తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయల మోసానికి పాల్పడిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్యాభాయ్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సోషల్ మీడియాలో భారీగా బంగారు ఆభరణాలు ధరిస్తూ ‘గోల్డ్ మ్యాన్’ గా గుర్తింపు పొందిన సూర్యభాయ్, తనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాధితులను నమ్మించాడు. మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకే విదేశాల నుండి దిగుమతి చేసుకున్న స్వచ్ఛమైన బంగారాన్ని ఇప్పిస్తానని ప్రచారం చేశాడు. దీనిని నమ్మిన హయత్ నగర్‌కు చెందిన కృష్ణచారి అనే గోల్డ్‌స్మిత్, హిమాయత్‌నగర్‌లోని ఒక హోటల్‌లో సూర్యభాయ్‌ను కలిసి విడతల వారీగా దాదాపు 30 లక్షల నగదును అప్పగించారు. ఎప్పటికీ బంగారం ఇవ్వక పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట అరెస్ట్ భయంతో సూర్యభాయ్ హైదరాబాద్ నగరం విడిచి షాద్‌నగర్ వైపు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అతడిని చాకచక్యంగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచారు. నిందితునికి న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో, అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.





Total views : 180223