Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Telangana మావోయిజాన్ని పారదోలాం.. ఇక డ్రగ్స్ వంతు.

మావోయిజాన్ని పారదోలాం.. ఇక డ్రగ్స్ వంతు.

by CVR NEWS
మావోయిజాన్ని పారదోలాం.. ఇక డ్రగ్స్ వంతు -డీజీపీ సీవీ అనంద్

రాష్ట్రాన్ని ఒకప్పుడు వణికించిన ఉగ్రవాదం, మావోయిజం పూర్తిగా తగ్గిపోయాయని, కానీ ఇప్పుడు అంతకంటే భయంకరమైన డ్రగ్స్ మహమ్మారి ప్రతి ఇంట్లోకి చొరబడుతోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పోలీసుల ప్రధాన పోరాటం డ్రగ్స్ రక్కసిపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల కట్టడికి ఇకపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే స్కూళ్లు, కాలేజీల రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సోమవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ భవనంలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ ను ముఖ్య అతిథిగా హాజరై డీజీపీ ప్రారంభించారు. డ్రగ్స్ కట్టడికి విద్యార్థి దశ నుంచే పటిష్టమైన అవగాహన, నిఘా అవసరమన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను అధిగమించాం. కానీ డ్రగ్స్ అనే కొత్త విపత్తు ప్రతి గడపకూ చేరుతోంది. ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది. దీనిని అడ్డుకోవాలంటే ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా యాంటీ డ్రగ్స్ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా స్పాటర్స్ ను యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి. క్యాంపస్‌లో ఏ విద్యార్థి అయినా డ్రగ్స్ వాడినట్లు గుర్తిస్తే ఆ బాధ్యత పూర్తిగా యాజమాన్యాలదే. అలాగే ఇకపై పాఠశాలల్లో పిల్లల ప్రవర్తన, స్నేహాలపై పర్యవేక్షణ ఉంచుతామని తల్లిదండ్రులు కచ్చితంగా ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు.

విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఈ మత్తు పదార్థాలు దేశంలో ఒక పెద్ద నెట్‌వర్క్‌గా మారాయి. ఈ దేశద్రోహుల ముఠా పాన్ షాపుల్లో చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో పసిపిల్లలకు మత్తును అలవాటు చేస్తోంది. ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులు నిరంతరం దాడులు చేసి పెడ్లర్లను, ట్రాన్స్‌పోర్టర్లను పట్టుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసలైన వారి పరిస్థితి వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకుంటే నాడీ వ్యవస్థ నాశనమవుతుంది. గుండె సాధారణం కంటే ఎక్కువ పనిచేయాల్సి వచ్చి తీవ్ర ఒత్తిడికి గురై చిన్న వయసులోనే చనిపోతారు. 3 వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఓ ఫార్మా కంపెనీ అధినేత ఇంట్లో ఇద్దరు పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని, తల్లిదండ్రులు పిల్లలతో కనీస సమయం గడపకపోవడం, వారు ఏం చేస్తున్నారో కనుక్కోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయపి డీజీపీ ఉదాహరణగా వివరించారు. ఎవరి కోసం కాకపోయినా పిల్లల భవిష్యత్తు కోసమైనా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హోంగార్డు స్థాయి నుంచి డీజీపీ వరకు పోలీస్ శాఖ అంతా ఈ పోరాటంలో నిమగ్నమై ఉందని ఆయన స్పష్టం చేశారు.

డ్రగ్స్ నివారణపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు జూన్ 26 వరకు ఈ యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ కొనసాగుతుందని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ షీ టీమ్స్, భరోసా, టాస్క్,ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డి అడిక్షన్ సెంటర్, హైదరాబాద్ సిటీ పోలీస్ వెపన్స్ అండ్ డాగ్ స్క్వాడ్ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న సేవలు, పునరావాస కేంద్రాల పనితీరును ఈ స్టాళ్ల ద్వారా విద్యార్థులకు వివరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: