పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే కొత్త రేట్లను వసూలు చేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా 55 పాకిస్థానీ రూపాయలు పెంచింది. ప్రకటన వెలువడిన వెంటనే వ్యాపారులు నూడుల్స్, టూత్‌పేస్ట్, బిస్కెట్లు, స్థానికంగా తయారైన చాక్లెట్లు వంటి రోజువారీ వస్తువుల ధరలను పెంచేశారు. చిన్న వస్తువులు కొనడానికి దుకాణానికి వెళితే, ప్రతీ వస్తువుపై 10 రూపాయలు పెంచారని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. ఈ ఆరోపణలపై వ్యాపారులు స్పందిస్తూ.. రవాణా, పంపిణీ ఖర్చులు పెరగడం వల్లే ధరలను సర్దుబాటు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ధరలు తగ్గినప్పుడు తాము నష్టపోతాం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలని ఆబ్పారా మార్కెట్లోని ఓ దుకాణదారుడు గులాం ఉల్లా తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు. హోల్‌సేల్ డీలర్లు, రవాణాదారులు ధరలు పెంచడంతో పప్పుధాన్యాల ధర కిలోకు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగిందని రావల్పిండి అసోసియేషన్ ఛైర్మన్ సలీం పర్వేజ్ బట్ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయని…బిజినెస్ రికార్డర్ నివేదిక తెలిపింది. దీని ప్రభావంతో ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పాకిస్థాన్‌పై తీవ్ర భారం పడుతోందని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజలపై మోపింది. ప్రస్తుతం లీటర్‌పై పెంచిన 55 రూపాయలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. కూరగాయల సరఫరా సరిపడా ఉన్నప్పటికీ, టమాటా, మిర్చి వంటి వాటి ధరలు కూడా మార్కెట్లలో విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి హోల్‌సేల్ మార్కెట్, కమిషన్ ఏజెంట్లే కారణమని చిల్లర వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
#RATE
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో.. చమురు నిల్వలపై ఆందోళన మరింత పెరిగింది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోతే ధరలు పెరుగుతాయన్న ఊహాగానాల వేళ.. ధరల పెంపుపై కేంద్రప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. చమురు, గ్యాస్ నిల్వలపై కీలక ప్రకటన చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో చమురు నిల్వలు 25 రోజులకు సరిపడా ఉన్నాయని, చమురు దిగుమతి కోసం ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని కేంద్రవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా LNG, ఎల్ పీజీ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు వెల్లడించాయి.
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో వేలాది చమురు షిప్పులు సముద్రంలోనే నిలిచిపోయాయి. జలసంధి సమీపంలో వేలాది చమురు నౌకలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి. ఇవన్నీ ఎగుమతి కావాలంటే యుద్ధం ఆగాలి. అందుకు కనీసం 40 రోజులు సమయం పడుతుందని అంచనా. అక్కడి నుంచి చమురు రాకపోతే మనదగ్గరి నిల్వలు అయిపోతే ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో మనవద్ద పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. హైదరాబాద్ లో వాహనదారులు వాహనాల్లోనే కాక.. బాటిల్స్ లోనూ పెట్రోల్ ఫిల్ చేయించుకుంటున్న దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.




Total views : 78930