబర్ ఆఫీసర్ కొడుకు దామోదర్ 25వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు, లంచం తీసుకుంటున్న 25 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసులో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబాను అతని కుమారుడు దామోదర్ ను అరెస్ట్ చేసి కరీంనగర్ లోని సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఏసిబి డిఎస్పి రమణమూర్తి తెలిపారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకం కోసం పది సంవత్సరాల నుంచి తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఓ యువకుడు దుబాయ్ నుండి మాట్లాడిన వీడియో లో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను మాట్లాడుతూ రికార్డ్ చేసిన వీడియోను పంపాడు. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ కు చెందిన రాగుల వెంకటేష్ తండ్రి మల్లయ్య జగిత్యాల ఆర్టీసీ డిపోలో పని చేసేవాడు. అప్పట్లో బస్సు రిపేర్ చేస్తుండగా బలమైన రాడ్డు కాళ్లపై పడి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుండి మెట్పల్లి, మంథని డిపోల్లో కొనసాగుతూ ఉన్నాడు. మంథని డిపో మేనేజర్ సూచన మేరకు కరీంనగర్ లో వైద్య పరీక్షల కోసం వెళ్లగా నీవు ఉద్యోగం చేయడానికి పనికి రావని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ లోగా కాలి గాయం విషమయంగా మారి మల్లయ్య మృతి చెందాడు. అయితే మల్లయ్య కుమారుడు వెంకటేష్ ఆర్టీసీ లో కారుణ్య నియామకం కోసం 10 సంవత్సరాల నుండి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా తనకు ఆర్టీసీలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని దుబాయ్ నుండి వెంకటేష్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ముగుస్తున్నడంతో తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తినీ, చాటుకున్నారు. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో స్వామివారిని దర్శించు కునేందుకు ఐదు గంటలు పైగా సమయం పట్టింది. అలాగే తమ కోరిన కోరికలు నెరవేరాలని స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమోక్కు పూజలు చెల్లించుకున్నారు భక్తులు. అటు ప్రసాదం కౌంటర్స్, కళ్యాణకట్ట లో భక్తులతో నిండిపోయాయి…. వాయిస్ : వచ్చిన భక్తుల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు అగ్రహo వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బందికి తెలిసిన వారిని, లోపలికి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల దేవుడు రాజన్న, కనీసం పేదలకు దర్శనం కాకుండ ఆలయ అధికారులు చేసారని మీడియాతో వాపోయారు….
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పెద్దపెల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చింతకుంట విజయ రమణ రావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా బీపీల్ కుటుంబాలకు రూ. 10 లక్షల వరకు ఆరోగ్య భీమాను కల్పించే కార్యక్రమాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ రమణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ అన్ని ఆరోగ్య కార్యక్రమాల యొక్క ప్రధాన పథకం తెలంగాణలో “అందరికీ ఆరోగ్యం” సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తామని అన్నారు. మరియు 126 రకాల చికిత్సలకు ఒక సంవత్సరం కాలం ఉచితంగా మందులు అందిస్తామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిరుపేద కుటుంబాలకు చికిత్స కోసం సంవత్సరానికి రూ. 10 లక్షల వరకు ఆర్థిక రక్షణను అందిస్తామని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తామని విజయరమణ రావు గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్,పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ డా.రమాకాంత్, పెద్దపల్లి తహశీల్దార్ రాజ్ కుమార్, పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రాంమూర్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, డాక్టర్లు, ఎఎన్ఎంలు, ఆషావర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని పూసాల గ్రామం లో తీగల నరసయ్య తీగల రాజేశం అనే తండ్రి కొడుకుకులు నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళు పండించిన పంటను విక్రయించేందుకు పూసాలలోని ఐకెపి సెంటర్ కి తీసుకెళ్లారు. అనంతరం పూసాలలోని ఐకెపి సెంటర్లో ధాన్యం విక్రయిస్తుండగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీగల నరసయ్య కొడుకు ఆవేశానికి లోనై య్యాడు. క్షణికా వేశంలో విచక్షణ కోల్పోయిన కొడుకు కన్న తండ్రిని పక్కనే ఉన్న బండరాయితో తల పైన బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన తీగల నరసయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా తీగల నరసయ్య మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించి హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.
పేదల దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కొలువైయున్న వేములవాడ క్షేత్రంలో భక్తులపై వసతి గదుల భారం పెరిగింది. వసతి గదుల అద్దెను పెంచడంతోపాటు 100 రూపాయల అద్దె ఉన్న గదికి సైతం 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించడం వల్ల భక్తులపై భారం తడిసి మోపెడవుతోంది. గదుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న రాజన్న ఆలయ అధికారులు కొత్త ధరల ప్రకారం అద్దెలు వసూలు చేస్తున్నారు.. గతంలో వెయ్యి రూపాయలు దాటిన గదికి మాత్రమే జీఎస్టీ పన్ను వసూలు చేయగా, తాజాగా వంద రూపాయల గదికి కూడా 12 రూపాయల జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అద్దె గదుల ధరలను స్వల్పంగానే పెంచినప్పటికీ ప్రతి గదికి జీఎస్టీ పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంతో భక్తులపై భారం అధికమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భీమేశ్వర అతిథి గృహం, నందీశ్వర కాంప్లెక్స్ లోని ఏసి సూట్ గదులకు 2200 రూపాయల అద్దె ఉండగా దానిని 2500 పెంచారు. 300 రూపాయల జీఎస్టీతో కలిపి వీటి అద్దె 2800 వందలకు చేరింది. అమ్మవారి అతిథి గృహంలో వెయ్యి రూపాయల అద్దె ఉండగా దానిని 1500 రూపాయలకు పెంచారు. జీఎస్టీతో కలిపి భక్తులు 1680 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నందీశ్వర కాంప్లెక్స్ లో నాన్ ఏసీ గది 350 రూపాయలు ఉండగా దానిని 150 రూపాయలు పెంచి 500 రూపాయలు చేశారు. దీంతో జీఎస్టీ కలిపి 560 చెల్లించాల్సి ఉంటుంది. పార్వతీపురం బ్లాకులలో 500 రూపాయల అద్దె ఉండగా 600 కు పెంచారు. జీఎస్టీతో కలిపి 672 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పార్వతిపురంలో సాధారణ 200 రూపాయలు ఉండగా వంద రూపాయలు పెంచి 300 రూపాయలు చేయగా జీఎస్టీతో కలిపి 336 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో 250 రూపాయలు ఉండగా 150 రూపాయలు పెంచి 400 రూపాయలు చేశారు. జీఎస్టీతో కలిపి 448 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. శంకరపురం ధర్మశాలలో 50 రూపాయలు ఉండగా దానిని వంద రూపాయలు చేశారు. జీఎస్టీతో కలిపి 112 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భీమేశ్వర సదన్ లోని గదుల అద్దెలను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.
నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు. అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు అని, ఎందరికో ఆదర్శవంతుడు అంబేద్కర్ అని అన్నారు. పట్టణంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
పెద్దపల్లి జిల్లాలో ముఖ్య నేతలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ దంపతులు ఇద్దరు కూడా రాజీనామా చేయనున్నామని వెల్లడించడం సంచలనంగా మారింది. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్, ఆయన సతీమణి, మంథని మునిసిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజలు ప్రజాప్రతినిధులుగా రాజీనామా చేయనున్నట్టు ఆయన కార్యాలయ వర్గాల పేరిట ఓ ప్రకటన వెలువడింది. బుధవారం మద్యాహ్నం రాజీనామా పత్రాలను జిల్లా కలెక్టర్ కు అప్పగించనున్నామని కూడా అందులో వివరించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన పుట్ట మధూకర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఫలితాలు వెలువడినప్పటి నుండి కూడా సైలెంట్ గానే ఉన్న పుట్ట మధు అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా శ్రీధర్ బాబుకు, పుట్ట మధుకు దశాబ్దన్నర కాలంగా వైరుధ్యాలు ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగానే పొలిటికల్ ఫైట్ జరిగిందనే చెప్పాలి. అయితే తాజాగా పుట్ట మధు తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అంశంపై పెద్ద ఎత్తున డిస్కషన్ సాగుతోంది. అయితే బుధవారం రాజీనామా చేసిన తరువాత రాజీనామాకు గల కారణాలను వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.





Total views : 90125