Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News అశాంతి ప్రపంచానికి సాంస్కృతిక వారసత్వమే దారి, కోబా తీర్థ్‌లో సమ్రాట్ సంప్రతి మ్యూజియం ప్రారంభించిన మోదీ..

అశాంతి ప్రపంచానికి సాంస్కృతిక వారసత్వమే దారి, కోబా తీర్థ్‌లో సమ్రాట్ సంప్రతి మ్యూజియం ప్రారంభించిన మోదీ..

by CVR NEWS

ప్రపంచం అస్థిరత్వంతో సతమతమవుతూ, అశాంతి జ్వాలలతో దహించుకుపోతున్న క్లిష్ట సమయంలో సాంస్కృతిక వారసత్వమే మానవాళికి మార్గం చూపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో ఏర్పాటు చేసిన సమ్రాట్ సంప్రతి మ్యూజియం ను ఆయన ప్రారంభించారు. ఈ మ్యూజియం ఇచ్చే సందేశం కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి అత్యంత కీలకమని అన్నారు. అశోక చక్రవర్తి మనవడు, అహింసా మార్గాన్ని ప్రచారం చేసిన సమ్రాట్ సంప్రతి పేరుతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సేకరించిన జైన సమాజానికి చెందిన అమూల్యమైన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో కొన్ని 1000 సంవత్సరాల కంటే పురాతనమైనవి కావడం విశేషం. దశాబ్దాల పాటు తమ జీవితాలను అంకితం చేసి, భారతదేశం, నేపాల్ నుంచి ఈ కళాఖండాలను సేకరించిన జైన సన్యాసి ఆచార్య పద్మసాగర్‌ సూరీశ్వర్జీ సేవలను ప్రధాని కొనియాడారు.

ఈ మ్యూజియం కేవలం కళాఖండాల భాండాగారం మాత్రమే కాదని, ఇది జైన ఆరాధనకు, సంస్కృతికి, వారసత్వ పరిరక్షణకు ఒక శక్తిమంతమైన కేంద్రమని మోదీ అభివర్ణించారు. కోబా తీర్థ్ ఎంతో కాలంగా శాంతికి, ఆధ్యాత్మిక సాధనకు నెలవుగా ఉందని గుర్తుచేశారు. ఈ మ్యూజియం రూపకల్పనలో వేదాలు, పురాణాలు, ఆయుర్వేదం వంటి భారతీయ సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని, ఇది మన భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు ఈ కేంద్రాన్ని పెద్ద సంఖ్యలో సందర్శించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జైన తత్వశాస్త్రం, తీర్థంకరుల జీవితాలు, ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, ఆలయ నమూనాలు, చారిత్రక కళాఖండాలతో కూడిన ఏడు గ్యాలరీలు ఈ మ్యూజియంలో ఉన్నాయన్నారు ప్రధాని. ఇక్కడ సంప్రదాయ ప్రదర్శనలతో పాటు ఆధునిక డిజిటల్, ఆడియో-విజువల్ టెక్నాలజీని మేళవించి సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తున్నారని మోదీ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: