రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో నంద్యాల జిల్లా, ఆత్మకూరుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని షేక్ అనీషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమరావతి వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న అనీషా, కేవలం అవార్డు తీసుకోవడమే కాకుండా వేదికపై మంత్రి లోకేష్‌తో నేరుగా ముఖాముఖి మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అవార్డు దక్కించుకున్న అనీషా… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు స్కూల్ స్థాయి నుంచే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తే వారి భవిష్యత్తు మరింత బాగుంటుందని అత్యంత ప్రతిభావంతంగా మంత్రికి సూచించారు. విద్యార్థిని అనీషా చొరవను, ఆమె ఆలోచనా విధానాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు, ఆమె ఇచ్చిన సలహాపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ… రాబోయే ఐదేళ్లలో 10, 11, 12 తరగతుల విద్యార్థులు తమ రెగ్యులర్ చదువుతో పాటే సమాంతరంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా విద్యాశాఖలో ప్రత్యేక ప్రణాళికలు తీసుకువస్తామని వేదికపైనే హామీ ఇచ్చారు. రాష్ట్రస్థాయి వేదికపై ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఇంతటి ప్రతిభ చాటడమే కాకుండా, విద్యావ్యవస్థలో మార్పు కోసం మంత్రికి సూచనలు చేయడంపై నంద్యాల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. స్థానిక విద్యాశాఖ అధికారులు, ప్రజలు అనీషా ప్రతిభను అభినందిస్తున్నారు.
Andhra Pradesh
జడ్జి ఎదుట సస్పెండైన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. కేసు ఒప్పుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. సాయికృష్ణ కేసులో సస్పెండైన సీఐ నాగరాజు న్యాయమూర్తి ముందే సంచలన విమర్శలు చేశారు. ఏపీలో తీవ్ర దుమారం రేపిన ఈ కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు వచ్చిన ఆయన.. తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ కేసులో తనను అకారణంగా ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని, బలవంతంగా నిందితుడిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని నాగరాజు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన విచారణకు తాను పూర్తిగా సహకరించానని, తన దగ్గరున్న సమాచారమంతా ఇప్పటికే అధికారులకు ఇచ్చేశానని చెప్పారు. ఇప్పుడు తన వద్ద అదనంగా చెప్పడానికి ఎలాంటి సమాచారం లేదని, పైగా పోలీస్ కస్టడీకి ఇస్తే తన ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెండెడ్ సీఐ నాగరాజు చేసిన ఈ ప్రాణభయం ఆరోపణలను న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు, ఆరోపణలపై పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా తమకు సమర్పించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు, ఈ లాకప్ డెత్ కేసులో అసలు నిజాలను బయటకు తీసేందుకు సిట్ అధికారులు నాగరాజును 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.
వాక్ స్వాతంత్ర్యం అనేది అపరిమితమైన హక్కు కాదు… దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం.. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వాక్ స్వాతంత్ర్యం వెళ్లినప్పుడు.. చట్టపరమైన చర్యలు తప్పవు అని పవన్ హెచ్చరించారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేలా ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీసులో ఏర్పాట్లు చేయబోతున్నామని పవన్ చెప్పారు.
గ్రీన్ ఎనర్జీలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఒకడుగు ముందుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్-2.0 నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఎక్కడ అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చెప్పారు. 2018లో శ్రీసిటీలో 16 వందల కోట్లతో హీరో మోటార్స్‌కు శంకుస్థాపన చేస్తే అద్భుతంగా రాణిస్తోందన్నారు. 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడ తయారయ్యాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని.. 62.20 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా 33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. 28 కేటగిరీలకు పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. పేదల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు తీసుకువస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. తాను బటన్ నొక్కే వ్యక్తిని కాదని… ప్రజల్లో ఉండే వ్యక్తిని అని స్పష్టం చేశారు. గత పాలనలో అదుపుతప్పిన డిపార్టుమెంట్లు అన్నీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయన్నారు.
ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు. ఎన్నో కలలతో వర్సిటీలోకి విద్యార్థులు అడుగు పెడతారని… భవిష్యత్తు కోసం నూతనోత్సాహంతో విద్యార్థులు తయారవుతారన్నారు. వర్సిటీలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. సమాజంలో మీవంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారామె. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల ప్రాత ముఖ్యమైందని…. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో మలేరియా పంజా విసురుతోంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా జ్వరాలతో మంచం పట్టారు. మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వాసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. అల్లూరు జిల్లా అనంతగిరి,కోట ప్రాంతాల్లో మలేరియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.రోజురోజుకి మలేరియా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ఆసుపత్రి వైద్యులే చెబుతున్నారు. చాలా గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. పసర మందుపై ఆధారపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిశిఖర గ్రామాలలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థులను కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా… భవిష్యత్ నాయకులుగా, ఆవిష్కర్తలుగా, సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలంటే నాణ్యమైన విద్య, సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు అత్యంత కీలకమని అన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, బాధ్యతాయుత నాయకత్వ లక్షణాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి వివరించారు. ప్రపంచ స్థాయి అవకాశాలకు యువతను సిద్ధం చేయడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యా వ్యవస్థను ఆధునికీకరించడం ద్వారా రాష్ట్ర యువతను ప్రపంచ పోటీతత్వానికి అనుగుణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
విద్య, నైపుణ్యం, సాంకేతికత, ఉపాధి అవకాశాలు పరస్పర అనుసంధానమైతేనే రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకుని సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ… ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా.. ఖనిజ సంపదను సమర్థవంతంగా వాడుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తీరప్రాంతంలోని బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, అలాగే ముడి ఇనుము లాంటి విలువైన ఖనిజాలను నేరుగా కాకుండా.. వాటికి వ్యాల్యూ అడిషన్ అంటే విలువ ఆధారిత ప్రక్రియలను జోడించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన మినరల్ వెల్త్ అంటే ఖనిజ సంపద ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ను ఎలా పెంచుకోవచ్చనే అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలన్నింటినీ నిశితంగా అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన నరసాపురం పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే పంతం నానాజీ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేసిన ఆయన, వ్యక్తిగత విమర్శలకు తామూ సమాధానం చెప్పగలమన్నారు. అయితే అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రాధాన్యమని, నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని తమ నాయకత్వం సూచించిందన్నారు. వైసీపీ పాలనలో సామాన్యులు, వ్యాపారులు, వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అందుకే ప్రజలు మార్పును కోరుకున్నారని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు.





Total views : 200771