Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం..

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం..

by CVR NEWS
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల వేతన సవరణ, అలవెన్సులు, కారుణ్య నియామకాల క్రమబద్ధీకరణ వంటి పలు కీలక డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగ భద్రత అంశాన్ని అజెండాలో చేర్చినప్పటికీ… సమయాభావం వల్ల దానిపై చర్చించే అవకాశం రాలేదని జేఏసీ నేతలు తెలిపారు. ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న 2021 వేతన సవరణను 11 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. పెంచిన వేతనాలను జూలై 1వ తేదీ నుంచి చెల్లించనున్నారు. అలాగే 2017 నాటి అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్‌ను 80 శాతానికి పెంచి ఇవ్వడానికి అధికారులు సమ్మతించారు.

కారుణ్య నియామకాల కింద బ్రెడ్ విన్నర్ స్కీమ్‌లో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయడానికి యాజమాన్యం అంగీకరించింది. వీరి సర్వీస్ సీనియారిటీని కూడా కొనసాగిస్తారు. అంతేకాకుండా, మునుముందు చేపట్టబోయే కారుణ్య నియామకాలను సైతం పూర్తిస్థాయి రెగ్యులర్ ప్రాతిపదికననే చేపట్టాలని నిర్ణయించారు. ఇక జూనియర్ అసిస్టెంట్ పరీక్ష పాస్ అయిన వారందరికీ ఈ నెలాఖరులోనే పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల 2017 వేతన సవరణ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు, ప్రభుత్వం నుంచి రుణం పొందేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల వైద్య చికిత్సల ఖర్చుల పరిమితిని రూ. 4 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు పెంచేందుకు అంగీకరించారు. గతంలో మాదిరిగానే వీరికి రెండు నెలలకు సరిపడా మందులను ఒకేసారి అందజేస్తారు. గతంలో తిరస్కరణకు గురైన హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను తిరిగి పరిశీలించి, వారికి పెన్షన్ వచ్చేలా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోనుంది. సిబ్బంది తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించే అంశంపై ఆర్టీసీ ఎండీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు, తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం రూ. 40 లక్షల వ్యయంతో విశ్రాంతి గది, డైనింగ్ హాల్‌ను నిర్మించనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: