జగిత్యాలలో భూ అక్రమార్కుల కన్ను ఇప్పుడు వాగులపై పడింది. భూముల ధరలు పెరగడంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జాకు తెరలేపుతున్నారు. తాజాగా జగిత్యాల-గొల్లపల్లి రహదారిలోని మోతె వాగు భారీ ఆక్రమణలకు గురవుతోంది.ఏడాది పొడవునా నీటితో కళకళలాడే ధరూర్-మోతె వాగులో కొద్ది రోజుల క్రితం రాత్రికి రాత్రే మట్టి పోసి ఆక్రమణలకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కాలువ నుంచి ధరూర్ మీదుగా మోతె చెరువు వరకు దాదాపు 8 కిలోమీటర్లు, అక్కడి నుంచి ముప్పాల చెరువు వరకు మరో 4 కిలోమీటర్లు… మొత్తం 12 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ వాగు ఇప్పుడు కబ్జాదారుల బారిన పడుతోంది.
ధరూర్ క్యాంపు, పద్మనాయక కల్యాణ మండపం వెనుక భాగం, నర్సింగాపూర్ రోడ్ వంతెన, గోవిందుపల్లె, సాయిరాంనగర్ దిగువ ప్రాంతాలతో పాటు మోతె వంతెన పరిసరాల్లోనూ పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఎన్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ… కొందరు పట్టాలు చూపిస్తూ భూమి తమదేనంటూ మట్టి నింపి వాగు స్వరూపాన్నే మార్చేస్తున్నారు. వర్షాకాలం ముందు ఇలాంటి ఆక్రమణలు కొనసాగితే వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోతె వాగు ఆక్రమణలు కొత్తవి కావు. 2014 తర్వాత ఈ అంశంపై వరుస కథనాలు రావడంతో అప్పటి సబ్ కలెక్టర్ శశాంక స్పందించారు. ప్రత్యేక చర్యలు చేపట్టి వాగును ఆనుకుని జరిగిన ఆక్రమణలను పొక్లెయిన్లతో తొలగించారు. దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి వాగుకు హద్దులు కూడా ఏర్పాటు చేయించారు.అయితే కొంతకాలం సైలెంట్‌గా ఉన్న భూ అక్రమార్కులు… ఇప్పుడు మళ్లీ కబ్జాలకు తెరలేపారు. నీటి ప్రవాహానికి ఆనుకుని మట్టి నింపి ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన తహసీల్దారు కార్యాలయ భవనం కూల్చివేత శిథిలాలను మోతె వాగులో పడేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. వాగు ఆక్రమణలను అరికట్టాల్సిన రెవెన్యూ శాఖకే చెందిన భవనం శిథిలాలతోనే వాగును పూడ్చివేస్తున్నారంటూ రైతులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా తిమ్మాపూర్-రఘురాములకోట రెవెన్యూ గ్రామాల పరిధిలోని ముప్పాల చెరువు నీటి వనరులకు అడ్డుగా ఉన్న ఒర్రెలు, చెరువు ఆక్రమణలను తొలగించాలని రైతులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. చెరువులు, వాగులు, ఒర్రెలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆక్రమణలను ఉపేక్షించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.
వాగు ఆక్రమణలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖకు చెందిన భవనం శిథిలాలనే వాగులో పోసి ఆక్రమణకు పాల్పడటం విచారకరమని రైతులు, మత్స్యకారులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని మోతె వాగులో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవాలని, లేకపోతే భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని గ్రామస్థులు, రైతులు హెచ్చరిస్తున్నారు.