తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన రెండ్రోజుల ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి సానుకూల సంకేతాలు తెచ్చింది. కేంద్రంతో సమన్వయం, రాష్ట్ర ప్రయోజనాల సాధన, కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం పొందడంలో ఈ పర్యటన కీలకంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, కేంద్ర నిధుల సమీకరణ, కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఆసక్తికరంగా, రాజకీయ విభేదాలకు అతీతంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా సమన్వయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన పర్యటనలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ అంశం కీలక చర్చగా మారింది. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమైన సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.ఈ సమావేశంలో మెట్రో ఫేజ్-1 ఆస్తుల మూల్యాంకనం, ప్రభుత్వ స్వాధీనం ప్రక్రియ, ఫేజ్-2 విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ SBI క్యాప్స్‌ను కన్సల్టెంట్‌గా నియమిస్తూ మెట్రో భవిష్యత్ కార్యాచరణకు మార్గం సుగమం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ప్రత్యేక సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
మెట్రో ప్రాజెక్ట్ భవిష్యత్ దిశను నిర్ణయించే బాధ్యత ఇప్పుడు SBI క్యాప్స్ నివేదికపై ఆధారపడనుంది. మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ ఎంత? ప్రభుత్వ టేకోవర్ ప్రక్రియ ఎలా ఉండాలి? రెండో దశ విస్తరణకు భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీతో రుణాలు ఎలా పొందాలి? అనే అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది.ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం తదుపరి ఆర్థిక సహకారం, అనుమతులపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో ఫేజ్-2లో దాదాపు 70 కిలోమీటర్లకు పైగా కొత్త మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. దీంతో నగర రవాణా వ్యవస్థ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే… సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమన్వయం, కేంద్ర ప్రభుత్వ సానుకూల వైఖరి కలిసి తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతం లభించనుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆశలు పెరిగాయి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అజెండాతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే తెలంగాణ ప్రగతికి మరింత బలం చేకూరనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.