సిద్ధిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు రమేష్‌ను అభినందించారు. బీఆర్ఎస్ పాలనలో సిద్ధిపేట సమగ్ర అభివృద్ధి సాధించిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మంచినీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్‌తో ఆదర్శ పట్టణంగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పెన్షన్ హామీ అమలు కాలేదని ఆరోపించారు. వెటర్నరీ కళాశాల తరలింపు, అభివృద్ధి పనుల అడ్డంకులను ప్రస్తావించారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొంటూ, 29వ వార్డులో రూ.1 కోటి అభివృద్ధి పనులు చేపడతామని హరీష్ రావు ప్రకటించారు.
Telangana
నిన్నటి వరకు అది ఓ కాలుష్య కాసారం. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధంతో.. నోరు తెరిస్తే చాలు దూరిపోయే దోమలతో అత్యంత దారుణమైన స్థితిలో ఉండేది. కానీ స్థానిక నాయకుల ప్రోద్బలంతో ఆ జలవనరు కొత్త రూపం సంతరించుకుంటోంది. కళ్లు చెదిరే హంగులతో అత్యంత సుందరమైన సరోవరంగా మారనుంది. ఇంతకీ ఆ చెరువు ఎక్కడుందో తెలుసా. హైదరాబాద్ నాచారం HMT నగర్లో.
నాచారంలోని పెద్ద చెరువు అంటే అందరికీ గుర్తొచ్చేది భయంకరమైన దుర్వాసన, ప్రాణాంతకమైన దోమల బెడదనే. గత నాలుగైదేళ్ల నుంచి అయితే ఆ చుట్టుపక్కల కాలనీల్లో ప్రజలు నివసించలేని దుస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల కాలనీల చెత్తా చెదారం, వ్యర్థాలు, పరిశ్రమల రసాయనాలు అన్నీ ఇందులోకే చేరడంతో ఈ చెరువు మురికి కూపంగా మారింది. విపరీతంగా గుర్రపుడెక్క పేరుకుపోయి దోమలకు ఆవాసకేంద్రంగా మారింది. దీనిపై అనేకసార్లు స్థానికులు ఆందోళన చేపట్టారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఈ చెరువు సుందరీకరణకు నడుము బిగించింది. HMT నగర్ పెద్ద చెరువు దగ్గర 37 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మిగతా చెరువుల సుందరీకరణ కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందే తడవుగా.. అధికారులు చురుగ్గా పనులు ప్రారంభించారు. చెరువులోని మురుగునీటిని బయటకు పంపి గుర్రపు డెక్కను తొలగించే పని చేపట్టారు. అలాగే పేరుకుపోయిన అవశేషాలను, బురదను తోడేస్తున్నారు. చెరువు కట్టకు కూడా మరమ్మతులు చేపట్టి… మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే దిశగా పనులు చేపట్టారు. ఇన్నేళ్లు మురికి కూపంగా ఉన్న HMT చెరువు రూపురేఖలు క్రమంగా మారిపోతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధితో పనులు చేపట్టిన ప్రభుత్వాన్ని, నాయకులను అభినందిస్తున్నారు.
చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు, బతుకమ్మ వేడుకల కోసం ఓ ఘాట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటి పెద్ద చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
ఇంతకాలం సమస్యల వలయంగా నిలిచిన HMT నగర్ పెద్ద చెరువు అతి కొద్ది కాలంలోనే సుందరమైన తటాకంగా మారనుండడం… స్థానికుల్లో ఆనందాన్ని నింపుతోంది. అన్నీ కుదిరితే.. వచ్చే బతుకమ్మ వేడుకను ఈ చెరువులోనే సంతోషంగా జరుపుకునేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మెహఫిల్ హోటల్ సమీపంలో బాలెనో కారును అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు , 7 సజీవ బుల్లెట్లు, ఒక బాలెనో కారు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అరెస్టైన వారిలో హైదరాబాద్ చార్మినార్ కిల్వత్ ప్రాంతానికి చెందిన కార్ డీలర్ ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన లారీ డ్రైవర్ అమీర్ ఖాన్ ఉన్నారు. షా బాబాపై కర్ణాటకలో డాకోయిటీ, మహారాష్ట్రలో వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులు నమోదై ఉండగా, అమీర్ ఖాన్‌పై హత్య కేసుతో పాటు పలు నేర కేసులు ఉన్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో పెద్ద నేరానికి కుట్ర పన్నుతున్న సమయంలో వీరిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తుపాకులతో బెదిరించి దారిదోపిడీలకు పాల్పడటం వీరి ప్రధాన నేర కార్యకలాపంగా గుర్తించారు.
తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప ఊరట దక్కింది. విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9లోని కొన్ని మార్గదర్శకాలపై స్టే విధించింది. వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యoతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. మీరు బకాయిలు చెల్లించరు, విద్యార్ధుల నుంచి కళాశాలలను ఫీజులు వసూలు చేయవద్దంటే వారు ఎలా నడుపుతారని కోర్టు ప్రశ్నించింది. అలానే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని అడిగింది. బడ్జెట్ సెషన్ కూడా అయిపోయినట్టు ఉందని, ఇంకా బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రభుత్వాని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పెండింగ్ బకాయిలు ఎప్పటి లోగా చెల్లిస్తారో తెలపాలని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు15 లోపు బకాయిలు అన్ని క్లియర్ అవుతాయన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.
ఆగస్టు 15 లోపు బకాయిలు క్లియర్ అయితే ఆరోజే తమ పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి. మరోవైపు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వానికి, కాలేజ్ యాజమాన్యాలకు మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ బకాయిల ద్వారా 2,3,4 ఇయర్ స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని వారి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది.
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో 42 కోట్లతో ఏర్పాటు చేయనున్న ATC కి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని 65 ఐటీఐలు నిధులు లేక నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఏటీసీలను అభివృద్ధి చేస్తోందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ లభించి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. .2 వేల 200 కోట్ల నిధులతో టాటా వారి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గత పాలకులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి కీలక అంశాలను విస్మరించారని ఆరోపించారు. యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ పేర్కొన్నారు.
సర్ పేరుతో బిజెపి పార్టీ ఓట్ల రాజకీయానికి తెరలేపిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. తన నామినేషన్ తిరస్కరణకు కూడా కారణం ఇదేనని ఆమె తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 30 లక్షల ఓట్లను తొలగించిందని, మమతా బెనర్జీ ఓటమికి కారణం బీజేపీ యేనని, 2028 లో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి పక్క ప్లాన్ తో సర్ ను అడ్డం పెట్టుకొంటుందని మీనాక్షి నటరాజన్ విమర్శించారు.
2002లో బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎస్ ఐ ఆర్ ఉపయోగించారని అన్నారు. దానివల్ల ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇది మన అందరి ఈ దేశం మన అందరిదీ ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకునేలా చేయాలని సూచించారు.
SIR లో మనం యాక్టివ్ గా పాల్గొనాలని, ఎన్నిసార్లు ఓట్లు వేసినా తిరిగి నమోదు చేసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కీలకమైన ధృవీకరణ పత్రాలు సిద్దం చేసుకుని సమర్పించకుంటే ఓట్లు గల్లంతు అవుతాయని, ప్రతి ఓటరు తన ఓటును కాపాడుకునేలా బిఎల్ఎ లు సహకరించాలని పిలుపునిచ్చారు. ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నెల రోజుల పాటు బిఎల్ఎ లకు సహకరించాలని దామోదర రాజనర్సింహ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఎస్ కే. రామకృష్ణారావు పదవీ కాలం 2026 జూన్ 30తో ముగియనుండటంతో, కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును తిరిగి మాతృ కేడర్‌కు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ ఆయనను వెంటనే పేరెంట్ కేడర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు సంజయ్ జాజు. సంజయ్ 1992 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా, విశాఖపట్నం కమిషనర్‌గా సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగి ఉన్నారు. ఆయన 2029 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలనాపరమైన అంశాలు, తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్ వంటి ఇతర సీనియర్ల పేర్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సంజయ్ జాజు వైపే మొగ్గు చూపింది
తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన రెండ్రోజుల ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి సానుకూల సంకేతాలు తెచ్చింది. కేంద్రంతో సమన్వయం, రాష్ట్ర ప్రయోజనాల సాధన, కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం పొందడంలో ఈ పర్యటన కీలకంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, కేంద్ర నిధుల సమీకరణ, కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఆసక్తికరంగా, రాజకీయ విభేదాలకు అతీతంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా సమన్వయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన పర్యటనలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ అంశం కీలక చర్చగా మారింది. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమైన సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.ఈ సమావేశంలో మెట్రో ఫేజ్-1 ఆస్తుల మూల్యాంకనం, ప్రభుత్వ స్వాధీనం ప్రక్రియ, ఫేజ్-2 విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ SBI క్యాప్స్‌ను కన్సల్టెంట్‌గా నియమిస్తూ మెట్రో భవిష్యత్ కార్యాచరణకు మార్గం సుగమం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ప్రత్యేక సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
మెట్రో ప్రాజెక్ట్ భవిష్యత్ దిశను నిర్ణయించే బాధ్యత ఇప్పుడు SBI క్యాప్స్ నివేదికపై ఆధారపడనుంది. మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ ఎంత? ప్రభుత్వ టేకోవర్ ప్రక్రియ ఎలా ఉండాలి? రెండో దశ విస్తరణకు భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీతో రుణాలు ఎలా పొందాలి? అనే అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది.ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం తదుపరి ఆర్థిక సహకారం, అనుమతులపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో ఫేజ్-2లో దాదాపు 70 కిలోమీటర్లకు పైగా కొత్త మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. దీంతో నగర రవాణా వ్యవస్థ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే… సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమన్వయం, కేంద్ర ప్రభుత్వ సానుకూల వైఖరి కలిసి తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతం లభించనుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆశలు పెరిగాయి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అజెండాతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే తెలంగాణ ప్రగతికి మరింత బలం చేకూరనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోందని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌ను తలపెట్టినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు పూర్తిగా సహకరించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను కలిగి ఉండి కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో దాదాపు 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, పేద విద్యార్థులకు చదువును దూరం చేసే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉచితంగా 25 శాతం సీట్లు కేటాయించాలనే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని రాంబాబు విమర్శించారు. విచ్చలవిడి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందని, వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకే పర్మిషన్తో పలు బ్రాంచ్‌లు నడుపుతూ సరస్వతి నిలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని, ప్రైవేట్ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి హెచ్చరించారు.
రాష్ట్రాన్ని ఒకప్పుడు వణికించిన ఉగ్రవాదం, మావోయిజం పూర్తిగా తగ్గిపోయాయని, కానీ ఇప్పుడు అంతకంటే భయంకరమైన డ్రగ్స్ మహమ్మారి ప్రతి ఇంట్లోకి చొరబడుతోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పోలీసుల ప్రధాన పోరాటం డ్రగ్స్ రక్కసిపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల కట్టడికి ఇకపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే స్కూళ్లు, కాలేజీల రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సోమవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ భవనంలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ను ముఖ్య అతిథిగా హాజరై డీజీపీ ప్రారంభించారు. డ్రగ్స్ కట్టడికి విద్యార్థి దశ నుంచే పటిష్టమైన అవగాహన, నిఘా అవసరమన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను అధిగమించాం. కానీ డ్రగ్స్ అనే కొత్త విపత్తు ప్రతి గడపకూ చేరుతోంది. ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది. దీనిని అడ్డుకోవాలంటే ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా యాంటీ డ్రగ్స్ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా స్పాటర్స్ ను యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి. క్యాంపస్‌లో ఏ విద్యార్థి అయినా డ్రగ్స్ వాడినట్లు గుర్తిస్తే ఆ బాధ్యత పూర్తిగా యాజమాన్యాలదే. అలాగే ఇకపై పాఠశాలల్లో పిల్లల ప్రవర్తన, స్నేహాలపై పర్యవేక్షణ ఉంచుతామని తల్లిదండ్రులు కచ్చితంగా ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు.
విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఈ మత్తు పదార్థాలు దేశంలో ఒక పెద్ద నెట్‌వర్క్‌గా మారాయి. ఈ దేశద్రోహుల ముఠా పాన్ షాపుల్లో చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో పసిపిల్లలకు మత్తును అలవాటు చేస్తోంది. ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులు నిరంతరం దాడులు చేసి పెడ్లర్లను, ట్రాన్స్పోర్టర్లను పట్టుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసలైన వారి పరిస్థితి వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకుంటే నాడీ వ్యవస్థ నాశనమవుతుంది. గుండె సాధారణం కంటే ఎక్కువ పనిచేయాల్సి వచ్చి తీవ్ర ఒత్తిడికి గురై చిన్న వయసులోనే చనిపోతారు. 3 వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఓ ఫార్మా కంపెనీ అధినేత ఇంట్లో ఇద్దరు పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని, తల్లిదండ్రులు పిల్లలతో కనీస సమయం గడపకపోవడం, వారు ఏం చేస్తున్నారో కనుక్కోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయపి డీజీపీ ఉదాహరణగా వివరించారు. ఎవరి కోసం కాకపోయినా పిల్లల భవిష్యత్తు కోసమైనా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హోంగార్డు స్థాయి నుంచి డీజీపీ వరకు పోలీస్ శాఖ అంతా ఈ పోరాటంలో నిమగ్నమై ఉందని ఆయన స్పష్టం చేశారు.
డ్రగ్స్ నివారణపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు జూన్ 26 వరకు ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కొనసాగుతుందని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ షీ టీమ్స్, భరోసా, టాస్క్,ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డి అడిక్షన్ సెంటర్, హైదరాబాద్ సిటీ పోలీస్ వెపన్స్ అండ్ డాగ్ స్క్వాడ్ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న సేవలు, పునరావాస కేంద్రాల పనితీరును ఈ స్టాళ్ల ద్వారా విద్యార్థులకు వివరించారు.





Total views : 196909