విశాఖపట్నం గాజువాక 65వ వార్డు బానోజీ తోటలో ఓటర్ నమోదు కార్యక్రమంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ నమోదు చేయాల్సిన సచివాలయ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. చదువు లేని వారు దరఖాస్తులు ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. దరఖాస్తులు తమరే నింపుకోవాలని, తప్పులు రాస్తే ఓటర్ కార్డు రద్దవుతుందని సిబ్బంది బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Andhra Pradesh
డంపింగ్ యార్డ్ రహిత మునిసిపాలిటీల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. మునిసిపాలిటీల్లో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ప్లాంట్ల ఏర్పాటును త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అవసరమైన భూసేకరణ, విద్యుత్ సౌకర్యాలు, చెత్త రవాణా వాహనాల కొనుగోలుపై కమిషనర్లకు కీలక సూచనలు చేశారు.
ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ జెట్ స్పీడ్‌తో దర్యాప్తు చేపడుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణను ముమ్మరం చేసిన సిట్ అధికారులు, ఈ కేసులో మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చారు. నిందితులుగా ఉన్న హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నానిలకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. జులై 14 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అశోక్‌ను మచిలీపట్నం, నానిని ఏలూరు జైళ్లకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. సాయికృష్ణ మృతి, మృతదేహం మాయం వ్యవహారానికి సంబంధించి విజయవాడ కృష్ణలంక స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని సౌత్ ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఏసీపీ మానస వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలకు వీరిద్దరూ అన్నింటికీ మౌనం వహించారని.. ఒకటి, రెండు ప్రశ్నలకు మాత్రమే తమకేం తెలియదని పొడిపొడిగా జవాబులు ఇచ్చినట్లు తెలుస్తోంది.లాకప్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఆపై మరణించడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం, వేధింపులు ఉన్నాయనే కోణంలో సిట్ ఆధారాలను సేకరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోగా, తాజా పరిణామం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా జ్యుడిషియల్ జిల్లాలను ఏర్పాటు చేసి, అవసరమైన చోట నూతన కోర్టులను స్థాపించాలని ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించింది. పరిపాలనా జిల్లాల పునర్విభజన తర్వాత తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరినట్లు ప్రతినిధులు తెలిపారు. జ్యుడిషియల్ అధికారుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, అధికారుల కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు. వీటితో పాటు సాఫ్ట్ లోన్ పరిమితిని పెంచాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని విన్నవించారు. అసోసియేషన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. జ్యుడిషియల్ జిల్లాల ఏర్పాటు, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా జులై 1 నుంచి 5 రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆయా జిల్లాల్లోనే బస చేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
జులై 1న తన పర్యటనను సంక్షేమ కార్యక్రమంతో ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అదే రోజు తిరుపతి జిల్లా శ్రీ సిటీకి చేరుకుంటారు. అక్కడ ప్రముఖ బైకుల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.750 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు తిరుపతిలోనే బస చేస్తారు.
జులై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వీబీజీ రామ్‌జీను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగే జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌కు హాజరవుతారు. ఈ కీలక సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు కూడా పాల్గొననున్నారు. రెండో రోజు రాత్రి కూడా సీఎం తిరుపతిలోనే బస చేస్తారు.
పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టంగా జులై 3న కడప జిల్లా పర్యటన ఉండనుంది. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన స్టీల్ ప్లాంట్ పనులకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను లాంఛనంగా ప్రారంభించి, ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయనున్నారు.
స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించిన అనంతరం, చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు బయలుదేరి వెళతారు. జులై 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమై, స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. మూడు రోజుల కుప్పం పర్యటన ముగించుకుని జులై 5న తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఈ ఐదు రోజుల పర్యటన ద్వారా ఒకేసారి సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భూమి, పశుసంపద, ప్రకృతిని అనుసంధానం చేసే గొప్ప సంప్రదాయమే ఏరువాక పండుగ అని అన్నారు.ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రైతులకు లాభసాటి పంటలు వచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతు నష్టపోకుండా ఉండేందుకు ఎరువులు, విత్తనాలు, సాగునీరు, మార్కెటింగ్ సదుపాయాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పత్తిపాటి పుల్లారావు.. రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జూలై 1 నుంచే కృష్ణా జలాలను విడుదల చేసి సాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలని పేర్కొన్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు.. రైతులు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే విశిష్టమైన పండుగ ఏరువాక అని వివరించారు. పాడిపంటలతో రైతుల ఇళ్లలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ నిధులు జమ చేసి రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు ముఖ్యమంత్రి. ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలని సూచించారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి, మన భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగులో సిరులు పండించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హిందూ సామ్రాజ్య దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో ‘శౌర్య యాత్ర’ ఘనంగా నిర్వహించారు. చినఅమిరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ అడ్డవంతెన, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ మీదుగా సాగి రామాలయం వద్ద ముగిసింది. ముగింపు సభలో శివాజీ మహారాజ్ దేశ గౌరవానికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. లాకప్ డెత్ అనంతర పరిణామాలపై సురేష్‌ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన తరువాత సీఐ నాగరాజుకి సురేష్ సహకరించినట్లు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు.
ఐతే సాయికృష్ణ లాకప్ డెత్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని జాడ ఇంకా కనిపించలేదు. సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో వీరి పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వారి కోసం వేట కొనసాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపర్చాలని సౌత్ ఏసీపీకి సిట్ అధికారులు ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీరిని సిట్ నిందితులుగా చేర్చింది. వారిద్దరినీ నగర సీపీ రాజశేఖరబాబు సస్పెండ్ చేశారు. వీరు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చని భావిస్తున్నారు.
కృష్ణలంక స్టేషన్లో సీఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన పదిమందిపై సిట్ గురిపెట్టింది. వీరిలో కీలకంగా ఉన్న సురేష్ నుంచి పలు వివరాలు సేకరిస్తోంది సిట్. టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణను రెండోసారి పిలిచి విచారించింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే రెండుసార్లు విచారించారు. స్టేషన్లో సెక్షన్ ఇన్‌ఛార్జి అయిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, అలాగే బాబూరావుతో పాటు మరో హోంగార్డును కూడా ప్రశ్నించారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు.. సౌత్ ఏసీపీ మానసపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే.. అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. ఇన్స్పెక్టర్పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..సాయికృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో అతని తల్లి విజయలక్ష్మి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్..సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కేసులో దర్యాప్తు పురోగతి, న్యాయస్థానానికి నివేదించాల్సిన అంశాలపై సిట్ అధికారులు.. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు విచారణలో వెలుగుచూసిన అంశాలపై చర్చించారు.
బారాషాహిద్ దర్గా మరింత అభివృద్ధి చెందడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. కుటుంబ సమేతంగా దర్గాను దర్శించుకున్న ఆయన… పవిత్ర రొట్టెల పండగ తమ కుటుంబానికి ఒక సెంటిమెంట్ అని పేర్కొన్నారు. గతంలో తాను స్వీకరించిన ఎమ్మెల్యే రొట్టెను, ఈసారి తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అందించారు. బారాషాహీద్ ఆశీస్సులతో 2029 ఎన్నికల్లో తన సోదరుడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.





Total views : 200851