పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం సమీపంలో ప్రవహించే జంఝావతి నది… ఈ ప్రాంత రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న జీవనాడిగా గుర్తింపు పొందింది. 1978లో ఈ నదిపై భారీ ఆనకట్టు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించినా… ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు వివాదాలు ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకిగా మారాయి. దీంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రైతుల ఆశలు కూడా అక్కడికే పరిమితమయ్యాయి. సంవత్సరాలు గడిచినా… ప్రభుత్వాలు మారినా… జంఝావతి ప్రాజెక్టు మాత్రం పూర్తికాలేదు. ఇప్పటికీ రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పంటలు దెబ్బతినడం, నీటి కొరత తీవ్రంగా ఉండటంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పూర్తి స్థాయి ఆనకట్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీటి పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జంఝావతి ప్రాజెక్టుపై ఆశలు చిగురించిన ముఖ్యమైన పరిణామం 2005లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో నదిపై రబ్బరు డ్యాం నిర్మించడం ద్వారా సాగునీటి సమస్యను కొంతవరకు తగ్గించే ప్రయత్నం జరిగింది. ఈ డ్యాం ద్వారా సుమారు 24 వేల ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు.దింతో కొంతమేర రైతులకు ఉపశమనం లభించినా… అసలు లక్ష్యమైన భారీ ఆనకట్టు నిర్మాణం మాత్రం ఇంకా నెరవేరలేదు. ఫలితంగా ప్రతి వేసవిలో నెలకొనే నీటి కొరత మళ్లీ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు సరిగా లేకపోతే పంటలు నష్టపోతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. జంఝావతి ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రలో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాగునీరు అందుబాటులోకి వస్తే పంటల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం జంఝావతి ప్రాజెక్టు విషయంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కేంద్రంలో సహా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో కూడా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండటం కీలక అంశంగా మారింది. కేంద్ర సహకారంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొంటే… దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జంఝావతి ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి ఆనకట్టు నిర్మాణం జరిగితే దాదాపు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పొలాలు పచ్చదనంతో కళకళలాడటమే కాకుండా రైతుల వలసలు కూడా తగ్గుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జంఝావతి కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు… వేలాది మంది రైతుల ఆశలు, భవిష్యత్తుతో ముడిపడిన జీవనాధారం. మరి ఈ కల ఎప్పుడు నిజమవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది.






Total views : 90594