పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇంత మంది సస్పెండ్ కాలేదు. ఉభయ సభల్లో కలిపి ఏకంగా 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు. వీరందరినీ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రత లోపానికి సంబంధించి రాజ్యసభ, లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం పార్లమెంటును కుదిపివేస్తోంది. కాగా, గతంలో రాజీవ్ గాంధీ హయాంలో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ రికార్డును తిరగరాస్తూ మోదీ హయాంలో ఏకంగా 92 మంది ఓకేసారి సస్పెండ్ అయ్యారు. సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు. లోక్‌సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీల సస్పెండ్ అయ్యారు. గత గురువారం 13 మంది లోక్‌సభ నుంచి, రాజ్యసభ నుంచి ఒక ఎంపీ సస్పెండ్ అయ్యారు. కాగా, సస్పెన్షన్ నేపథ్యంలో ఉభయసభలు నేటికి వాయిదా పడ్డాయి.
National News
ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని వచ్చిన పక్కా సమాచారంతో నాలుగు రాష్ట్రాల్లోని 19 చోట్ల సోదాలు జరిపారు. ఈ సందర్భంగా 8 మంది సానుభూతి పరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మహారాష్ట్రలోని 40 చోట్ల అధికారులు సోదాలు చేసారు. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, నగదు, పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో బెల్లారి మాడ్యూల్ ఉగ్రవాద సంస్థ నేత మినాజ్ ఉన్నారు.
Read Also..
Read Also..
భారత్ లో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా జేఎన్1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉంటే ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయాలని పేర్కొంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసింది. భారత్ లో ప్రస్తుతం ఎక్స్ బీబీ వేరియంట్ తో పాటు జేఎన్1 సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 335 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది.
దేశవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోమవారం సోదాలు చేస్తున్నారు. ఇస్లామిక్ టెర్రర్ గ్రూపు ఐసిస్ నెట్ వర్క్ ఛేదించే క్రమంలో ఈ దాడులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తుండగా.. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మహారాష్ట్రలోని 40 చోట్ల అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, నగదు, పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు పనిచేస్తున్న 15 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఒకరు ఐసిస్ సానుభూతి పరుడని, యువతను ఐసిస్ లో చేరుస్తున్నాడని గుర్తించారు. నిందితుడిని మరింత లోతుగా విచారించి సేకరించిన సమాచారంతో అధికారులు తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కుండపోత వర్షంతో తమిళనాడు అతలాకుతలం అయింది. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన వర్షం ఈ తెల్లవారుజాము వరకు అలుపన్నదే లేకుండా కురిసింది. ఫలితంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తేన్‌కాశి జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం కొమొరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలపై తుపాను ప్రసరణ ఉందని, ఇది మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయుల వరకు విస్తరించి ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కుండపోత వర్షం కారణంగా పైన పేర్కొన్న నాలుగు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రైల్వే ట్రాకులపైకి నీళ్లు చేరడంతో పదుల కొద్దీ రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశారు. భారీ వర్షంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభావిత నాలుగు రాష్ట్రాలకు మంత్రులను పంపింది. అధికారులు ఇప్పటికే సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు.
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. ముంబై దాడుల్లో 250 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడిగా దావూద్ ఉన్నాడు. 2008లో 26/11 ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్ ముంబైలో ఉన్న తన నెట్వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్ తిరస్కరిస్తూ వస్తోంది. ముంబై పోలీసులు దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్ , సాజిద్ వాగ్లే నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నారు. అతను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఎన్ఐఏకి వివరించాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు. అతన్ని చంపితే 25 మిలియన్ డాలర్లు ఇస్తామని గతంలో భారత్ ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో చైనా తాజాగా స్పందించింది. లడఖ్ తమదేనని మరోసారి ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దుకు పశ్చిమాన ఉన్న ప్రాంతం ఎప్పటికీ చైనా భూభాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఏకపక్షంగా, చట్టవ్యతిరేకంగా భారత్ ఈ ప్రకటన చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ కోర్టు ఇచ్చిన అంతర్గత తీర్పు వాస్తవాన్ని మార్చదని చైనా రాయబారి వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును చైనా 2019లోనూ వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు ఆమోదయోగ్యం కాదని అప్పట్లోనే తేల్చి చెప్పింది.
Read Also..
Read Also..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా లొంగిపోయాడు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కర్తవ్య పథ్ మార్గం గుండా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. లలిత్‌ను అరెస్టు చేసినట్టు నిర్ధారించాయి. న్యూఢిల్లీ జిల్లా పోలీసులు అతడిని స్పెషల్ సెల్‌కు అప్పగించారు. దీంతో రెండు రోజులపాటు పరారీలో ఉన్న ఈ లలిత్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. లలిత్ చివరిసారిగా కనిపించిన ప్రాంతం నీమ్రానా నుంచి బస్సులో ప్రయాణించి రాజస్థాన్‌లోని నాగౌర్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక హోటల్లో బస చేశాడని, పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారని తెలుసుకొని తిరిగి వచ్చి లొంగిపోయానంటూ లలిత్ తెలిపాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. లలిత్ ఝా కోల్‌కతా నగరానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని తేలింది. కాగా లోక్‌సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు అరెస్టయిన విషయం తెలిసిందే. లోక్‌సభలో కలకలం సృష్టించిన సాగర్ శర్మ, మనోరంజన్‌తోపాటు పార్లమెంట్ భవనం వెలుపల నినాదాలు చేసిన నీలమ్ దేవి, అమోల్ షిండేలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ప్రశ్నించేందుకు కోర్టు వారం సమయం ఇచ్చింది. ఈ ఘటనలో తదుపరి విచారణ అవసరమని ఢిల్లీ పోలీసులు కోర్టుకు వివరించారు. కాగా నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం ఉపాతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు యువకులు. లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు టియర్ గ్యాస్ వదిలారు. లోక్‌సభలో దూకిన ఆగంతకుడిని ఎదురుగా వెళ్లి గతంలో పోలీస్‌గా పని చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్టుకున్నారు. అనంతరం ఆయన లోక్‌సభ దాడి ఘటనపై మీడియాకు వివరించారు. బెంచీలు దాటుకొని, స్పీకర్ చైర్ వైపు దూసుకొచ్చిన ఆగంతకుడు దాడి చేసే ప్రయత్నం చేశాడని, ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నానని తెలిపారు. పట్టుకున్న వెంటనే బూట్ల నుంచి టియర్ గ్యాస్ బయటకు తీశారన్నారు. సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్ల సులభంగా లోపలికి ప్రవేశించాడని, సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలన్నారు. ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే అని గోరంట్ల మాధవ్ అన్నారు. మరోవైపు పార్లమెంట లో భద్రతా వైఫల్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీస్ విభాగం నిర్ణయించింది. ఇప్పటికే లోక్ సభకు ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంది. ఈ ఘటన అఖిలపక్ష నేతలతో అత్యవసరంగా సమావేశమైన స్పీకర్ పార్లమెంట్ భవనంలో చోటు చేసుకున్న ఘటనపై చర్చించారు.
లోక్‌సభ లో కొందరు దుండగులు చొరబడి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా.. మరోవ్యక్తి ఒకరకమైన పొగను వదలడం కలవరం సృష్టించింది. ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. వీరందర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లోక్‌సభ లోపల పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవ్‌రాజ్‌లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మైసూర్‌కు చెందినవారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పార్లమెంటు బయట నిరసన చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. రంగుల పొగను వెదజల్లుతూ ఆందోళనకు దిగిన వీరిద్దరినీ ట్రాన్స్‌పోర్టు భవనం ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మహిళ హరియాణాలోని హిసార్‌కు చెందిన నీలం కాగా, మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్కు చెందిన అమోల్ శిందే గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పార్లమెంటు లోపల, వెలుపల జరిగిన ఈ ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. లోపలికి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఓ ఎంపీ సిఫార్సుతోనే లోనికి చేరినట్లు తెలుస్తోంది. అయితే, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ వాయువును వెదజల్లే గొట్టాలను లోనికి ఎలా తీసుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని పలువురు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.