ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు ముందే.. జిల్లా కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రాజకీయం సెగలు రేపుతోంది. సీఎం సభ కోసం నగరమంతా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్, స్వాగత ఫ్లెక్సీలలో.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఫొటో కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జిల్లా కాంగ్రెస్‌లో చాలా కాలంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి, డీసీసీ అధ్యక్షుడికి మధ్య సమన్వయ లోపం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజా ఫ్లెక్సీల వ్యవహారం ఈ అంతర్గత విభేదాల చర్చకు మరింత ఊతమిచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా అధ్యక్షుడికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తుంటే.. దీనిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదని మరో వర్గం కొట్టిపారేస్తోంది. అయితే, నేడు జరగబోయే సీఎం బహిరంగ సభ వేదికపై డీసీసీ అధ్యక్షుడికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది? ఈ విభేదాల చర్చకు సీఎం పర్యటనతో బ్రేక్ పడుతుందా? లేదా అసమ్మతి మరింత పెరుగుతుందా? అన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Telangana
విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా, బుండిబుగ్యో వైరస్ల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు పౌరవిమానయాన శాఖ ఈ అప్రమత్తత ఉత్తర్వులను విడుదల చేసింది. భారత్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై తప్పనిసరిగా హెల్త్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను పౌర విమానయాన శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 24 గంటల ముందే ఆన్లైన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. గత 21 రోజుల్లో తాము ఏయే దేశాలు… ప్రాంతాలు సందర్శించారనే పూర్తి ప్రయాణ చరిత్రను, అలాగే ప్రస్తుత ఆరోగ్య లక్షణాలను ఈ పోర్టల్‌లో ఖచ్చితంగా పొందుపరచాలని సూచించింది. ఆన్లైన్లో పూర్తి చేసిన హెల్త్ డిక్లరేషన్ ఫారమ్‌ను విమానాశ్రయాల్లోని కౌంటర్ల వద్ద సిబ్బందికి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. వైరస్ దేశంలోకి వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయాణికులందరూ ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలకు సహకరించాలని కేంద్రం కోరింది.
హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన ఫలకాన్ని పోస్ట్ చేశారు. తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవాన్ని అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని తానేనని వెల్లడించారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23న హైదరాబాద్‌లో విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆవిష్కరించారు. కీలక అమెరికా టెక్ కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్లు ఈ రోడ్డుకు దగ్గరలోనే ఉన్నాయి. తెలంగాణ, అమెరికా మధ్య వాణిజ్య, వ్యాపార, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయల మోసానికి పాల్పడిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్యాభాయ్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సోషల్ మీడియాలో భారీగా బంగారు ఆభరణాలు ధరిస్తూ ‘గోల్డ్ మ్యాన్’ గా గుర్తింపు పొందిన సూర్యభాయ్, తనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాధితులను నమ్మించాడు. మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకే విదేశాల నుండి దిగుమతి చేసుకున్న స్వచ్ఛమైన బంగారాన్ని ఇప్పిస్తానని ప్రచారం చేశాడు. దీనిని నమ్మిన హయత్ నగర్‌కు చెందిన కృష్ణచారి అనే గోల్డ్‌స్మిత్, హిమాయత్‌నగర్‌లోని ఒక హోటల్లో సూర్యభాయ్‌ను కలిసి విడతల వారీగా దాదాపు 30 లక్షల నగదును అప్పగించారు. ఎప్పటికీ బంగారం ఇవ్వక పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట అరెస్ట్ భయంతో సూర్యభాయ్ హైదరాబాద్ నగరం విడిచి షాద్‌నగర్ వైపు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అతడిని చాకచక్యంగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచారు. నిందితునికి న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో, అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన వారికి నగరంలో ఓటరు కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆరోపించారు. రామ్‌కోఠిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించిన అనంతరం చిన్నారులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన కిషన్‌రెడ్డి, ఖైరతాబాద్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. పాతబస్తీలో బీఎల్వోలను మజ్లిస్ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ యాంటీ-డ్రగ్స్ డే సందర్భంగా రాష్ట్ర యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. యువతలో సానుకూల ఆలోచనలు, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా మాత్రమే మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించగలమని స్పష్టం చేశారు. డ్రగ్స్ సంస్కృతి వల్ల సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా.. అది శాంతిభద్రతల సమస్యలకు కూడా దారితీస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్య సాధనలో యువత, తల్లిదండ్రులు, పౌర సమాజం భాగస్వాములై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, సరఫరాను సమూలంగా రూపుమాపేందుకు ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని భట్టి వెల్లడించారు. ప్రతి తల్లి-తండ్రి తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నట్లే.. ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. డ్రగ్స్ వాడుతూ, సరఫరా చేస్తూ దొరికినవారెవరైనా సరే.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.
సిద్ధిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు రమేష్‌ను అభినందించారు. బీఆర్ఎస్ పాలనలో సిద్ధిపేట సమగ్ర అభివృద్ధి సాధించిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మంచినీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్‌తో ఆదర్శ పట్టణంగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పెన్షన్ హామీ అమలు కాలేదని ఆరోపించారు. వెటర్నరీ కళాశాల తరలింపు, అభివృద్ధి పనుల అడ్డంకులను ప్రస్తావించారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొంటూ, 29వ వార్డులో రూ.1 కోటి అభివృద్ధి పనులు చేపడతామని హరీష్ రావు ప్రకటించారు.
నిన్నటి వరకు అది ఓ కాలుష్య కాసారం. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధంతో.. నోరు తెరిస్తే చాలు దూరిపోయే దోమలతో అత్యంత దారుణమైన స్థితిలో ఉండేది. కానీ స్థానిక నాయకుల ప్రోద్బలంతో ఆ జలవనరు కొత్త రూపం సంతరించుకుంటోంది. కళ్లు చెదిరే హంగులతో అత్యంత సుందరమైన సరోవరంగా మారనుంది. ఇంతకీ ఆ చెరువు ఎక్కడుందో తెలుసా. హైదరాబాద్ నాచారం HMT నగర్లో.
నాచారంలోని పెద్ద చెరువు అంటే అందరికీ గుర్తొచ్చేది భయంకరమైన దుర్వాసన, ప్రాణాంతకమైన దోమల బెడదనే. గత నాలుగైదేళ్ల నుంచి అయితే ఆ చుట్టుపక్కల కాలనీల్లో ప్రజలు నివసించలేని దుస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల కాలనీల చెత్తా చెదారం, వ్యర్థాలు, పరిశ్రమల రసాయనాలు అన్నీ ఇందులోకే చేరడంతో ఈ చెరువు మురికి కూపంగా మారింది. విపరీతంగా గుర్రపుడెక్క పేరుకుపోయి దోమలకు ఆవాసకేంద్రంగా మారింది. దీనిపై అనేకసార్లు స్థానికులు ఆందోళన చేపట్టారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఈ చెరువు సుందరీకరణకు నడుము బిగించింది. HMT నగర్ పెద్ద చెరువు దగ్గర 37 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మిగతా చెరువుల సుందరీకరణ కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందే తడవుగా.. అధికారులు చురుగ్గా పనులు ప్రారంభించారు. చెరువులోని మురుగునీటిని బయటకు పంపి గుర్రపు డెక్కను తొలగించే పని చేపట్టారు. అలాగే పేరుకుపోయిన అవశేషాలను, బురదను తోడేస్తున్నారు. చెరువు కట్టకు కూడా మరమ్మతులు చేపట్టి… మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే దిశగా పనులు చేపట్టారు. ఇన్నేళ్లు మురికి కూపంగా ఉన్న HMT చెరువు రూపురేఖలు క్రమంగా మారిపోతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధితో పనులు చేపట్టిన ప్రభుత్వాన్ని, నాయకులను అభినందిస్తున్నారు.
చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు, బతుకమ్మ వేడుకల కోసం ఓ ఘాట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటి పెద్ద చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
ఇంతకాలం సమస్యల వలయంగా నిలిచిన HMT నగర్ పెద్ద చెరువు అతి కొద్ది కాలంలోనే సుందరమైన తటాకంగా మారనుండడం… స్థానికుల్లో ఆనందాన్ని నింపుతోంది. అన్నీ కుదిరితే.. వచ్చే బతుకమ్మ వేడుకను ఈ చెరువులోనే సంతోషంగా జరుపుకునేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మెహఫిల్ హోటల్ సమీపంలో బాలెనో కారును అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు , 7 సజీవ బుల్లెట్లు, ఒక బాలెనో కారు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అరెస్టైన వారిలో హైదరాబాద్ చార్మినార్ కిల్వత్ ప్రాంతానికి చెందిన కార్ డీలర్ ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన లారీ డ్రైవర్ అమీర్ ఖాన్ ఉన్నారు. షా బాబాపై కర్ణాటకలో డాకోయిటీ, మహారాష్ట్రలో వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులు నమోదై ఉండగా, అమీర్ ఖాన్‌పై హత్య కేసుతో పాటు పలు నేర కేసులు ఉన్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో పెద్ద నేరానికి కుట్ర పన్నుతున్న సమయంలో వీరిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తుపాకులతో బెదిరించి దారిదోపిడీలకు పాల్పడటం వీరి ప్రధాన నేర కార్యకలాపంగా గుర్తించారు.
తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప ఊరట దక్కింది. విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9లోని కొన్ని మార్గదర్శకాలపై స్టే విధించింది. వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యoతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. మీరు బకాయిలు చెల్లించరు, విద్యార్ధుల నుంచి కళాశాలలను ఫీజులు వసూలు చేయవద్దంటే వారు ఎలా నడుపుతారని కోర్టు ప్రశ్నించింది. అలానే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని అడిగింది. బడ్జెట్ సెషన్ కూడా అయిపోయినట్టు ఉందని, ఇంకా బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రభుత్వాని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పెండింగ్ బకాయిలు ఎప్పటి లోగా చెల్లిస్తారో తెలపాలని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు15 లోపు బకాయిలు అన్ని క్లియర్ అవుతాయన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.
ఆగస్టు 15 లోపు బకాయిలు క్లియర్ అయితే ఆరోజే తమ పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి. మరోవైపు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వానికి, కాలేజ్ యాజమాన్యాలకు మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ బకాయిల ద్వారా 2,3,4 ఇయర్ స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని వారి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది.





Total views : 196563