తెలంగాణను దేశానికి భవిష్యత్ ఆర్థిక శక్తిగా మారుస్తామని , క్యూర్, ప్యూర్, రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు . తెలంగాణ సమ్మిట్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించామని పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని డిప్యూటీ సీఎం , ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు .గతం కన్నా ఏ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించారు ? లక్ష్యం నెరవేరుతుందా ?
3 లక్షల 24 వేల 234 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రి , ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క .మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని చెబుతూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందించడమే లక్ష్యమన్నారు . తెలంగాణను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామన్నారు .ఈసారి కూడా సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది . రైతు సంక్షేమం కోసం – రూ.23,179కోట్లు , సివిల్ సప్లయ్ శాఖకు రూ.7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు కేటాయించారు .దీనిలో ఎక్కువ భాగం వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ పధకానికి పోతుంది . అదే క్రమంలో విద్యా శాఖకు రూ.26,674 కోట్లు,వైద్య రంగానికి – రూ.13,679కోట్లు కార్మికుల సంక్షేమం కోసం రూ.999 కోట్లు , మహిళా శిశు సంక్షేమం – రూ.3,143 కోట్లు ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు , ఎస్టీ సంక్షేమం కోసం రూ.7,937కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించారు .
మరో వైపు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామంటున్న భట్టి గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పమని తెలిపారు . బడ్జెట్ అంటే అంకెల చుట్టూ తిరిగే సంఖ్యలు కాదని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలని భట్టి వివరించారు. దేశంలో తెలంగాణను నెం.1గా నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమన్న భట్టి సంక్షేమం, అభివృద్ధి తమకు తొలి ప్రాధాన్యం అని చెప్పారు .ఈ క్రమంలోనే శాంతి భద్రతలు కోసం రూ.11,907 కోట్లు , రాబోయే గోదావరి పుష్కరాలు కోసం రూ.500 కోట్లు పర్యాటక శాఖ కు రూ.1,224 కోట్లు , రాజీవ్ యువ వికాసం పధకానికి రూ.6వేల కోట్లు , గృహ నిర్మాణ రంగానికి రూ.7,430 కోట్లు ఐటీ రంగానికి రూ.875 కోట్లు , పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు ,చేనేత రంగానికి రూ.258 కోట్లు , పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్లు , సాగునీటి ప్రాజెక్టులు కోసం రూ.22,615 కోట్లు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ కోసం రూ.17,907కోట్లు కేటాయించారు .
మొత్తం బడ్జెట్ రూ.3,24,234 కోట్లులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు , మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ఉండడం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది . రాష్ట్రంలో కోటి 15లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవితబీమా సౌకర్యం అందించనున్నారు . జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు అవుతుందని పేర్కొన్నారు . దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్ అని తెలిపారు భట్టి . జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7శాతం ఎక్కువ అని వివరించారు . తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగింద న్నారు . 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ , 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు .మొత్తం మీద తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమానికే పెద్ద పీట వేశారని చెప్పొచ్చు .





Total views : 78524