అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో చదువుతున్న 10 ఏళ్ల విద్యార్థి కొండల్లి అఖిల్ మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బాలుడి మరణానికి గల కారణాలపై భిన్న కథనాలు వెలుగులోకి రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
హాస్టల్ వార్డెన్ తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 10వ తేదీన బాలుడికి ఫిట్స్ రావడంతో పాటు నోటిలో నురుగు రావడం గమనించి వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా, అనంతరం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు వెల్లడించారు. చికిత్స ఖర్చుల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం కూడా అందించినట్లు వార్డెన్ తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన సంబంధిత సంక్షేమ శాఖ జిల్లా అధికారి… బాలుడికి లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. అయితే తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం స్పందిస్తానన్నారు.
అయితే, కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల్లో బాలుడికి రక్త వాంతులు అయినట్లు నమోదు కావడంతో ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి. ఒకవైపు ఫిట్స్ వచ్చాయని, మరోవైపు రక్త వాంతులు అయినట్లు రికార్డుల్లో ఉండటంతో అసలు మరణానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్సీ బాలుర హాస్టల్‌లో అనుమానాస్పద మృతి.
47
previous post





Total views : 212200